ఆయిల్‌పాం పెంపకం.. రైతులకు ఆదాయం
ABN, Publish Date - Jul 04 , 2024 | 11:56 PM
వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాన ఉద్ధేశంతో ఆయిల్‌పాం తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. సాగుకు తక్కువ మొత్తంలో ఖర్చు కావడం, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండడం, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పలుచోట్ల రైతులు అంతర పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు.
సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం
విస్తీర్ణం పెంచేందుకు అధికారుల కార్యాచరణ
915 మంది రైతుల ఖాతాల్లో రూ.1.15 కోట్లు
జిల్లాలో మూడేళ్లుగా 5,810 ఎకరాల్లో సాగు
అంతర పంటలతో మరింత ప్రయోజనం
జఫర్‌గడ్, జూలై 4 : వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ప్రధాన ఉద్ధేశంతో ఆయిల్‌పాం తోటల పెంపకాన్ని ప్రభుత్వం ప్రోత్సహి స్తోంది. సాగుకు తక్కువ మొత్తంలో ఖర్చు కావడం, ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుండడం, తెగుళ్ల బెడద పెద్దగా లేకపోవడం వంటి కారణాలతో రైతులు ఆయిల్‌పాం సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. పలుచోట్ల రైతులు అంతర పంటలను సాగు చేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పాం సాగును ప్రోత్సహిస్తుండడంతో రైతులు సాగుపై ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలో మూడేళ్ల కిందట ఆయిల్‌పాం మొక్కల పెంపకాన్ని చేపట్టారు. ఇప్పటి వరకు మొత్తం 5,880 ఎకరాల్లో ఆయిల్‌పాం ను సాగు చేస్తున్నారు. ఈ ఏడాది కొత్తగా రైతులు ఇప్పటికే జిల్లాలో 200 ఎకరాల వరకు సాగుకు శ్రీకారం చుట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది జిల్లాలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా ఉద్యానశాఖ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ఆయిల్‌పాం సాగు వల్ల కలిగే ఆర్థిక ప్రయోజనాలు, మార్కెటింగ్ సౌకర్యం, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వంటి అంశాలపై అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.
రైతులకు రాయితీ
ఆయిల్‌పాం సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు రైతులకు పలు రాయితీలు ఇస్తున్నాయి. ఒక్కో మొక్క ఖరీదు రూ.193 కాగా, రాయితీ పోను రైతులు రూ.20 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. మొదటి ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఎకరానికి తోటకు వాడే ఎరువులు, పురుగు మందులు, నిర్వహణ ఖర్చుల కింద ఏటా రూ.2,100లతో పాటు అంతర పంటలు సాగు చేసుకునే వారికి మరో రూ.2,100 చొప్పున చెల్లిస్తారు. అంటే నాలుగేళ్లలో నిర్వహణ, అంతర పంటల కోసం ఎకరానికి రూ.16,800 చెల్లిస్తారు. ఈ పంట సాగుకు బిందు సేద్యం పద్ధతిలో నీరు అందించాల్సి ఉంటుంది. ఈ బిందు సేద్యానికి కూడా రాయితీ కల్పిస్తారు.
నిఽధులు రైతుల ఖాతాల్లో జమ
ఆయిల్‌పాం సాగు చేస్తున్న రైతులకు ఏటా అందించే నిర్వహణ(ప్రోత్సాహక) నిధులు ఎట్టకేలకు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు రావడం, కోడ్ అమలులో ఉండడం, ప్రభుత్వం మారిపోవడంతో గత ఏడాది నుంచి నిధులు రాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, రెండో ఏడాది (2022-23) ఆయిల్ పాం సాగు రైతులకు రావాల్సిన నిర్వహణ నిధులు జిల్లాలోని 3,200 ఎకరాలకు గాను ప్రస్తు తం 2,850 ఎకరాలకు, 915 మంది రైతులకు మొత్తం రూ.1.15 కోట్ల నిధులు వారి ఖాతాల్లో జమ అయ్యాయని సంబంధిత శాఖ అధికారు లు తెలిపారు. మిగతా 350 ఎకరాలకు నిధులు వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో జమ అవుతాయని చెబుతున్నారు.
