ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రణరంగం

ABN, Publish Date - Jun 21 , 2024 | 12:29 AM

వరంగల్‌ నగరాభివృద్ధికి నిర్వహించిన బల్దియా 2024-2025 బడ్జెట్‌ సమావేశం రసాభాసాగా సాగింది. జీడబ్ల్యూఎంసీ సమావేశ మందిరం గురువారం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అయితే ముందుగా అనుకున్నట్టుగానే బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 11 మంది కార్పొరేటర్లతో పాటు కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉదయం 11 గంటలకు వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్దకు చేరుకున్నారు. కొందరు నల్లబ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి బడ్జెట్‌ సమావేశానికి హాజరుకాగా, మరికొందరు నల్ల దుస్తులు వేసుకుని వచ్చారు.

రసాభాసాగా బల్దియా బడ్జెట్‌ సమావేశం

నిరసనలు, నినాదాలతో దద్దరిల్లిన కార్పొరేషన్‌

నల్లకండువాలు, బ్యాడ్జీలతో వచ్చిన విపక్ష కార్పొరేటర్లు

సుధారాణికి వ్యతిరేకంగా ప్లకార్డుల ప్రదర్శన

మేయర్‌ పోడియం వద్ద బడ్జెట్‌ పత్రాల చించివేత

పోటాపోటీగా అడ్డుకున్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు

కౌన్సిల్‌ కార్యాలయం పోలీసుల భారీ బందోబస్తు

వరంగల్‌ కార్పొరేషన్‌, జూన్‌ 20: వరంగల్‌ నగరాభివృద్ధికి నిర్వహించిన బల్దియా 2024-2025 బడ్జెట్‌ సమావేశం రసాభాసాగా సాగింది. జీడబ్ల్యూఎంసీ సమావేశ మందిరం గురువారం అరుపులు, కేకలతో దద్దరిల్లింది. అయితే ముందుగా అనుకున్నట్టుగానే బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. బీఆర్‌ఎస్‌కు చెందిన 21 మంది, బీజేపీకి చెందిన 11 మంది కార్పొరేటర్లతో పాటు కొందరు మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉదయం 11 గంటలకు వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ వద్దకు చేరుకున్నారు. కొందరు నల్లబ్యాడ్జీలు, నల్ల కండువాలు ధరించి బడ్జెట్‌ సమావేశానికి హాజరుకాగా, మరికొందరు నల్ల దుస్తులు వేసుకుని వచ్చారు. కొందరు కార్పొరేటర్లు ఎంజీఎం సర్కిల్‌ ముందు నుంచి నినాదాలు చేసుకుంటూ కౌన్సిల్‌ హాల్‌ వద్దకు వచ్చారు. ‘బడ్జెట్‌ సమావేశాన్ని బహిస్కరించండి.. పార్టీ మారిన మేయర్‌ సభ్యత్వాన్ని రద్దు చేయండి’.. అంటూ నినదించారు. వీరిని వరంగల్‌ ఏసీపీ నందిరాంనాయక్‌, మట్టెవాడ ఇన్‌స్పెక్టర్‌ తుమ్మ గోపి బల్దియా ప్రధాన గేటు వద్ద అడ్డుకున్నారు. నినాదాలు మానుకుంటేనే లోనికి అనుమతిస్తామని చెప్పడంతో వెనక్కి తగ్గిన అసంతృప్తి కార్పొరేటర్లు 11.30గంటలకు కౌన్సిల్‌ హోల్‌లోకి వచ్చారు. అయితే అంతకుముందే బల్దియా పాలక మండలి కార్యాలయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డితో పాటు మేయర్‌ గుండు సుధారాణి సమావేశమయ్యారు. బడ్జెట్‌ సమావేశంలో వ్యవహరించాల్సిన తీరుపై మాట్లాడుకున్నారు. తర్వాత ఎమ్మెల్యేలు, మేయర్‌, కాంగ్రెస్‌ కార్పొరేటర్లు జట్టుగా కౌన్సిల్‌ హాల్‌కు చేరుకున్నారు.

