బాధ్యత పెద్దది.. భత్యం చిన్నది
ABN, Publish Date - Jun 23 , 2024 | 12:21 AM
ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతు న్నారు. ఉద్యోగ భద్రత లేక నిత్యం ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనంతో నానా అవస్థలు పడుతున్నారు. 2012లో సమగ్రశిక్ష అభియాన్‌లో సీఆర్పీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా సీఆర్పీలు పని చేస్తున్నారు.
పని భారంతో సమగ్రశిక్ష ఉద్యోగుల ఇబ్బందులు
చాలీచాలని వేతనంతో సతమతం
ఉద్యోగ భద్రత కల్పించాలని, కనీస వేతనం అమలు చేయాలని విన్నపం
జిల్లా వ్యాప్తంగా 452 మంది ఉద్యోగులు
రఘునాథపల్లి, జూన్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న సమగ్రశిక్ష ఉద్యోగులు పలు సమస్యలతో సతమతమవుతు న్నారు. ఉద్యోగ భద్రత లేక నిత్యం ఆందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. చాలీచాలని వేతనంతో నానా అవస్థలు పడుతున్నారు. 2012లో సమగ్రశిక్ష అభియాన్‌లో సీఆర్పీల వ్యవస్థ అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులతో సమానంగా సీఆర్పీలు పని చేస్తున్నారు. డీగ్రీ, బీఈడీ పూర్తిచేసినా వారికి అందే వేతనం అంతంత మాత్ర మే. సమాన పనికి సమాన వేతనం అందించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నా ఎవరూ పట్టిం చుకోవడం లేదు. రెగ్యులర్ ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా గత ప్రభుత్వం వారి చాకిరీని గుర్తించలేదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా కనీస వేతనం అందించడంతో పాటు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తుందేమోనని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో 452 మంది సమగ్రశిక్ష ఉద్యోగులు
జిల్లాలోని 12 మండలాల్లో 452 మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ పద్ధతిన సమగ్రశిక్ష ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఎమ్మార్సీలో సీఆర్‌పీలుగా 43 మంది, ఎంఎస్ కో-ఆర్డినేటర్లుగా 10 మంది, కంప్యూటర్ అపరేటర్లుగా 12 మంది, ఐఆర్సీలుగా 20 మంది, పీటీఐలుగా 54 మంది, మెసెంజర్లుగా ఏడుగురు, ఏవైఏలుగా 10 మందితో కలిపి మొత్తం 156 మంది ఉన్నారు. వీరితో పాటు డీపీవో కార్యాలయం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాల్లో మరో 296 మంది పని చేస్తున్నారు. 2012లో గత ప్రభుత్వం కలెక్టర్ చైర్మన్‌గా రూల్ ఆఫ్ రిజర్వేషన్లు పాటిస్తూ బీఈడీ పూర్తి చేసి, టెట్ పాసైన అభ్యర్థులను సీఆర్‌పీలుగా నియమించింది. అప్పటి నుంచి అనేక సర్వేలు, పాఠశాలలో ఫోర్త్‌క్లాస్ సిబ్బంది పనులు సైతం చేసే విధంగా వారి సేవలను వినియోగించుకుంటున్నారు. 2012లో రూ.5500లతో ప్రారంభమైన వేతనం ప్రస్తుతం రూ.19,500కు చేరుకుంది. 12 సంవత్సరాల నుంచి విద్యాశాఖలో వెట్టి చాకిరీ చేస్తున్నామని, ప్రస్తుతం ఇస్తున్న వేతనం కుటుంబ పోషణకు ఏమాత్రం సరిపోవడం లేదని, రోజు రోజుకూ పని భారం పెరిగి మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రూ.28 వేల కనీస వేతనం ఇవ్వాలని కోరుతున్నారు.
ఉద్యోగుల విధులు..
బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలి.
ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఉపాధ్యాయుడు సెలవు లో వెళ్లినపుడు విద్యార్థులకు పాఠాలు బోధించాలి.
