ఏం కొనేటట్టు లేదు..
ABN, Publish Date - Jun 23 , 2024 | 11:49 PM
కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన పచ్చిమిర్చి, ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.
చుక్కలనం టుతున్న కూరగాయల ధరలు
సాగు లేకపోవడంతోనే పెరుగుదల
వర్షాలు సమృద్ధిగా కురవక తగ్గిన దిగుబడులు
బెంబేలెత్తుతున్న జనం
జనగామ కల్చరల్, జూన్ 23: కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వంటింట్లో తప్పనిసరైన పచ్చిమిర్చి, ఉల్లి ఘాటు కన్నీరు తెప్పిస్తుంటే.. టమాటా ధరలు దడ పుట్టిస్తున్నాయి. కొద్ది రోజుల వ్యవధిలోనే కూరగాయల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి. మార్కెట్‌లో కూరగాయల ధరలన్నీ దాదాపు వంద రూపాయలపైనే ఉన్నాయి. బతకడానికి ఆహారం కావాలి. అందులో తప్పనిసరిగా కూరగాయలు ఉండాల్సిందే. అలాంటి తప్పనిసరైన నిత్యావసర వస్తువుల ధరలు పెరగడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు.
కొన్న ధరలకే అమ్మకాలు..
జిల్లా వ్యాప్తంగా కూరగాయల వ్యాపారస్తులు నెల రోజులుగా తెచ్చిన ధరలకే సరుకు అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కూరగాయల ధరలు ఎక్కువగా ఉండడంతో ప్రజలు కొనడం లేదని, కొన్ని సందర్భాల్లో పడేయాల్సి వస్తోందని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీన్స్, కాకరకాయ, బీరకాయ, టమాటా, క్యాబేజీ, పచ్చిమిర్చి, క్యాలీఫ్లవర్ తదితర కూరగాయల ధరలు బాగా పెరిగాయి. సూపర్ మార్కెట్‌లో కూరగా యల ధరలు మరింత అధికంగా ఉన్నాయి. చాలా మంది వారాంతపు సంతల్లో ధరలు తక్కువగా ఉంటాయన్న ఆలోచనతో అక్కడకు వెళ్లినా అదే పరిస్థితి ఉండడంతో నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు.
ఠారెత్తిస్తున్న ధరలు
అన్ని కూరల్లో వాడుకునేది టమాటా. కూరగాయ ల్లో టమాట ధరలు వింతగా ఉంటాయి. వాటి సీజన్ బట్టి అత్యల్ప ధరల నుంచి అత్యధిక ధరలకు పెరుగు తుంటాయి. కొద్ది నెలల క్రితం కిలో రూ.30 ధర పలికి న టమాటా ప్రస్తుతం రూ.60లకు చేరుకుంది. కూర గాయలు తీసుకుంటే వ్యాపారులు కొసరుగా కొన్ని పచ్చిమిరపకాయలు వేసేవారు. నెల రోజులుగా పచ్చిమిరప ధరలు భగ్గుమంటున్నా యి. కిలో పచ్చి మిరపకాయలు రూ.120 అమ్ముతుం టే ఇక కొసరు వేయలేమని వ్యాపారులు చెబుతు న్నారు. ఏ కాలమైనా దొరికే కూరగాయల్లో బీరకా య ఒకటి. అదీ సీజన్‌ను బట్టి మారుతుంటుంది. ప్రస్తుతం బీరకాయల ధర రూ.100 వరకు ఉండటంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. వీటి ధరలు ఇంతగా ఎన్నడూ పెరగలేదని వాపోతున్నారు. నెల రోజుల క్రితం రూ.80 ఉన్న ధర విపరీతంగా పెరగగా సరుకు సైతం తక్కువగానే ఉంటోంది.