అయోమయం, గందరగోళం

బల్దియా కౌన్సిల్‌ హాల్‌కు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలతో పాటు మేయర్‌, కార్పొరేటర్లు చేరుకుని వారి వారి స్థానాల్లో ఆసీనులయ్యారు. అంతకుముందే బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లు మరోపక్క కూర్చున్నారు. మేయర్‌ను చూడగానే ఒక్కసారిగా పెద్దగా నినాదాలు చేశారు. తమ పార్టీలో గెలిచి పార్టీ మారిన మేయర్‌ గుండు సుధారాణికి మేయర్‌ కుర్చీలో బడ్జెట్‌ ప్రకటించే అర్హతలేదని ఒక్క సారిగా లేచారు. ‘మేయర్‌ డౌన్‌ డౌన్‌.. అర్హత లేని మేయర్‌ గద్దె దిగాలి’ అని విపక్ష కార్పొరేటర్లు నినాదాలు చేశారు. హాల్‌లో గందరగోళ వాతావరణం నెలకొంది. ‘బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలోకి మారిన మేయర్‌ గుండు సుధారాణి సభ్యత్వం రద్దు చేయాలి.. ప్రజా సమస్యలు పట్టించుకోని మేయర్‌ వేస్ట్‌.. వేస్ట్‌’ అని నినాదాలు చేసి ప్లకార్డులు ప్రదర్శించారు. దీంతో కౌన్సిల్‌ హాల్‌లో ఉన్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు తిరగబడ్డారు. ‘కాంగ్రెస్‌ జిందాబాద్‌.. తెలంగాణ వచ్చింది కాంగ్రెస్‌తోనే.. తెలంగాణ ఇచ్చింది సోనియమ్మ..’ అని ప్రతి నినాదాలు చేశారు. ఇలా పది నిమిషాల పాటు బడ్జెట్‌ సమావేశం ఉద్రిక్తంగా సాగింది. కాగా, కౌన్సిల్‌ హాల్‌ వేదికగా ఇరు పక్షాలు నినాదాలు చేస్తుండగానే మేయర్‌ గుండు సుధారాణి మూడు పేజీలతో కూడిన బడ్జెట్‌ ముసాయిదా ప్రణాళికను ప్రవేశపెట్టారు. గొడవ జరుగుతుండగానే బడ్జెట్‌తో పాటు ఆదాయ, వ్యయాలను చదివి వినిపించారు. మెజారిటీగా ఉన్న కాంగ్రెస్‌ కార్పొరేటర్లు, ఎక్స్‌ అఫీషియో సభ్యులు బడ్జెట్‌ ప్రతిపాదనను అమోదించారు. మొత్తంగా పది నిమిషాల్లో బడ్జెట్‌ సమావేశం నిరసనలు, నినాదాల మధ్య ముగిసింది.

బడ్జెట్‌ పత్రాలను చింపి..

మేయర్‌ గుండు సుధారాణి 2024- 2025 బడ్జెట్‌ ముసాయి దాను ప్రకటించిన తర్వాత మెజారిటీ సభ్యులు అమోదించారు. దీన్ని జీర్ణించుకోలేని విపక్ష నాయకులు ఒక్కసారిగా మేయర్‌ కూర్చున్న పోడియం వద్దకు దూసుకువచ్చారు. మెనకాల కూర్చున్న బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు ముందుకు పరుగులు తీస్తూ ‘మేయర్‌ మొండి వైఖరి నశించాలి..’ అని నినాదాలు చేస్తూ వారి వద్ద ఉన్న బడ్జెట్‌ పత్రాలను మేయర్‌, ఎమ్మెల్యేల ముందే పోడియం వద్ద చింపి పడేశారు. మేయర్‌ నిర్ణయాన్ని వ్యతి రేకిస్తున్నామని, దేశంలో ఎక్కడాలేని విధంగా వరంగల్‌ బల్దియాలో జరుగుతోందని, దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నిరసనకారులు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. ‘వుయ్‌ వాంట్‌ జస్టిస్‌’.. అంటూ హాల్‌ నుంచి బయటకు వచ్చారు.

