Alcohol Prices : మద్యం ధరలు పెంచేది లేదు!
ABN, Publish Date - Dec 04 , 2024 | 05:55 AM
ధరలు పెంచాలంటూ మద్యం ఉత్పత్తిదార్లు ఒత్తిడి తెస్తున్నా, మద్యం అమ్మకాల నుంచి ఆశించినంత ఆదాయం రాకున్నా.. మద్యం ధరలు పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ
స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. బీఆర్‌ఎస్ హయాంలో ఏటా పెంపు
ఇప్పుడూ ఆ విధానాన్నే అనుసరించాలంటూ ఉత్పత్తిదారుల ఒత్తిడి
త్రిసభ్య కమిటీ సిఫారసు చేసినా అంగీకరించని సర్కారు
హైదరాబాద్, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ధరలు పెంచాలంటూ మద్యం ఉత్పత్తిదార్లు ఒత్తిడి తెస్తున్నా, మద్యం అమ్మకాల నుంచి ఆశించినంత ఆదాయం రాకున్నా.. మద్యం ధరలు పెంచటానికి రాష్ట్ర ప్రభుత్వం ససేమిరా అంటోంది. ఈ మేరకు ధరల పెరుగుదల ఇప్పట్లో ఉండబోదని స్పష్టం చేసింది. ధరలు పెంచాలంటూ త్రిసభ్య కమిటీ నివేదిక ఇచ్చినా.. ప్రభుత్వం తిరస్కరించినట్టు తెలిసింది. సాధారణంగా, రాష్ట్రంలో మద్యం ధరలు ఏటా పెరుగుతూ ఉంటాయి. ధరల పెంపు కోసం ప్రత్యేకంగా ఓ కమిటీ కూడా ఉంది. హైకోర్టు మాజీ న్యాయమూర్తి నేతృత్వంలో విశ్రాంత ఐఏఎస్, సీనియర్ చార్టర్డ్ అకౌంటెంట్ ఇందులో సభ్యులుగా ఉన్నారు. ప్రతీ రెండేళ్లకోసారి ఈ కమిటీ ఇతర రాష్ట్రాల్లో మద్యం ధరలను, ఇక్కడ మద్యం తయారీ కంపెనీల కమీషన్లను అధ్యయనం చేస్తుంది. పెంపు ఎంతమేరకు ఉండాలనేది ప్రభుత్వానికి సిఫారసు చేస్తుంది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచాలని నాలుగు నెలల క్రితమే ఈ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. బీర్ల ధరలు రూ.20 చొప్పున, ఇతర మద్యం ధరలు 700 మి.లీ.లకు రూ.30-40 చొప్పున పెంచాలని సిఫారసు చేసినట్టు సమాచారం. మరోవైపు,2024-25 ఆర్థిక సంవత్సరంలో మద్యం విక్రయాల ద్వారా రూ.25,617 కోట్ల ఆదాయాన్ని సముపార్జించాలని ప్రభుత్వం ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేందుకు డిసెంబరు తర్వాత ఇంకా మూడు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటి వరకూ వచ్చిన ఆదాయం.. లక్ష్యానికి రూ.2 వేల కోట్ల దూరంలో ఉందని అధికారవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో, ధరలు 5-10 శాతం పెంచినా.. లక్ష్యం సాధించడంతోపాటు అదనంగా రూ.5 వేల కోట్లు సమకూరే అవకాశాలున్నాయి. అయినప్పటికీ, ప్రభుత్వానికి మద్యం ధరలు పెంచే ఆలోచన లేదని స్పష్టమవుతోంది.
ఆదాయం కావాల్సినప్పుడల్లా పెంపు..
రాష్ట్రవ్యాప్తంగా 15 మద్యం తయారీ కేంద్రాలున్నాయి. రాష్ట్రంలో ఏటా 360-400 లక్షల లిక్కర్ కేసులు, 400-450 లక్షల బీర్ కేసులు విక్రయిస్తున్నారు.ఖజానాకు ఆదాయం కావాల్సినప్పుడల్లా ప్రభుత్వాలు ముందుగా ఆలోచించేది మద్యం ధరల పెంపునే. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏటా మద్యం ధరలు పెంచుతూ పోయింది. ఓ ఏడాది బీర్ల ధరలు, మరో ఏడాది మద్యం ధరలు పెంచేవారు. చివరిసారిగా 2022 మే నెలలో బీర్ల ధరలు పెంచగా.. 2023 మే నెలలో లిక్కర్ ధరలు పెంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఒక్కసారి కూడా ధరల పెంపు జరగలేదు. అయితే గత ప్రభుత్వంలాగా ఏటా ధరలు పెంచాలంటూ.. మద్యం ఉత్పత్తిదారులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారు. రెండేళ్ల క్రితం ఒక ఖాళీ బీరు సీసా ఉత్పత్తి ధర రూ. 5-6 ఉండగా.. ఇప్పుడు రూ.9కి పెరిగిందని, ఇతరత్రా నిర్వహణ వ్యయం కూడా పెరిగిందంటూ బీరు తయారీదార్లు చెబుతున్నారు. పెంపు భారం ప్రజలపై పడకుండా.. పన్నులు తగ్గించి తమ కమీషన్ పెంచాలని కోరుతున్నా సర్కారు అంగీకరించటం లేదు. ధరల పెంపుపై ఇప్పట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోమని ప్రభుత్వం స్పష్టం చేసినట్టు తెలిసింది. మద్యం ఉత్పత్తిదారుల సంగతి ఎలా ఉన్నా.. మద్యం ప్రియులకు మాత్రం ఇది ఊరటనిచ్చే నిర్ణయమే.
Updated Date - Dec 04 , 2024 | 05:55 AM