అభ్యర్థులపై ఇంకా అస్పష్టతే!
ABN, Publish Date - Mar 26 , 2024 | 03:50 AM
రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్ 17 సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమైతే మెజారిటీ సీట్లు కాంగ్రెస్
ఇంకా పెండింగ్‌లోనే 8 పార్లమెంట్ స్థానాలు.. కాంగ్రెస్ టికెట్ల కోసం తీవ్ర పోటీ
మూడు చోట్ల తెరపైకి బీసీ నేతల పేర్లు!.. రేపు ఢిల్లీలో ఏఐసీసీ సీఈసీ సమావేశం
హాజరుకానున్న రేవంత్, భట్టి, ఉత్తమ్.. మెజారిటీ సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యే చాన్స్
హైదరాబాద్, మార్చి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలైన బీజేపీ, బీఆర్‌ఎస్ 17 సీట్లలోనూ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారానికి రంగం సిద్ధం చేసుకుంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థుల ఎంపికపై మల్లగుల్లాలు పడుతోంది. పెండింగ్‌లో ఉన్న ఎనిమిది సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేయడం ఆ పార్టీకి కత్తిమీద సాములా మారింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ పునరావృతమైతే మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పార్టీకి దక్కే పరిస్థితులు ఉండడంతో.. టికెట్ల కోసం పోటీ తీవ్రంగా ఉంది. అయితే సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితి, స్థానికంగా నేతల నుంచి అందే సహకారం, సర్వేలు, ఇతర అంశాల ఆధారంగా కసరత్తు కొనసాగుతోంది. బీఆర్‌ఎస్, బీజేపీ నుంచి వచ్చిన రంజిత్‌రెడ్డి, పట్నం సునీతా మహేందర్‌రెడ్డి, దానం నాగేందర్‌తోపాటు గడ్డం వంశీకృష్ణకు టికెట్ ఇవ్వడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేతలు పలువురు తప్పుబట్టడంతో పెండింగ్ సీట్లలో అభ్యర్థుల ఎంపిక.. పార్టీ నాయకత్వానికి మరింత సవాల్‌గా మారింది. అయితే ఒకటి, రెండు మినహా.. మిగిలిన సీట్లకు అభ్యర్థుల ఎంపికపై తర్జన భర్జనకు బుధవారం తెర పడవచ్చని తెలుస్తోంది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై ఏఐసీసీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) బుధవారం ఢిల్లీలో సమావేశం కానుంది. దీనికి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు. ఈ భేటీలో ఆరేడు సీట్లపై స్పష్టత వస్తుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
నీలం మధు ఆర్థిక సమర్థతపై సందేహాలు?
మెదక్ స్థానానికి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధుకు టికెట్ దాదాపు ఖరారైనా.. బీజేపీ, బీఆర్‌ఎస్ అభ్యర్థులను ఎదుర్కొనడంలో ఆయన ఆర్థిక సమర్థతపై పార్టీ నేతలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన చెంగల నరేంద్రనాథ్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇక నిజామాబాద్ నుంచి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభ్యర్థిత్వంపై నేతల్లో వ్యతిరేకత లేకపోయినా.. సామాజిక సమతుల్యత కోణంలో స్థానిక బీసీ నేత పేరును పరిశీలిస్తున్నారు. కాగా, కరీంనగర్‌లో ప్రవీణ్‌రెడ్డి, వెలిచాల రాజేందర్ మధ్యనే పోటీ నడుస్తోంది. ఆదిలాబాద్‌లో ఉపాధ్యాయురాలు ఆత్రం సుగుణ, రిమ్స్ డాక్టర్ సుమలత పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అయితే ఆత్రం సుగుణ వైపే పార్టీ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు చెబుతున్నారు. నాగర్ కర్నూలు, పెద్దపల్లి సీట్లు మాల సామాజికవర్గానికి చెందిన మల్లు రవి, వంశీకృష్ణలకు ఖరారు చేయడంతో.. వరంగల్ సీటును కచ్చితంగా మాదిగ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది. పార్టీ నేత దొమ్మాటి సాంబయ్యకు సీఎం రేవంత్‌రెడ్డి మద్దతు పలుకుతుండగా.. స్థానిక విద్యావేత్త పరంజ్యోతి పేరును మంత్రి కొండా సురేఖ ప్రతిపాదిస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే స్టేషన్‌ఘన్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఇందిర, స్థానిక మహిళా నేత బొడ్డు సునీత కూడా తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.
ఖమ్మం, భువనగిరిలో ఎవరి పట్టు వారిదే!
ఖమ్మం, భువనగిరి స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు.. క్లిష్టంగా మారింది. ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క సతీమణి నందిని, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్‌రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు తనయుడు యుగంధర్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ్‌కుమార్ పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నాయి. కమ్మ సామాజికవర్గం కోటాలో యుగంధర్, కుసుమ్‌కుమార్ ఈ సీటును ఆశిస్తున్నారు. అయితే ప్రధానంగా ప్రసాద్‌రెడ్డి, నందిని మధ్యే పోటీ ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కమ్మ సామాజికవర్గానికి ఇప్పటికే ఒక రాజ్యసభ సీటు, మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చిన విషయాన్ని తెరపైకి తెస్తున్నాయి. ఖమ్మం నుంచి బీసీ నేతకు అవకాశం కల్పించే అంశంపైనా పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక భువనగిరి టికెట్ కోసం రేవంత్‌సన్నిహితుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి భార్య లక్ష్మి మధ్యే పోటీ తీవ్రంగా ఉంది. అయితే ఈ సీటును కూడా బీసీలకు కేటాయించాలన్న వాదనను రాజగోపాల్‌రెడ్డి తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం జరగనున్న సీఈసీ భేటీలో ఈ సీట్లపై స్పష్టత వస్తుందా? లేదా? అన్నది అనుమానంగా మారింది.
Updated Date - Mar 26 , 2024 | 03:50 AM