పోలీసుల భారీ బందోబస్తు

వరంగల్‌ బల్దియాలో ఈ నెల 20న బడ్జెట్‌ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వరంగల్‌ ఇన్‌చార్జి సీపీ అభిషేక్‌ మహంతి ఆదేశాల మేరకు పోలీసులను రంగంలోకి దించారు. సమావేశానికి వస్తున్న బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్పొరేటర్లను ప్రధాన గేటు వద్ద నిలిపి తనిఖీలు చేసి మరీ పంపించారు. కొందరు మహిళా కార్పొరేటర్లను మహిళా పోలీసు సిబ్బంది తనిఖీ చేయడం వివాదాస్పదంగా మారింది. దీనిని మహిళా కార్పొరేటర్లు తీవ్రంగా ఖండించారు. ఇంకా కార్పొరేట్లతోపాటు వారి వాహన డ్రైవర్లను సైతం తనిఖీ చేసి నల్లజెండాలు ఉన్నాయా? ఇంకా ఏమైనా తెస్తున్నారా? అని అడిగి కౌన్సిల్‌ హాల్‌ లోనికి అనుమతించారు. కౌన్సిల్‌ హాల్‌లో సుమారు 20 మంది పోలీసులు కౌన్సిల్‌ హాల్‌లో ఎవరికీ అనుమానం రాకుండా అక్కడక్కడ కూర్చున్నారు. ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌ఐలతో పాటు మహిళా, పురుష పోలీసు కానిస్టేబుళ్లు హాల్‌లో కూర్చున్నారు. కాంగ్రెస్‌ విపక్ష కార్పొరేటర్ల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న తరుణంలో కొందరు మఫ్టీలో ఉన్న పోలీసులను గుర్తించారు. హాల్‌ నుంచి పోలీసులను పంపించాలని డిమాండ్‌ చేయడంతో హాల్‌లో ఉన్న పోలీసు సిబ్బంది బయటకు పంపించారు. బడ్జెట్‌ అమోదం తర్వాత ఇరువర్గాల బయట వెళ్లిపోయారు. బల్దియా చరిత్రలో ఉన్నడూ లేని విధంగా బడ్జెట్‌ సమావేశానికి పోలీసులు హాజరు కావడం, కట్టుదిట్టమైన పోలీసు భద్రత ఏర్పాటు చేయడాన్ని కొందరు నిరసించారు.

నిరసన

కొందరు విపక్ష కార్పొరేటర్లు బడ్జెట్‌ సమావేశం నిర్వహించిన తీరుపై మండిపడ్డారు. కౌన్సిల్‌ ప్రధాన గేటు వద్ద బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు నిరసనకు దిగి బైఠాయించారు. బల్దియా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసు బందోబస్తు మధ్య బడ్జెట్‌ సమావేశం నిర్వహించడం సిగ్గుగా ఉందని మండిపడ్డారు. పోలీసులు కలుగజేసుకుని శాంతింపజేశారు. ఓ కార్పొరేటర్‌ భర్త మట్టెవాడ ఎస్‌ఐ చొక్కా పట్టుకోవడంతో కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులను నిరసనకారులు అక్కడి నుంచి వెళ్లిపోవాలని కోరడంతో సమస్య సద్దుమనిగింది.

బీఆర్‌ఎస్‌, బీజేపీలది అక్రమ సంబంధం

  • పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి

కాంగ్రెస్‌ పార్టీ మొదటి నుంచి చెబుతున్నట్లుగానే బీఆర్‌ఎస్‌, బీజేపీల అక్రమ సంబంధం బల్దియా బడ్జెట్‌ సమావేశంలో తేట తెల్లమైంది. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంవల్ల వరంగల్‌ కార్పొరేషన్‌ అభివృద్ధి 20 యేండ్లు వెనక్కి పోయింది. కాకతీయ కళాతోరణం గురించి మాట్లాడడం సిగ్గుచేటు. పదేళ్లుగా కాకతీయ ఉత్సవాలు చేయకుండా కాకతీయ తోరణం గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌, బీజేపీలకు లేదు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్లు రాకపోవడం వల్ల నిరసనలు, అడ్డగింపులు చేస్తున్నారు. తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయ కళాతోరణాన్ని ఎట్టిపరిస్థితిలో తీయనియ్యం. రూ.150కోట్ల స్మార్ట్‌సిటీ నిధులు ఎగిరిపోతుంటే ఎమ్మెల్యేలం తిరిగి తెచ్చాం.

నా రాజకీయ చరిత్రలో ఎప్పుడు చూడలే..

