‘పరిషత్’ల్లో ఇక ప్రత్యేక పాలన!
ABN, Publish Date - Jul 03 , 2024 | 11:33 PM
జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. మండల, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ‘ప్రత్యేక’ పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. పరిషత్తులో ఇకపై పాలన బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం జీవో జారీ చేసింది.
నిన్నటితో ఎంపీటీసీ, నేటితో జడ్పీటీసీ పదవీకాలం ముగింపు
ప్రత్యేక అధికారుల నియామకం
ఎన్నికల నిర్వహణపై సందిగ్ధత
బీసీ కులగణన తర్వాతే నిర్వహణ?
జనగామ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల పరిషత్‌లలో ప్రత్యేక అధికారుల పాలనకు రంగం సిద్ధమైంది. మండల, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో ‘ప్రత్యేక’ పాలన దిశగా ప్రభుత్వం అడుగులు వేసింది. పరిషత్తులో ఇకపై పాలన బాధ్యతలను జిల్లా అధికారులకు అప్పగిస్తూ ప్రభుత్వం బుధవారం మధ్యాహ్నం జీవో జారీ చేసింది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని మండల పరిషత్, జిల్లా పరిషత్‌లు అధికారుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రజల ఓట్లతో ఎంపీటీసీ, జడ్పీటీసీ లుగా ఎన్నికై ఐదేళ్ల పాటు సేవలు అందించిన సభ్యు లు ఇక నుంచి ‘మాజీ’లు కాబోతున్నారు. ఎంపీటీసీ, ఎంపీపీల పదవీకాలం బుధవారంతో ముగియగా, జడ్పీటీసీ పదవీకాలం గురువారంతో పూర్తి కానుంది. జిల్లావ్యాప్తంగా 12 మండలాల పరిధిలో 281 గ్రామపంచాయతీలు ఉండగా, 128 మంది ఎంపీటీసీలు ఉన్నారు. 12 మండలాలకు గానూ 12 మంది ఎంపీపీలు, 12 మంది జడ్పీటీసీలు ఉన్నారు. వీరంతా ఇకపై ‘మాజీ’లుగా మిగిలిపోనున్నారు.
ఇక ‘ప్రత్యేక’ పాలన
మండల, జిల్లా పరిషత్ సభ్యుల పదవీకాలం ముగియడంతో పరిషత్‌ల పాలనావ్యవస్థ అంతా అధికారుల చేతుల్లోకి వెళ్లనంది. ఐదేళ్ల పాటు సేవలు అందించిన సభ్యులంతా ఇక మాజీ సభ్యులుగా మిగిలిపోనున్నారు. పాలనా వ్యవహారాల్లో ఇకపై వారి జోక్యం ఉండబోదు. మండల, జిల్లా పరిషత్‌లకు వచ్చే నిధులు ఖర్చు, ఇతర పాలనాపరమైన అంశాలను మండల పరిషత్, జిల్లా పరిషత్‌కు కేటాయించిన అధికారులే పర్యవేక్షిస్తారు. ప్రత్యేక అధికారుల నియామకానికి సంబంధించి ప్రభుత్వం జీవో విడుదల చేయడంతో జిల్లా పరిషత్ కార్యాలయం ప్రత్యేక అధికారుల కేటాయింపుపై దృష్టి పెట్టింది. మండల పరిషత్‌లకు జిల్లా స్థాయి అధికారి ప్రత్యేక అధికారిగా నియమించనుండగా జిల్లా పరిషత్‌కు జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తారు. దీనిపై సంబంధించిన కసరత్తు పూర్తయింది. జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో జిల్లా స్థాయి అధికారులు గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఇదే క్రమంలో పరిషత్తుల బాధ్యతలు సైతం వారికే అప్పగించారు.
