ఇంకెన్నాళ్లు?
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:13 PM
కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే ఈ ప్రాజెక్టు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతోందని తెలుస్తోంది. 2023 అక్టోబరులో లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలోని ఏడో బ్లాకులో పిల్లర్లు కుంగిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల అధ్యాయనానికి శ్రీకారం చుట్టింది.
త్రిశంకు స్వర్గంలో మేడిగడ్డ భవితవ్యం!
ఇంకా కొలిక్కి రాని ఎన్డీఎస్‌ఏ పరీక్షలు
కేవలం ఏడో బ్లాకులోనే పూర్తి
ఇంకా ఏడు బ్లాకులు 72 పిల్లర్ల పరీక్షలు పెండింగ్‌లోనే
మరమ్మతులకు మరో ఏడాది పట్టే అవకాశం
ఇప్పటికే 1500 టీఎంసీలు సముద్రంపాలు
ఎత్తిపోతలకు అవకాశమున్నా పట్టించుకోని సర్కారు
భూపాలపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగుబాటు, ఆ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూంటే ఈ ప్రాజెక్టు త్రిశంకుస్వర్గంలో కొట్టుమిట్టాడుతోందని తెలుస్తోంది. 2023 అక్టోబరులో లక్ష్మీ (మేడిగడ్డ) బ్యారేజీలోని ఏడో బ్లాకులో పిల్లర్లు కుంగిన తర్వాత ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితుల అధ్యాయనానికి శ్రీకారం చుట్టింది. బ్యారేజీ దెబ్బతినేం దుకు దారితీసిన పరిస్థితులేమిటనే విషయాన్ని తేల్చేందుకు నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీకి బాధ్యత లను అప్పగించింది. ఈ క్రమంలో ఎన్డీఎస్‌ఏకు చెందిన నిపుణుల బృందం పలు దఫాలుగా పర్యటించి ఏడోబ్లాక్‌లో లోపాలను అధ్యయనం చేసింది. జియో ఫిజికల్, జియో టెక్నికల్ లాంటి పరీక్షలు కూడా జరపాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రెండు నెలల పాటు నిపుణులు ఏడో బ్లాక్‌లో అణువణువూ పరీక్షించారు. ఈ క్రమంలో దెబ్బతిన్న బ్లాక్‌ల్లోని పియర్ల వద్ద సీకెంట్ ఫైల్స్ అమరికను తెలుసుకునేందుకు డ్రిల్లింగ్ చేసి మట్టి నమూనాలను పరీక్షించాల్సి ఉందని తెలుస్తోంది. అలాగే ఇంకా కొన్ని ఇతర సాంకేతిక పరీక్షలు కూడా నిర్వహించాల్సి ఉంది. ఈ పరిస్థితుల్లో వరదలు ప్రారంభం కావడంతో తనిఖీల ప్రక్రియ నిలిచిపో యింది. ప్రస్తుతం ఏడోబ్లాక్‌లో పరీక్షల ప్రక్రియ చివరి అంకానికి చేరినా మిగతా ఏడు బ్లాకుల్లోని 72 పిల్లర్లను కూడా పరీక్షించాల్సిన పరిస్థితి ఉందని నీటిపారుదల శాఖ నిపుణులు అంటున్నారు. ఎన్డీఎస్‌ఏ బిజీ షెడ్యూల్ నేపథ్యంలో తనిఖీల ప్రక్రియ మరింత జాప్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఒక్కో బ్లాక్‌లో పరీక్షలకు తీసుకుంటున్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే రెగ్యులర్‌గా టెస్టులు జరిపినా ఏడాది కాలం పాటు తనిఖీలకే సమయం పడుతుందని, ఆ తర్వాత కొత్త కోడ్ అభివృద్ధి పరిచి మరమ్మతుల ప్రక్రియ పూర్తి చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే మరో రెండేళ్ల తర్వాత కానీ మేడిగడ్డ బ్యారేజీ తిరిగి అందుబాటులోకి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే.. మేడిగడ్డ బ్యారేజీకి ప్రత్యామ్నాయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టే యోజన చేస్తుండటంతో కాళేశ్వరం ప్రాజెక్టుల భవిష్యత్తు డోలాయమానంలో పడిందని తెలుస్తోంది. ఇందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును చేపట్టేందుకు ఈ ఏడాది బడ్జెట్లో రూ.700 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
ఎత్తిపోతలకు అవకాశమున్నా...
మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలు కుంగుబాటు, లీకేజీల కారణంగా దెబ్బతిన్నప్పటికీ మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా రోజుకు 3టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశం ఉంది. కానీ ప్రభుత్వం ఏ కారణం చేతోపట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి నుంచి గోదావరి జలాలను పెద్దపల్లి జిల్లా నంది మేడారంలోని నంది పంప్‌హౌస్ ద్వారా మిడ్ మానేరుకు ఎత్తిపోస్తున్నారు. ఏడు పంపుసెట్ల ద్వారా 22 వేల 50 క్యూసెక్కుల (2టీఎంసీలు) నీటిని మిడ్ మానేరుకు ఎత్తిపోసే అవకాశం ఉన్నా కేవలం నాలుగు పంపుసెట్ల (ఒక్కో మోటార్ సామర్థ్యం 3150 క్యూసెక్కు లు) సాయంతో ఎత్తిపోస్తు న్నారు. అదే కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోతల జరిపితే సగటున రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎగువన ఉన్న రిజర్వాయర్లను నింపే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. రెండు నెలలు గా గోదావరికి వరద పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో లక్ష్మీబ్యారేజ్‌తో సంబంధం లేకుండా నీటిని ఎత్తిపోయొ చ్చని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు కూడా చెబుతున్నారు. మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలన్న డిమాండ్ విపక్షాల నుంచి బలంగా వినిపిస్తున్నా సర్కారు పెడచెవిన పెడుతుండడం వెనక ఆంతర్యమేమిటనేది ఎవరికీ అంతు చిక్కడం లేదు. గడచిన రెండు నెలల కాలంలో సగటున రోజూ 70 నుంచి 80టీఎంసీల నీరు వృథాగా సముద్రం పాలైందని తెలుస్తోంది. మేడిగడ్డ బ్యారేజ్ వద్ద ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1,500 టీఎంసీల వరద నీరు వృథాగా సముద్రంలో కలిసిందని నీటిపారుదల శాఖ అధికారులు అంటున్నారు.
Updated Date - Sep 11 , 2024 | 11:13 PM