  • బస్వరాజు సారయ్య, ఎమ్మెల్సీ

వరంగల్‌ మునిసిపల్‌ చరిత్రలో ఈ రోజు జరిగిన సంఘటనలు ఎప్పుడూ చూడలేదు. మంత్రి, ఎమ్మెల్యే హోదాలో పని చేయడంతో పాటు బల్దియాపై నాకు సుదీర్ఘ అనుబంధం కలిగి ఉంది. కానీ మునుపెన్నడూ లేనివిధంగా పోలీసు బందోబస్తు పెట్టి మరీ బల్దియా బడ్జెట్‌ సమావేశం నిర్వహించిన సందర్బాలు లేవు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం పోలీసులు వెసులుబాటు కల్పించారు. కానీ బల్దియా సమావేశాన్ని పోలీసుల పహారాలో నిర్వహించడం ఆశ్యర్యాన్ని కలిగిస్తోంది.

రాజకీయ అడ్డాగా బల్దియా

  • చాడా స్వాతిరెడ్డి, బీజేపీ 52 డివిజన్‌ కార్పొరేటర్‌

వరంగల్‌ బల్దియా కార్యాలయం ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాజకీయ అడ్డాగా మారింది. ఇక్కడి ప్రాంత అభివృద్ధిని పక్కనబెట్టి అధికారం కోసం పావులు కదుపుతున్నారు. బల్దియాలో జరిగింది బడ్జెట్‌ సమావేశం కాదు.. సొంత నిర్ణయాల వేదికగా చెప్పవచ్చు. ప్రభుత్వం మారడంతో మేయర్‌ బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీలో చేసి కుర్చీ కోసం పాకులాడుతోంది. గత సంవత్సరం, ఈ సంవత్సరం బడ్జెట్‌లు పూర్తిగా ప్రజల మీద భారం మోపే విధంగా ఉన్నాయి. దీనిపై బహిరంగ చర్చకు రావాలి.

రూ.650.12కోట్ల బడ్జెట్‌కు ఆమోదం

సమిష్టి కృషితో నగరాన్ని అభివృద్ధి చేస్తాం..

వరంగల్‌ మేయర్‌ గుండు సుధారాణి

వరంగల్‌ కార్పొరేషన్‌, జూన్‌ 20: వరంగల్‌ నగర పాలక సంస్థ 2024-25 సంవత్సరానికి ముసాయిదా బడ్జెట్‌ అంచనాల మేరకు మేయర్‌ గుండు సుధారాణి అధ్యక్షతన పాలక మండలి ఆమోదించింది. ఈ సమావేశంలో 1/3 కోరం సభ్యులు హాజరైన తర్వాత బల్దియా అకౌంట్స్‌ పర్యవేక్షణాధికారి సరిత బడ్జెట్‌ అంచనాలను వెల్లడించారు. రూ.650.12కోట్ల అంచనాలతో రూపొందించిన బడ్జెట్‌కు మెజారిటీ సభ్యులు చేతులెత్తి అంగీకారం తెలుపడంతో పాలకవర్గం బడ్జెట్‌ను అమోదించింది. ఇందులో రూ.237.02కోట్లు సాధారణ పన్నుల ద్వారా, రూ.410.10కోట్లు వివిధ గ్రాంట్ల ద్వారా ఆదాయం సమకూరుతుందని అవచనా వేశారు.

ఈ సందర్భంగా మేయర్‌ గుండు సుధారాణి మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మునిపిపల్‌ పట్టణ అభివృద్ధి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్ల సహకారంతో గ్రేటర్‌ వరంగల్‌ను అభివృద్ధి చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్నామన్నారు. తాను మేయర్‌గా కొలువుదీరిన తర్వాత 2024-25 బడ్జెట్‌ను కలుపుకుని మూడోసారి బడ్జెట్‌ సమావేశాన్ని నిర్వహించామన్నారు. ఈ యేడు బడ్జెట్‌లో ప్రజలపై ఎక్కువ పన్నుల భారం మోపకుండా బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌ గ్రేటర్‌ 66 డివిజన్‌ల అబివృద్ధికి ఎంతగానో దోహదం చేస్తుందని అన్నారు. ప్రధానంగా విలీన గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు, రేవూరి ప్రకాశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పోచంపెల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, హనుమకొండ కలెక్టర్‌ ప్రావీణ్య, నగర పాలక సంస్థ కమిషనర్‌ అశ్వినీ తానాజీ వాకడే, డిప్యూటీ మేయర్‌తో పాటు వివిధ పార్టీల కార్పొరేటర్లు, ఎక్స్‌ ఎఫీషియో సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jun 21 , 2024 | 12:29 AM

Advertising
Advertising