సర్కారు సొమ్ముతో మిల్లర్ల సోకు!
ABN, Publish Date - Dec 03 , 2024 | 12:46 AM
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అక్రమార్కు లపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాం గం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని.. మర పట్టి సివిల్ సప్లయీస్ శాఖకు బియ్యంగా అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లర్లు దర్జాగా సీఎంఆర్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్‌లో రూ.91.80కోట్ల అవినీతి జరిగినట్టుగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సైతం గుర్తించింది. అయితే అక్రమార్కులు క్రిమినల్ కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో రూ.91.80 కోట్ల సీఎంఆర్ స్వాహా
ప్రభుత్వ బియ్యంతో మిల్లర్ల వ్యాపారం
16 రైస్‌మిల్లుల్లో సీఎంఆర్ అమ్ముకున్న వారిపై క్రిమినల్ కేసులు
మిల్లర్లకు ఆర్‌ఆర్ యాక్టు కింద నోటీసులు ఇచ్చిన అధికారులు
డిఫాల్టర్ల నుంచి రికవరీ చేయకుండా రెవెన్యూపై ఒత్తిళ్లు
కోర్టుకెళ్లి ఉత్తర్వులు తెచ్చుకునేలా అధికారులు సహకరిస్తున్నారని ఆరోపణలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అక్రమార్కు లపై చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాం గం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని.. మర పట్టి సివిల్ సప్లయీస్ శాఖకు బియ్యంగా అప్పగించాల్సి ఉంది. అయితే మిల్లర్లు దర్జాగా సీఎంఆర్‌ను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సీఎంఆర్‌లో రూ.91.80కోట్ల అవినీతి జరిగినట్టుగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సైతం గుర్తించింది. అయితే అక్రమార్కులు క్రిమినల్ కేసులు పెట్టి, నోటీసులు ఇచ్చి అధికారులు చేతులు దులుపుకొన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అక్రమాలకు పాల్పడిన మిల్లర్లకు కొందరు ప్రజాప్రతినిధులు మద్దతుగా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కోర్టుల ద్వారా స్టే తెచ్చుకుని కోట్లు కొల్లగొట్టే పనిలో మిల్లర్లున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సర్కారు బియ్యంతో మిల్లర్ల బిజినెస్..
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వటంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2023–24 సంవత్సరంలోని ఖరీఫ్‌లో 4,26,576 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. ఈ ధాన్యాన్ని మరాడించి 2,85,972 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మిల్లర్లు ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2.30లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించారు. అలాగే యాసంగిలో 5,16,974 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. 3.30 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ ఇచ్చినట్టుగా సమాచారం. మొత్తం 9,43,550 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి మరాడించేందుకు (సీఎంఆర్) మిల్లర్లకు అప్పగించింది. మిల్లర్లు క్వింటా వడ్లకు 67కిలోల చొప్పున కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)ను తిరిగి ప్రభు త్వానికి అప్పగించాలి. వడ్లను మరాడించి నందుకు ప్రభుత్వం మిల్లర్లకు చార్జీలు చెల్లిస్తోంది. అయితే నిర్ణీత సమయంలో మిల్లింగ్ చేసి ప్రభుత్వానికి బియ్యాన్ని అప్పగించాల్సి ఉన్నా మిల్లర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ.. సీఎంఆర్‌ను పక్కదారి పట్టించారు. ప్రభుత్వ బియ్యంతో మిల్లర్లు పైసా ఖర్చు లేకుండా దర్జాగా రూ.కోట్లల్లో వ్యాపారం చేసి సొమ్ము చేసుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
రూ.91.80కోట్ల సీఎంఆర్ స్వాహా చేశారు..
కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్)లో భారీ అక్రమాలు జరిగాయి. మిల్లర్లకు ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మరాడించి పౌరసరఫరాల శాఖకు అప్పగించాల్సి ఉంటుంది. అయితే పౌరసరఫరాల శాఖ అధికారుల నిర్లక్ష్యంతో మిల్లర్లు సీఎంఆర్ ఇవ్వకుండా.. మరాడించిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్మేసుకున్నారు. సీఎంఆర్ కోసం పలుమార్లు గడువులు విధించిన మిల్లర్లు స్పందించకపోవటంతో ఇటీవల విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ బృందం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 రైస్‌మిల్లులపై దాడులు నిర్వహించింది. దీంతో ప్రభుత్వ బియ్యంతో రేషన్ దందా చేసిన మిల్లర్ల బాగోతం వెలుగులోకి వచ్చింది. వరంగల్ జిల్లాలో నాలుగు మిల్లుల్లో రూ.12.43కోట్ల సీఎంఆర్‌ను పక్కదారి పట్టించినట్టుగా గుర్తించారు. సీఎంఆర్‌ను అమ్ముకున్న గీసుకొండ మండలం గొర్రెకుంటలోని జయ ఇండస్ర్టీస్, చెన్నారావుపేట మండలం అక్కల్‌చెడులోని లక్ష్మీగణపతి రైస్ మిల్, పాత ముగ్ధంపురంలోని శ్రీవీరభద్రస్వామి రైస్‌మిల్, సంగెం మండలం పల్లారిగూడలోని శ్రీ మహాలక్ష్మి మోడ్రన్ రైస్ మిల్లులను డిఫాల్టర్‌గా గుర్తించారు. అలాగే హనుమకొండ జిల్లాలో రెండు మిల్లులో రూ.7.30కోట్ల బియ్యాన్ని మిల్లర్లు దారి మళ్లించి సొమ్ము చేసుకున్నారు. ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామంలోని శ్రీబాలాజీ ఇండస్ర్టీస్, ఐనవోలు మండలం పున్నెలు గ్రామంలోని నారాయణ ఆగ్రో ఇండస్ర్టీస్‌ల్లో సీఎంఆర్ అక్రమాలను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అలాగే అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలో ఐదు మిల్లుల నుంచి రూ.54.80కోట్ల సీఎంఆర్‌ను బ్లాక్ మార్కెట్‌కు తరలించి.. ప్రభుత్వం సొమ్ముతో మిల్లర్లు కోట్లు దండుకున్నారు. కురవి, మరిపెడ, కేసముద్రం, గూడూరు మం డలాల్లో ఐదు మిల్లుల్లో భారీగా సీఎంఆర్ మింగేశా రు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 మిల్లుల నుంచి రూ.91.80కోట్ల విలువైన సీఎంఆర్ ను అక్రమంగా మిల్లర్లు అమ్ముకున్నారు. దీంతో మిల్లర్లపై స్థానిక పోలీసు స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
నోటీసులతోనే సరి.. ఆర్‌ఆర్ యాక్ట్ ఏమాయె?
మిల్లర్లపై చర్యలకు అధికారులు వెనుకాడుతు న్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 16 మిల్లుల్లో రూ.91.80 కోట్ల బియ్యాన్ని పక్కదారి పట్టించినట్టుగా విజి లెన్స్ అధికారులు ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చా రు. దీంతో అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల నుంచి మొత్తాన్ని రికవరీ చేసేందుకు ప్రభుత్వం రెవెన్యూ రికవరీ యాక్టును ప్రయోగించాలని సూచించింది. దీంతో రంగలోకి దిగిన సివిల్ సప్లయీస్, రెవెన్యూ శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడిన మిల్లర్ల కు ఆర్‌ఆర్ యాక్ట్ కింద నోటిసులు జారీ చేశారు. పెద్ద మొత్తం లో సీఎంఆర్ పక్కదారి పట్టడంతో అధికారులు మిల్లర్ల నుంచి రిక వరీకి తీవ్ర ప్రయత్నాలు చేస్తారని భావించినా ఐదారు నెలలుగా నోటీసులు ఇచ్చిన మిల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమాలను వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారుల్లో కొందరు మిల్లర్లతో కుమ్మక్కై అయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకోవటంలో జాప్యం చేస్తూ, మిల్లర్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకునేలా సహకరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో 16మంది మిల్లర్లలో ఇప్పటికే ఐదారుగురు మిల్లర్లు హైకోర్టు నుంచి స్టే అర్డర్ తెచ్చుకున్నారని, మరికొందరు అదే పనిలో హైదరాబాద్‌లో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. సుమారు రూ.92కోట్ల విలువైన ప్రభుత్వ బియ్యాన్ని మాయం చేసిన వారిపై చర్యలు లేకుండా అధికారులే దొడ్డిదారిన సహకరించడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధులతో రెవెన్యూ, సివిల్ సప్లయీస్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అంతేకాకుండా డిఫాల్టర్‌గా గుర్తించిన మిల్లర్లు ఇతర చోట బినామీ పేరుతో మరో మిల్లును ప్రారంభించి సీఎంఆర్ కోసం ధాన్యాన్ని తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. గతంలో వరంగల్ జిల్లా నర్సంపేట ఏరియాలో సీఎంఆర్‌లకు పాల్పడి రూ.కోట్లు పోగేసిన ఓ వ్యాపారి క్రిమినల్ కేసు నమోదైంది. ఆ తరువాత రెండేళ్ల క్రితం ములుగు జిల్లాలో బినామీ పేరుతో మరో మిల్లును ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా సీఎంఆర్‌లో అక్రమాలకు పాల్పడి సుమారు రూ.4కోట్లకు పైగా బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో అధికారులు పెట్టే కేసులను అక్రమార్కులు తేలికగా తీసుకుంటున్నారనే అభిప్రాయాలున్నాయి. రెవెన్యూ రికవరీ యాక్టు కింద కేసులు నమోదు చేస్తామని ప్రభుత్వం ప్రకటించటంతో అక్రమార్కుల్లో గుబులు రేపింది. దీంతో ప్రజాప్రతినిధులతో అధికారులపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
Updated Date - Dec 03 , 2024 | 12:46 AM