పంపిణీకి మొక్కలు సిద్ధం
జిల్లా కేంద్రంలోని నర్సరీలో ఆయిల్‌పాం మొక్కలు రైతులకు పంపిణీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. 5వే ల ఎకరాల వరకు సాగు చేసేందుకు సుమారు 3.30 లక్షల మొక్కలు అందుబాటులో ఉన్నాయని ఉద్యాన శాఖాధికారి కేఆర్.లత తెలిపారు. సాగుకు ఆసక్తి కనబరిచి దరఖాస్తు చేసుకున్న రైతులకు మొక్కలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే ఆయిల్‌పాం మార్కెటింగ్ కోసం ఆరు నెలల్లోగా జిల్లాలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఈ ఏడాది 3వేల ఎకరాల్లో సాగు లక్ష్యం
ఈ ఏడాది ఖరీఫ్, రబీ సీజన్లలో జిల్లా వ్యాప్తంగా 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగుకు అఽధికారులు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2021-22లో 450 ఎకరాలు, 2022-23లో 3,200 ఎకరాలు, 2023-24లో 2,160 ఎకరాల్లో రైతులు ఆయిల్‌పాం సాగు చేపట్టా రు. గత మూడేళ్లుగా మొత్తం 5,810 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది 2024-25లో జిల్లాలో 3వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది 200 ఎకరాల్లో రైతులు సాగు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
బిందు సేద్యానికి సైతం రాయితీ
జిల్లాలో ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. సంప్రదాయ పంటలకు భిన్నం గా సాగు చేయడం ద్వారా ఆర్థికంగా నిలదొక్కుకునేం దుకు చాలా మంది రైతులు ప్రయత్నిస్తున్నారు. ఆయి ల్‌పాం తోటలతో పాటు ఇతర వాటిపైనా దృష్టి సారి స్తున్నారు. ప్రధానంగా తక్కువ నీటితో ఎక్కువ సాగు చేసేందుకు ఉపయోగపడే బిందు, తుంపర పరికరాల ను రాయితీపై రైతులకు పంపిణీకి గత కొన్నేళ్లుగా నీలినీడలు అలుముకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా గతం లో ఆయిల్‌పాం సాగుకు మాత్రమే డ్రిప్ విధానం అమలులో ఉండేది. ప్రస్తుత ప్రభుత్వం ఇతర ఉద్యాన పంటలకు కూడా రాయితీపై బిందు సేద్యం పరికరా లను అందించాలని నిర్ణయించింది. ఇక నుంచి పండ్ల తోటలు, కూరగాయలు, మల్బరీ తోటలకు సైతం బిందు, తుంపర సేద్యం పరికరాలను రాయితీపై అందించనున్నారు.
ఆయిల్‌పాం సాగు లాభదాయకం
- కేఆర్ లత, జిల్లా ఉద్యానశాఖాధికారి
ఆయిల్‌పాం సాగు రైతులకు లాభదాయకం. జిల్లాలో ఆయిల్ పాం సాగు ఏటేటా పెరుగుతోం ది. మొక్క నాటిన నాలుగేళ్ల సంరక్షణ తరువాత నుంచి కాపు మొదలై 30ఏళ్ల వరకు నిరంత రాయంగా దిగుబడి ఉంటుంది. వడగళ్ల వాన, తుపాను తదితర ప్రకృతి వైపరీత్యాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుం ది. కోతులు, అడవి పందుల బెడద అసలే ఉండదు. కూలీల అవసరం చాలా తక్కువగా ఉంటుంది. గెలలు కోసిన వెంటనే నేరుగా ఫ్యాక్టరీకే పంపవచ్చు. అంతే కాకుండా మొదటి మూడు సంవత్సరాలు అంతర పంటలుగా కూరగాయలు, వాణిజ్య పంటలు పండించి అదనపు ఆదాయాన్ని పొందవచ్చు. అలాగే ప్రభుత్వం నుంచి ప్రోత్సాహక రాయితీ అందిస్తున్నందున రైతులు సాగుకు ముందుకు రావాలి.
Updated Date - Jul 04 , 2024 | 11:56 PM