ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గిట్లెట్లయ్యే?

ABN, Publish Date - Jun 07 , 2024 | 12:30 AM

కమలనాథుల ఆశలపై ఓరుగల్లు ఓటర్లు నీళ్లు చల్లారు. 1984 నాటి చరిత్రను పునరావృతం చేస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ నేతలకు ఝలక్‌ ఇచ్చారు. మోదీ చరిష్మాతో వరంగల్‌ ఎంపీ స్థానంలో పాగా వేయాలనే పక్కా వ్యూహంతో బరిలో దిగినా ‘గిట్లెట్లయ్యే..’ అంటూ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా సవాళ్లను అధిగమించటంలో బీజేపీ విఫలమైందన్న చర్చ జరుగుతుండగా.. ప్రచారం విషయంలో రాష్ట్ర నాయకత్వం వరంగల్‌పై అంతగా దృష్టిపెట్టలేదని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేక ప్రత్యర్థులకు దీటుగా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయారని, శ్రేణులు కూడా చేతులెత్తేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

గెలుపు ధీమాలో ఉన్న బీజేపీకి ఓరుగల్లు ఓటర్ల ఝలక్‌

చరిత్రను పునరావృతం చేయాలనుకున్న కమలనాథుల ఆశలపై నీళ్లు

లోక్‌సభ ఎన్నికలో ఓటమిపై కేడర్‌ అంతర్మథనం

బలమైన నాయకత్వం లేక పోల్‌మేనేజ్‌మెంట్‌లో వెనుకబాటు

‘అసెంబ్లీ’లో కాంగ్రె్‌సకు ఓట్లేసినట్లే తమకూ వేస్తారనే అతివిశ్వాసం

ప్రచారంలో వరంగల్‌పై దృష్టిపెట్టని రాష్ట్ర స్థాయి నేతలు

ఓడినా భారీగా ఓట్లు పొందామంటూ సర్దిచెప్పుకుంటున్న నాయకులు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్‌)

కమలనాథుల ఆశలపై ఓరుగల్లు ఓటర్లు నీళ్లు చల్లారు. 1984 నాటి చరిత్రను పునరావృతం చేస్తామన్న ధీమాలో ఉన్న బీజేపీ నేతలకు ఝలక్‌ ఇచ్చారు. మోదీ చరిష్మాతో వరంగల్‌ ఎంపీ స్థానంలో పాగా వేయాలనే పక్కా వ్యూహంతో బరిలో దిగినా ‘గిట్లెట్లయ్యే..’ అంటూ బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారు. అయితే వ్యూహప్రతివ్యూహాలు ఎలా ఉన్నా సవాళ్లను అధిగమించటంలో బీజేపీ విఫలమైందన్న చర్చ జరుగుతుండగా.. ప్రచారం విషయంలో రాష్ట్ర నాయకత్వం వరంగల్‌పై అంతగా దృష్టిపెట్టలేదని, అసెంబ్లీ నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేక ప్రత్యర్థులకు దీటుగా పోల్‌మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయారని, శ్రేణులు కూడా చేతులెత్తేశారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా 40ఏళ్ల నాడు వరంగల్‌లో బీజేపీ జెండా ఎగరిందని, మళ్లీ ఇప్పుడు ఎగరవేయబోతున్నామని ప్రచారంలో చెప్పుకొచ్చిన బీజేపీ నేతలకు ఓటర్లు ఇచ్చిన తీర్పు మింగుడుపడటంత లేదు. ఎక్కడెక్కడ తమకు ఓటు బ్యాంకు పెరిగింది.. ఎక్కడెక్కడ తాము నష్టపోయామని ఆ పార్టీ నేతలు లెక్కలు వేసుకుంటూ ఓటమికి గల కారణాలను విశ్లేషించుకుంటున్నారు.

చరిత్ర తిరగరాయడంలో భంగపాటు..