‘పొడగింపు’పై ఆశలు గల్లంతు
తమ పదవీకాలాన్ని మరికొంత కాలం పొడగిస్తారని భావించిన ఎంపీటీసీ, జడ్పీటీసీల ఆశలను ప్రభుత్వం అడియాశలు చేసింది. మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో తమ పదవీకాలాన్ని పెంచుతారని సభ్యులు భావించారు. కానీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పొడగింపు ఇవ్వకుండా ‘ప్రత్యేక’ పాలనకే మొగ్గుచూపింది. పదవీకాలాన్ని పెంచాలంటూ రాష్ట్రవ్యాప్తంగా మండల, జిల్లా పరిషత్ సభ్యుల నుంచి ప్రభుత్వానికి వినతులు సైతం వెళ్లాయి. ఇప్పట్లో ఎన్నికలు లేనందున తమను మరికొంత కాలం కొనసాగించాలంటూ విజ్ఞప్తులు ప్రభుత్వానికి అందాయి. కానీ ప్రభుత్వం వాటిని లెక్కలోకి తీసుకోలేదు. జనవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమించారు. సర్పంచులకు పొడగింపు ఇవ్వకుండా ఎంపీటీసీ, జడ్పీటీసీలకు పొడగింపు ఇస్తే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
ఇప్పట్లో ఎన్నికలు లేనట్టే..
ప్రత్యేక అధికారులను నియమించడంతో మం డల, జిల్లా పరిషత్తులతో పాటు సర్పంచు స్థానాలకు సైతం ఇప్పట్లో ఎన్నికలు జరిగేలా కనిపించడం లేదు. సర్పంచుల పద వీకాలం జనవరి నెలలో ముగియగా ఆ లోపే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. కానీ.. రాష్ట్రంలో అప్పుడే కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో సమయం లేకపోవడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగు వేయలేదు. ఫిబ్రవరి, మార్చి నెలలో నిర్వహించాలని భావించగా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇదే క్రమంలో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం దగ్గరపడినప్పటికీ ప్రభుత్వం మాత్రం ఎన్నికలకు వెళ్లలేదు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కావడం, రాజకీయంగా కొంత అస్థిరత ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడం మంచిది కాదని అధికార కాంగ్రెస్ భావించింది. దీనితో పాటు రాష్ట్రంలోని స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల మార్పు, బీసీ కుల గణన వంటి అంశాలు ఎన్నికలను వాయిదా వేయడానికి కారణంగా మారాయి. 2018లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో పదేళ్లకు ఒకే రిజర్వేషన్లను తీసుకువచ్చింది. దీంతో ఈసారి ఎన్నికలు జరిగితే గతంలో ఉన్న రిజర్వేషన్లతోనే జరగాల్సి ఉంటుంది. కానీ.. 2018లో తీసుకువచ్చిన రిజర్వేషన్ల వల్ల తమకు అన్యాయం జరిగిందని బీసీ కుల సంఘాలు చెబుతూ వస్తున్నాయి. బీసీ కులగణను పూర్తి చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని పట్టుబడుతూ వస్తున్నాయి. బీసీ కులగణన చేపడితే ఎస్సీ, ఎస్టీలకు సైతం రిజర్వేషన్లలో న్యాయం జరుగుతుందని అంటున్నారు. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. బీసీ కులగణనను ఇప్పకిప్పుడు మొదలు పెట్టినా రాష్ట్రవ్యాప్తంగా పూర్తికావడానికి రెండు, మూడు నెలలకు పైగా సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో ఎన్నికల జరపడానికి అవకాశం ఉంది. కానీ.. వచ్చే ఏడాది జనవరిలో మునిసిపల్ పాలకవర్గాల పదవీకాలం కూడా ముగియనుంది.
దీనికి తోడు ప్రస్తుతం నియమించిన ప్రత్యేక అధికారుల పదవీకాలం 6 నెలల వరకు ఉంటుంది. దీంతో వచ్చే జనవరిలోనే ఎన్నికలు నిర్వహించాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
Updated Date - Jul 03 , 2024 | 11:33 PM