పాఠశాలలకు ఉచిత విద్యుత్
ABN, Publish Date - Sep 28 , 2024 | 12:04 AM
ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇందన శాఖ జీవోఎంఎస్ నం.20 జారీ చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు విద్యుత్ తప్పనిసరి. బిల్లులు పేరుకుపోతే విద్యుత్ సంస్థ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది.
ఆన్‌లైన్ పోర్టల్‌లో వివరాలు
బకాయిల చెల్లింపుపై లేని స్పష్టత
జనగామ కల్చరల్, సెప్టెంబరు 27: ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ఇందన శాఖ జీవోఎంఎస్ నం.20 జారీ చేసింది. ప్రభుత్వ విద్యాసంస్థల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు విద్యుత్ తప్పనిసరి. బిల్లులు పేరుకుపోతే విద్యుత్ సంస్థ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తుంది. దీంతో కరంటు సరఫరాలో అంతరాయం కలిగి డిజిటల్ పాఠాలకు ఆటంకం ఏర్పడుతుంది. అంతేగాకుండా పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు స్కూళ్లు విద్యార్థులకు ఏసీ సౌకర్యం కల్పిస్తున్నాయి. ఇక ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి వర్ణనాతీతం. కొన్ని పాఠశాలల్లో కనీసం ఫ్యాన్లు కూడా లేని దుస్థితిలో ఉన్నాయి. ఒకవేళ ఫ్యాన్లు ఏర్పాటు చేసినప్పటికీ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో అవి పనిచేయని స్థితిలో ఉన్నాయి. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు కొరవడుతుండడంతో రోజురోజుకూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య క్రమేపీ తగ్గుతోంది. ఈ క్రమంలో ప్రభుత్వ విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పిస్తే అవిబలోపేతమయ్యే అవకాశముంది.
ఆన్‌లైన్ పోర్టల్ ...
ఉచిత విద్యుత్ అందించే ధ్యేయంతో విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రభుత్వ పాఠశాలల వారీగా ప్రత్యేకంగా ఆన్‌లైన్ పోర్టల్ రూపొందిస్తున్నాయి. సంబందిత సంస్థలకు లాగిన్ అవకాశం కల్పిస్తున్నాయి. ఈ క్రమంలో సంబంధిత శాఖల కార్యదర్శులు పాఠశాలల వివరాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో నమోదు చేస్తాయి. ఈ పోర్టల్‌లో వివరాలు నిక్షిప్తం చేసిన సంస్థలకు డిస్కంలు యూనిట్ల వారీగా బిల్లులు నిక్షిప్తం చేస్తాయి. దీంతో పాటు సంబందిత శాఖ బాద్యులకు బిల్లు హార్డ్ కాపీ ఇస్తారు. పోర్టల్‌లో డిస్కంలు పొందుపరిచిన బిల్లుల మేరకు ఆయా శాఖల బిల్లుల చెల్లింపునకు సంబందించిన నివేదికలు తయారు చేసుకునేందుకు వీలు కలుగుతుంది. సంస్థలు, జిల్లా, మండలాల వారీగా బిల్లుల సమాచారం పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ బిల్లులు చెల్లించేందుకు వీలుగా ఆయా శాఖలను ఆర్థిక శాఖ పోర్టల్‌తో అనుసంధానిస్తారు. ఉచిత విద్యుత్‌తో విద్యాసంస్థలపై బిల్లుల భారం తప్పనుంది.
బకాయిలు చెల్లించాలి..
ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ అందిస్తామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ ప్రభుత్వం బకాయిల చెల్లింపులపై ఎక్కడా ప్రస్తావించలేదు. ఈ క్రమంలో బకాయిలు ఎవరు చెల్లిస్తారని అధికారులు ప్రశ్ని స్తున్నారు. బకాయి లు రాబట్టుకోవడానికి పంపిణీ సంస్థలు ఎప్పటి మాదిరిగానే విద్యుత్ సరఫరా నిలిపివేస్తే ఉచిత విద్యుత్ పథకం అభాసుపాలయ్యే అవకాశముందని మేధావి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం బకాయి ల చెల్లింపుపై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది.
మెయింటెనెన్స్ నిధులు అంతంతే
సర్కారు బడులకు జీరో విద్యుత్ బిల్లుల సౌక ర్యం కల్పించనుండడంతో పేద విద్యార్థులకు మేలు జరుగనుంది. వేసవిలో కరెంట్ కనెక్షన్లు లేని పాఠశాల ల్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులున్నాయి. పాఠశాలలకు చాలీచాలని మెయింటెనెన్స్ నిధులు విడుదలవుతుండగా ఇవి విద్యుత్ నిర్వహణకే సరిపోతున్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇటీవల ప్రభుత్వం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించింది. ఫ్యాన్లు, ప్రొజెక్టర్లు, ట్యూబ్‌లైట్లు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం, వాటర్ ప్లాంట్లు, కంప్యూటర్ విద్య తదితరాల నిర్వ హణకు విద్యుత్ అవసరం ఉంటుంది. దీంతో ఒక్కో పాఠశాలకు రూ.500.ల నుంచి రూ.800.ల వరకు బిల్లు వస్తోంది. మెయింటెనెన్స్ గ్రాంటు సంవత్సరానికి రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు విడుదల చేస్తున్నారు. ఈ నిధులు పాఠశాలల్లోని మౌలిక వసతులకే సరిపోయే పరిస్థితి లేదు. బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో చాలామంది ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది సొంత డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.
సీఎం నిర్ణయం హర్షనీయం : కె.రాము, డీఈవో
సర్కారు స్కూళ్లకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తూ సీఎం అనుముల రేవంత్‌రెడ్డి తీసుకున్న నిర్ణయం హర్షణీయం. ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇస్తుందనే కారణంతో దానిని ఆయా పాఠశాలలో ఇష్టారాజ్యంగా వాడుకోవద్దు. ఇంధన వనరులను పరిమితంగా వాడుకుంటూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్దికి తోడ్పడాలి.
Updated Date - Sep 28 , 2024 | 12:04 AM