శిఖం.. ఖతం
ABN, Publish Date - Sep 03 , 2024 | 11:31 PM
జిల్లా కేంద్రం భూపాలపల్లిలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. చెరువులు, పంట కాల్వలు ఒక్కొ క్కటిగా మాయమవుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే వెంచర్లు, కట్టడాలు వెలుస్తున్నాయి. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని గోరంట్లకుంట శిఖం భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి.
కబ్జా కోరల్లో భూములు
భూపాలపల్లిలో మాయమవుతున్న చెరువులు, పంట కాల్వలు
ప్లాట్లుగా అమ్ముకుంటున్న అక్రమార్కులు
ఆక్రమణలను కాపాడుకోవడానికి పాడరాని పాట్లు
‘భూడ్రా’ వస్తేనే కట్టడి చేయొచ్చంటున్న జనం
భూపాలపల్లి కలెక్టరేట్, సెప్టెంబరు 3: జిల్లా కేంద్రం భూపాలపల్లిలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. చెరువులు, పంట కాల్వలు ఒక్కొ క్కటిగా మాయమవుతున్నాయి. చూస్తూ చూస్తుండగానే వెంచర్లు, కట్టడాలు వెలుస్తున్నాయి. కలెక్టరేట్‌కు కూత వేటు దూరంలోని గోరంట్లకుంట శిఖం భూములు పూర్తిగా అన్యాక్రాంతమయ్యాయి. సర్వే నంబర్ 209లోని 22.19 ఎకరాల శిఖం భూమిని అక్రమార్కులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. వెంచర్లు, సాగు భూములు చేయడంతోపాటు మాజీ ఎమ్మెల్యే ఏకంగా గుడి కట్టి, దానికి అనుబంఽధంగా కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అలాగే మునిసిపల్ కౌల్సిలర్ ఒకరు శిఖం భూమిలో వెంచర్ వేసి ప్లాట్స్‌గా అమ్మేసుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అలాగే భాస్కర్‌గడ్డ వద్ద 255, 256 సర్వే నంబర్లలో ఉన్న బొబ్బగట్టు మాటు పంట కాల్వలను పలువురు అక్రమార్కులు ధ్వంసం చేసి వెంచర్ వేశారని తెలుస్తోంది.
జిల్లా కేంద్రంలోని గోరంట్ల కుంట ఉన్న సర్వే నంబర్ 209లోని 22.19 ఎకరాల్లో 1.32 గుంటలను అప్పటి అధికార పార్టీ కౌన్సిలర్, ఆయన అనుచరులు కబ్జా చేశారనే ఆరోణలు ఉన్నాయి. 209 సర్వే నంబర్‌ను 213 నంబర్‌గా నాలా కన్వర్షన్ చేసుకున్నారని, ఆక్రమించిన భూమిని వెంచర్‌గా చేసి ప్లాట్స్ అమ్మేసుకున్నారని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే.. ఈ వెంచర్‌లో విద్యుత్‌శాఖ అధికారులు కరెంటు కనెక్షన్ కూడా సమకూర్చారు. అలాగే మరో 15 గుంటల భూమిని ఆక్రమణదారులు ఓపెన్ ప్లాట్స్‌గా అమ్ముకొని జేబులు నింపుకున్నారు. మరికొందరు 1.25 ఎకరాల చెరువు భూమి ఆక్ర మించి వ్యవసాయం చేస్తున్నారు. అంతేకాదు.. తమ కబ్జాలో ఉన్న భూములను కాపాడుకోవడానికి అక్రమార్కులు అనేక దారులు వెతుక్కుంటు న్నారని సమాచారం. గతంలో ఉన్న పార్టీ కండువాను తీసి పారేసి.. ప్రస్తుత అధికార పార్టీ పంచాన చేరారనే విమ ర్శలు వస్తున్నాయి. గోరంట్ల కుంట ఆక్రమ ణలకు గురికావడం వెనుక భూపాలపల్లి మండలంలో గతంలో పనిచేసిన తహ సీల్దార్ పాత్ర ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. చెరువు శిఖానికి చెందిన 209 సర్వే నంబర్‌లోని 1.32 ఎకరాల భూమిని 213 సర్వే నంబర్‌గా నాలా కన్వర్షన్ చేసి అక్రమార్కులకు ఆయన సహకరించారనే వాదనలు ఉన్నాయి.
హైకోర్టు మెట్లెక్కిన ఇరిగేషన్ శాఖ
మంజూర్‌నగర్‌లోని గోరంట్ల కుంట శిఖం భూమిలో జరిగిన అక్రమాల పై నీటి పారుదలశాఖ, సర్వే ల్యాండ్, మునిసిపాలిటీ, రెవెన్యూ అధికారు లు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. ఇక్కడ అక్రమాలు చోటు చేసుకున్నట్లు తేల్చారు. చెరువు శిఖం హద్దులను కుడా ఏర్పాటు చేశారు. శిఖం భూమిలో వెంచర్, వ్యవసాయ భూమి, వెంకటేశ్వర ఆలయం నిర్మాణం, కాంప్లెక్స్ కట్టడంతో పాటు అప్పటి ఎమ్మెల్యే కాంప్లెక్స్, ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించారు. వీటిలో ఆలయం, కాంప్లెక్స్ నిర్మాణాలు కోర్టు పరిధిలో ఉండటం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లు ప్రభుత్వ నిర్మాణాలు కావడంతో అధికారులు వీటిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. శిఖంలో వెలిసిన ఇతర కట్టడాలపై చర్యలు తీసుకునేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వలంటూ నీటిపారుదల శాఖ అధికారులు ఈ ఏడాది జనవరి 29న అప్పటి కలెక్టర్ భవేష్ మిశ్రాకు లేఖ రాశారు. ఈ ఆక్రమణలపై ఆయన ఏమీ తేల్చకపోవడంతో చేసేదేమీ లేక ఇరిగేషన్ అఽధికారులు ఏప్రిల్ 26న హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.
‘భూడ్రా’ రావాలంటున్న జనం
హైదారాబాద్‌లో ధ్వంసమవుతున్న చెరువులను పరిరక్షించేం దుకు రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసిస్ట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్)పై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనూ అలాంటి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. హైడ్రా మాదిరి భూడ్రా (డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసిస్ట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఏర్పాటు చేసి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆక్రమణలను తొలగిస్తాం...
- రాహుల్‌శర్మ, జయశంకర్ భూపాలపల్లి కలెక్టర్
చెరువులను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. అక్రమార్కులను ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు వెనుకాడం. దీని కార్యాచరణపై ఎస్పీతో చర్చిస్తాను.
Updated Date - Sep 03 , 2024 | 11:31 PM