వరంగల్‌లో బీజేపీకి ఓ చరిత్ర ఉంది. 1984 పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ దేశవ్యాప్తంగా రెండే ఎంపీ స్థానాల్లో విజయం సాధించగా.. అందులో ఒకటి వరంగల్‌. వరంగల్‌ (పాత హనుమకొండ) లోక్‌సభ స్థానం నుంచి నాడు చందుపట్ల జంగారెడ్డి ఎంపీగా విజయం సాధించారు. 1989లో మరోసారి జంగారెడ్డి పోటి చేసినా విజయం సాధించలేదు. అప్పటి నుంచి బీజేపీ వరంగల్‌ స్థానంలో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 2009లో ఎస్సీ రిజర్వుడు స్థానంగా మారిన తరువాత జరిగిన ఏ ఎన్నికల్లోనూ కనీసం డిపాజిట్‌ కూడా దక్కించుకోలేదు. అయితే కేంద్రంలోని నరేంద్రమోదీ చరిష్మాతో తెలంగాణలో బీజేపీకి ఓ ఊపు వచ్చింది. దీంతో ఈ ఊపులో వరంగల్‌లో కూడా గెలిచి 1984 చరిత్రను పునరావృతం చేయాలని భావించిన బీజేపీ.. బలమైన నేత కోసం వెతికింది. ఈ క్రమంలోనే వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, వరంగల్‌ బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న అరూరి రమే్‌షను పార్టీలో చేర్చుకుని బరిలో దించింది. దీంతో బీజేపీకి క్రేజ్‌ పెరిగింది. యువత, మహిళలు, రైతులతో పాటు పట్టణ ఓటర్లు ఈసారి తాము మోదీకే ఓటేస్తామంటూ బహిరంగంగానే చెప్పే స్థాయికి బీజేపీ చేరింది. దీంతో వరంగల్‌లో బీజేపీ గెలుస్తుందనే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్య గెలవడం.. బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్‌ ఓటమిపాలై రెండో స్థానంలో నిలవడం చర్చనీయాంశంగా మారింది. చరిత్రను తిరగరాస్తామన్న ధీమా వ్యక్తం చేసిన కేడర్‌ను ఈ ఓటమి కుంగతీసింది.

పోల్‌మేనేజ్‌మెంట్‌లో ఫెయిల్‌..

వరంగల్‌ ఎంపీ స్థానంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. పోలింగ్‌ బూత్‌ల నుంచి కేడర్‌కు, సమావేశాలకు కావాల్సిన ఫండింగ్‌ కూడా పార్టీ నుంచే అందినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికల్లో అత్యంత కీలకమైన పోల్‌మేనేజ్‌మెంట్‌లో మాత్రం పార్టీ చేతులెత్తేసిందనే చర్చ నడుస్తోంది. నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అనుభవం ఉన్న బీజేపీ అభ్యర్థికి పోల్‌మేనేజ్‌మెంట్‌పై పూర్తి అవగాహన ఉంది. అయితే ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కాంగ్రె్‌సతో పాటు బీఆర్‌ఎస్‌ ఓటర్లకు కూడా నజరానాలను చేరవేశారని, ఇందుకోసం భారీగానే ఖర్చు చేశారన్న ప్రచారం జరుగుతోంది. కానీ పోల్‌మేనేజ్‌మెంట్‌ విషయంలో మాత్రం బీజేపీ మీనమేషాలు లెక్కించిందని, ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ఓటర్లకు బీజేపీ నుంచి నజరానాలు అందలేదనే చర్చ జరుగుతోంది. ప్రత్యర్థులు పంపిణి చేసిన దాంట్లో 50శాతమే ఇచ్చినప్పటికి అవి కూడా 30శాతం ఓటర్లకే చేరాయని, బలమైన అభ్యర్థిగా పేరుండటంతో ఓటర్లు కూడా అదే స్థాయిలో నజరానాలు ఆశించినట్లుగా ప్రచారం జరిగింది. కానీ ఇందులో కమలనాథులు చేతులెత్తేయటంతో కేడర్‌తో పాటు ఓటర్లు అసంతృప్తికి గురైనట్టు చర్చ జరుగుతోంది. దీంతో అప్పటి వరకు బీజేపీకే ఓటేయాలని నిర్ణయించుకున్న ఓటర్లు కూడా చాలా వరకు మనస్సు మార్చుకుని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ వైపు చూశారని తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఇళ్ల నుంచి బయటకు రాకున్నా గెలిచారని, అదే తరహాలో తమకు మోదీ చరిష్మా కలిసొస్తుందని, నజరానాలతో పని లేకుండా ఓటర్లు తమను ఆశీర్వదిస్తారన్న అతి విశ్వాసం కూడా బీజేపీ ఓటమికి ఓ కారణంగా చెబుతున్నారు.

దృష్టి పెట్టని పెద్ద లీడర్లు..