పాఠశాలలకు, కాంప్లెక్స్ పాఠశాలలకు అనుసంధా నంగా ఉంటూ మౌలిక వసతులు కల్పించాలి.
పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు సకాలంలో విద్యార్థులకు అందేలా చూడాలి.
నెలలో ఒకసారి తప్పనిసరిగా కాంప్లెక్స్ పరిధిలో పాఠశాలలను సందర్శించి పాఠశాల ముగింపు వరకు ఉండాలి.
సందర్శించిన పాఠశాలల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి.
జిల్లాలో 6-14 సంవత్సరాల పిల్లల వివరాలను సేకరించాలి.
తన క్లస్టర్ పరిధిలో ఉన్న పాఠశాలలను ప్రతీ రోజు ఒకటి చొప్పున సందర్శించాలి.
ఉదయం ప్రార్థన సమయానికి విధిగా అక్కడ ఉండాలి.
ఎంత మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు హాజరైంది లెక్కరాసుకోవాలి.
ఆ తర్వాత తరగతి గదులలో అటెండెన్స్ తీసుకోవాలి.
మధ్యాహ్న బోజన అమలు, పర్యవేక్షణ, పాఠశాలల పని తీరుపై ఉన్నతాధికారులకు నివేదికలు అందించాలి.
వీటితో పాటు అదనంగా బియ్యం పంపిణీ, పుస్తకాల పంపిణీ, విద్యార్థులకు ఆధార్ కార్డుల నమోదు చేస్తున్నారు.
డిమాండ్లు..
కనీసం వేతనం రూ.19,500 నుంచి రూ.28 వేలకు పెంచాలి.
ఉద్యోగ భద్రత కల్పించి మహిళా సీఆర్‌పీలకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి.
పాఠశాలలను సందర్శించినప్పుడు టీఏ, డీఏలతో పాటు సెల్‌ఫోన్ ఇంటర్నెట్ చార్జీలను చెల్లించాలి.
స్టేషనరీ, జిరాక్స్, రవాణా ఖర్చులకింద ప్రతీ నెల రూ.2 వేలు అదనంగా ఇవ్వాలి.
ప్రభుత్వం స్పందించి సత్వర చర్యలు తీసుకోవాలి..
- గోలి రవీందర్ రెడ్డి, ఎంఎస్ కోఆర్డినేటర్ల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సమగ్రశిక్ష కాంట్రాక్టు సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు టైం స్కేల్ వర్తింపజేయాలి. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం రూ.28 వేల కనీస వేతనం చెల్లించడంతో పాటు ఈస్‌ఐ వర్తింప జేయాలి. టీఏ, డీఏలు చెల్లించాలి. సెప్టెంబరు 2023లో హైదరాబాద్‌లో మేము చేసిన ధర్నాకు మద్దతు పలికిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సత్వరమే స్పందించి మా సమస్యల పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలి.
ప్రసూతి సెలవులు ఇవ్వాలి..
- చుక్కని జ్యోతి, సమగ్రశిక్ష జిల్లా జేఏసీ ప్రతినిధి
సమగ్రశిక్ష మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వాలి. ఇతర వెసులుబాట్లను కల్పించాలి. గత సంవత్సరం మేము చేపట్టిన రిలే నిరహార దీక్షల సమయంలో కాంగ్రెస్ నాయకులు మాకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి.
అర్హతలు ఉన్నవారిని రెగ్యులరైజ్ చేయాలి..
- తాడూరి రమేష్ కుమార్, కంప్యూటర్ అపరేటర్ల జిల్లా అధ్యక్షుడు
విద్యా వనరుల కేంద్రాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో పని చేస్తున్న సీఆర్‌పీలు, ఎంఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూ టర్ అపరేటర్లను ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలి. విధి నిర్వహణలో మృతి చెందిన వారికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి.
Updated Date - Jun 23 , 2024 | 12:21 AM