సైట్లు సిద్ధం.. సర్కారుదే ఆలస్యం
ABN, Publish Date - Jun 18 , 2024 | 11:50 PM
కళ్లెం టెక్స్‌టైల్ పార్కు బాలారిష్టాల్లో చిక్కుకుం ది. సకల సౌకర్యాలతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సైట్లు సిద్ధం చేసి ఔత్సాహికులకు కేటాయించినా పరిశ్రమ ప్రారంభం కావడంలేదు. ఒక్క యూనిట్ ప్రారంభించాలంటే రూ.కోటికి పైగా నిధులు అవసరం కావడంతో లబ్ధిదారులు రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ముందుకొచ్చి బ్యాంక ర్లతో మాట్లాడి రుణాల విషయంలో వెసులుబా టు కల్పిస్తే తప్ప అడుగుముందుకు పడే పరిస్థితి కనిపించడంలేదు.
బాలారిష్టాల్లో కళ్లెం టెక్స్‌టైల్ పార్కు
15 ఏళ్లవుతున్నా ప్రారంభం కాని పరిశ్రమ
2009లోనే 117 ఎకరాల భూసేకరణ
బీఆర్‌ఎస్ హయాంలో అభివృద్ధి పనులు
465 యూనిట్ల స్థాపనకు అవకాశం
పెట్టుబడులు అందక ముందుకు రాని ఔత్సాహికులు
కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించాలని విన్నపం
పార్కు ప్రారంభమైతే 20 వేల మందికి ఉపాధి
జనగామ, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): చేనేత కార్మికు లకు, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రతిపాదించిన కళ్లెం టెక్స్‌టైల్ పార్కు ప్రారంభానికి మోక్షం కలగడం లేదు. పార్కు ఏర్పాటు కు 2009లో అడుగులు పడగా 15 ఏళ్లు అయినా నేటికీ అతీగతి లేకుండా పోయింది. 15 ఏళ్లుగా ఎన్ని ప్రభుత్వాలు మారినప్పటికీ టెక్స్‌టైల్ పార్కు మాత్రం ప్రారంభం కావడం లేదు. 2009లో పార్కు ఏర్పాటు కు అడుగులు పడగా ఆ తర్వాత దాన్ని పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. పదేళ్ల తర్వాత 2019లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పార్కు ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా పార్కు అభివృద్ధికి సుమారు రూ. 25 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులతో టెక్స్‌టైల్ పార్కు ప్రతిపాదిత స్థలంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాలు, సబ్‌స్టేషన్ నిర్మాణం, వాటర్ ట్యాంకు నిర్మాణం, యూనిట్ల స్థాపనకు అనుకూలంగా ప్లాట్ల అభివృద్ధి వంటి పనులను చేపట్టారు. దాదాపు రెండేళ్ల క్రితమే పనులు పూర్తయినప్పటికీ యూనిట్ల స్థాపన పనులు ముందుకు సాగలేదు.
2009లో భూసేకరణ
పొట్టచేత పట్టుకొని సూరత్, సోలాపూర్ లాంటి ప్రాంతాలకు వలస వెళ్లిన చేనేత కార్మికులను వెనక్కి రప్పించాలన్న లక్ష్యంతో 2009లోనే లింగాలఘణపురం మండలం కళ్లెం శివారులో టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు కు వైఎస్ హయాంలోని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇందులో భాగంగా కళ్లెం శివారులో 117 ఎకరాల స్థలాన్ని సేకరించారు. కాని పార్కు ఏర్పాటుకు మాత్రం ఎటువంటి కార్యాచరణ చేపట్టలే దు. దీంతో టెక్స్‌టైల్ పార్కు అంశం మరుగున పడిపో యింది. 2014లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అంశంపై దృష్టి సారించింది. తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్టక్చర్ కార్పొరేషన్(టీఎస్‌ఐఐసీ) ఆధ్వర్యంలో పార్కు అభివృద్ధికి ముందుకొచ్చింది. అందులో భాగంగా టెక్స్‌టైల్ పార్కును యూనిట్ల స్థాపనకు అనుకూలంగా అభివృద్ధి చేసేందుకు రూ. 25 కోట్లు మంజూరు చేసింది.
పనులు పూర్తయినా పట్టింపు లేదు..
టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో చేపట్టిన కళ్లెం టెక్స్‌టైల్ పార్కుకు సంబంధించిన పనులు 95 శాతం పూర్తయ్యాయి. 2019లో అప్పటి ప్రభుత్వం దీనిపై దృష్టి సారించడంతో పదేళ్ల పాటు మరుగున పడిన పార్కు విషయంలో కదలిక వచ్చింది. అప్పట్లో ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 25 కోట్లతో 117 ఎకరాల స్థలంలో అభివృద్ధి పనులు జరిగాయి. 117 ఎకరాల ప్రతిపాదిత పార్కు స్థలంలో అంతర్గత రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, విద్యుత్ స్తంభాల ఏర్పాటు పనులు పూర్తయ్యాయి. టెక్స్‌టైల్ పార్కుకు అవసరమయ్యే విద్యుత్ కోసం పార్కులోనే 33/11 కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారు. ఈ పనులు దాదాపుగా పూర్తి కాగా ట్రాన్స్‌ఫార్మర్లు మాత్రమే బిగించాల్సి ఉంది. దీంతో పాటు నీటి సౌకర్యం కోసం భారీ ఓవర్‌హెడ్ ట్యాంకు నిర్మాణం చివరి దశలో ఉంది. ప్రతిపాదిత 117 ఎకరాలను ప్లాట్లుగా లేఅవుట్ చేసి 465 యూనిట్లను ఏర్పాటు చేసేలా సిద్ధం చేశారు. 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఒక్కో ప్లాటును లేఅవుట్ చేశారు. 465 యూనిట్లకు గాను సూరత్, సోలాపూర్‌కు చెందిన 39 మంది ఔత్సాహికులు పవర్‌లూమ్ ఆధారిత క్లాత్ తయారీ పరిశ్రమల ఏర్పాటు కోసం ముందుకొచ్చారు. ఔత్సాహికులు చదరపు మీటరకు రూ.3136 చొప్పున 500 చదరపు యూనిట్లకు డబ్బులు చెల్లించగా వారి పేరు మీద సేల్ అగ్రిమెంట్‌ను టీఎస్‌ఐఐసీ ఇచ్చింది. మొత్తం 88 మంది ముందుకు రాగా వారిలో కొంత మంది డబ్బులు కట్టడంలో ఆలస్యం చేయడంతో వారి అలాట్‌మెంట్ రద్దు అయింది. ప్రస్తుతానికి 39 మంది సేల్ అగ్రిమెంట్ పూర్తికావడంతో వారు బ్యాంకు రుణం కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇతర రాష్ట్రాల వారు కావడంతో బ్యాంకు రుణం విషయంలో కాస్త ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం సహకరిస్తే మరింత మంది ఔత్సాహికులు ముందుకు వచ్చే అవకాశం ఉంది. సూరత్, సోలాపూర్‌కు చెందిన పారిశ్రామికవేత్తలే కాకుండా స్థానికంగా ఉన్న చేనేత కార్మికులు సైతం పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే అవకాశం ఉంది.
20 వేల మందికి ఉపాధి
టెక్స్‌టైల్ పార్కు అందుబాటులోకి వస్తే జనగామ జిల్లాతో పాటు పక్కనే ఉన్న యాదాద్రి భునవగిరి జిల్లాకు చెందిన సుమారు 20 వేల మంది ఉపాధి దొరుకుతుంది. 15 వేల మంది ప్రత్యక్షంగా 5 వేల మందికి పరోక్షంగా ఉపాధి అందనుంది. జిల్లాకేంద్రానికి కేవలం 8 కిలోమీటర్లు, వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో మాత్రమే టెక్స్‌టైల్ పార్కు ఉంది. ఇటు రోడ్డుతో పాటు, రైల్వే రవాణా సౌకర్యం ఉన్నాయి. వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఉన్న పెంబర్తి గ్రామం నుంచి 4 కిలోమీటర్ల దూరంలో టెక్స్‌టైల్ పార్కు ఉంది. పార్కుకు వెళ్లేందుకు మాణిక్యపురం గ్రామం ఇవతలి నుంచి బైపాస్ నిర్మాణం చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి సంబంధించి ప్రక్రియ భూసేకరణ దశలో ఉంది. ఈ భూసేకరణ పూర్తయి పెంబర్తి నుంచి రెండు వరసల రోడ్డు నిర్మాణం జరిగితే టెక్స్‌టైల్ పార్కు జనగామ జిల్లాకు తలమానికంగా ఉంటుంది.
Updated Date - Jun 18 , 2024 | 11:50 PM