బీజేపీ ఓటమికి మరో ప్రధాన కారణం నాయకత్వ లేమిగా చెప్పుకొంటున్నారు. బీజేపీపై ప్రజల్లో సానుభూతి వచ్చినప్పటికి, దానిని ఓటు రూపంలో మార్చుకోవడంలో బీజేపీ విఫలమైందని, అన్ని చోట్ల నాయకత్వం లేదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పాలకుర్తి నియోజకవర్గంలో బీజేపీకి 2,182 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. కానీ పార్లమెంట్‌కు వచ్చే సరికి మోదీ చరిష్మా కారణంగా ఇక్కడ యువత బీజేపీ వైపు మొగ్గు చూపారని, అనూహ్యంగా బీజేపీకి 28,452ఓట్లు పోలయ్యాయని లెక్కలు చెబుతున్నాయి. అదే ఇక్కడ బలమైన నాయకత్వం ఉండి ఉంటే ఇంకా భారీగా ఓట్లు పడే అవకాశం ఉండేదనే చర్చ జరుగుతోంది. అలాగే స్టేషన్‌ఘనపూర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 4,984 ఓట్లు మాత్రమే రాగా.. లోక్‌సభ ఎన్నికలో 40,332 ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ కూడా పాలకుర్తి పరిస్థితే ఉందని, ఈ రెండు నియోజకవర్గాల్లో బలమైన నాయకత్వం లేకపోవటంతోనే బీజేపీ మూడోస్థానానికి పరిమితమైందన్న చర్చ జరుగుతోంది. ఇక బలమైన నాయకత్వం ఉండటం కారణంగా వరంగల్‌ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బీజేపీకి భారీగా ఓట్లు పోలయ్యాయని, ఫలితంగా భూపాలపల్లి, పరకాల, వర్థన్నపేటలో పార్టీ రెండోస్థానంలో నిలిచిందని, కానీ పార్టీలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో నష్టం జరిగిందనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు ఓ వైపు రాష్ట్ర నాయకత్వం పంపించిన ఇన్‌చార్జ్‌ల పెత్తనంతో చాలా మంది కీలక నేతలు అంటీముట్టనట్టు వ్యవహరించారనే ప్రచారం జరుగుతుండగా.. మరోవైపు వరంగల్‌ సీటుపై బీజేపీ దృష్టిపెట్టినా ప్రచారానికి కీలక నేతలు దూరంగా ఉండటం కూడా బీజేపీకి నష్టం చేకూర్చిందనే చర్చ జరుగుతోంది. వరంగల్‌లో మోదీ సభ సక్సెస్‌ కావడం శ్రేణుల్లో ఉత్సాహం నింపిందని, ఆ సభ ప్రభావం పట్టణ ప్రాంతాల్లోనే చూపిందని, అందుకే పట్టణప్రాంతాల్లో బీజేపీ ఓటు బ్యాంకు పెరిగిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో పాటు బండి సంజయ్‌ లాంటి నేతలు ప్రచారానికి రాకపోవటం కూడా మైనస్‌ అయ్యిందని, ఇతర రాష్ట్రాల సీఎంలు, ముఖ్య నేతలు ప్రచారానికి వచ్చినా పెద్దగా ఒనగూరిందేమీ లేదని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలే అభిప్రాయపడుతున్నారు.

ఓట్లు పెరిగాయనే సంతృప్తిలో కమలం..

గెలుస్తామన్న సీటు గెలవకపోయినా కనీసం చెప్పుకోదగ్గ స్థాయిలో ఓటు బ్యాంకు పెరిగిందనే సంతోషంతో కొందరు బీజేపీ నేతలు సర్దుకుపోతున్నారు. ఇప్పటికే వరంగల్‌లో ఓటమిపై అధిష్ఠానం ఆరా తీస్తుండటంతో ప్రధానంగా పోల్‌మేనేజ్‌మెంట్‌ కారణంగానే ఓడిపోయామని కీలక నేతలు సమాధానం ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే వరంగల్‌తూర్పులో మొదటి స్థానంలోకి రావటంతో పాటు భూపాలపల్లి, పరకాల, వర్థన్నపేట, వరంగల్‌పశ్చిమ నియోజకవర్గాల్లో ద్వితీయ స్థానంలో నిలిచామని బీజేపీ నేతలు అధినాయకత్వానికి వివరిస్తున్నారు. అంతేకాకుండా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏడు నియోజకవర్గాల్లో కేవలం 1,56,638 ఓట్లు మాత్రమే పోలయితే.. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో 3,60,955ఓట్లు పోలయ్యాయనని, అప్పటికి ఇప్పటికి 2,04,317 ఓట్లు పెరిగాయని బీజేపీ నేతలు లెక్కలు వేస్తున్నారు.

Updated Date - Jun 07 , 2024 | 12:30 AM

Advertising
Advertising