అధిక పోషక విలువ లున్న కూరగాయల్లో క్యాప్సి కం ఒకటి. ప్రస్తుతం క్యాప్సి కం కిలో ధర రూ.120 దాట డంతో వినియోగదారులు కొనలేని పరిస్థితి నెలకొంది. ఇటీవలి వరకు రూ.60 ఉన్న ధర ఒక్కసారిగా పెరిగిపోయింది. ఒకప్పుడు తక్కువ ధర అంటే (చిక్కుడు కాయ) బీన్స్ మాత్రమే. ఎందుకంటే ఇళ్లల్లో కూడా చెట్లు పెంచుకుంటే ఇంటికి సరిపడా కాయలు కాసేవి. ఇప్పుడు ఆసేద్యం కనుమరుగైంది. ఏవి కావాలన్నా మార్కెట్‌కు వెళ్లాల్సిందే. ప్రస్తుతం బీన్స్ ధర రూ.100 ఉందంటే అతిశయోక్తి కాదు. అది కూడా నాణ్యమైనదిగా లేదు. అదే కోవలోకి గోరుచిక్కుడు కూడా చేరింది. అదే ధర పలుకుతుండగా వాడిపోయి, సగం ఎండిపోయి కనిపిస్తోంది.
దుంపల విషయానికి వస్తే ఆలుగడ్డ, చేమగడ్డ, క్యారెట్, బీట్‌రూట్ ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం దుంపలు కూడా రూ.80 నుంచి రూ.100 వరకు విక్రయాలు జరుగుతున్నాయి. కాగా, బెండకాయ, దొండకాయ, సోరకాయ, వంకాయ, దోస, క్యాబేజీ తదితర కూరగాయలు మాత్రం రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతున్నాయి. వీటిని చూసిన వినియోగదారులు మాత్రం పరవాలేదంటూ కొంటున్నారు.
పిరమైన ఆకు కూరలు..
పట్టణంలోని మార్కెట్‌లో కొద్దిరోజుల వరకు రూ.10లకు రెండు కట్టల చొప్పున ఆకుకూరలు విక్రయించారు. ప్రస్తుతం రూ.20లకు 2 లేదా 3 కట్టలు మాత్రమే ఇస్తున్నారు. కొత్తిమీర, పూదీనా కిలో రూ.200లకు చేరింది. గతంలో రోజుకు 60-70 కట్టలు విక్రయించిన వ్యాపారులు ఇప్పుడు 10-20 మాత్రమే విక్రయాలు జరుగుతున్నాయంటున్నారు. ధర ఎక్కువగా ఉండటంతో నిల్వ ఉంచితే పాడై పోతాయనే భయంతో తక్కువ మొత్తంలోనే తెచ్చి అమ్ముతున్నారు.
వేసవి ప్రభావం..
వేసవి కారణంగా వర్షాలు లేకపోవడం, దిగుబడులు తగ్గిపోవడం ధరలపై కొంత ప్రభావం పడింది. యాసంగిలో నీటి కొరత ఏర్పడటం, వర్షాలు లేకపోవడం మూలంగా తక్కువ శాతం కూరగాయల పంటలు సాగు చేస్తారు. పంట కొతకొచ్చే సమయానికి అకాల వర్షాలు రావడంతో కొంత వరకు పాడైపోతున్నాయి. దీంతో దిగుబడి తగ్గి ధరలు పెరుగుతున్నాయి.
తప్పనిసరి పరిస్థితుల్లో కొనుగోలు చేస్తున్నాం...
- కందుల యాదగిరి, వినియోగదారుడు
పెరిగిన కూరగాయల ధరలు చూస్తుంటే భయమేస్తుంది. ఇష్టమైన కూరగాయలను కూడా కష్టంగా కొనాల్సి వస్తోంది. నెలంతా కష్టపడినా సంపాదన చాలడం లేదు. రోజురోజుకూ పెరిగిపోతున్న ధరలతో కూరగాయల కంటే చికెన్ ధరలే నయమ నిపిస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో కూరగా యలు కొనుగోలు చేస్తున్నాం.
హోల్‌సేల్ మార్కెట్ నుంచే ఎక్కువ ధరలు
- రేణుక, వ్యాపారి, జనగామ
వర్షాభావ పరిస్థితులు, వేసవి కాలం మూలంగా హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఎక్కువ ధరలు పలుకుతున్నాయి. కిలో కూరగాయలపై రూ.10 మార్జిన్‌తోనే విక్రయాలు జరుగుతాయి. టమాటా లాంటి కూరగాయలు ఎక్కువగా తెస్తే కొనుగోళ్లు లేకుంటే పారవేయాల్సి వస్తోంది. దాంతో నష్టం వస్తోంది. అందుకే తక్కువ స్థాయిలోనే కూరగాయలు మార్కెట్‌కు తెస్తున్నాం.
Updated Date - Jun 23 , 2024 | 11:49 PM