అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి
ABN, Publish Date - Aug 27 , 2024 | 11:52 PM
‘అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. ఆదివాసీలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వీటిని అందిపుచ్చుకొని ప్రజలు,ముఖ్యంగా ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అలాగే విద్యతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని అందూ గుర్తించాలి’ అని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పేర్కొన్నారు.
ఆదివాసీలు అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధించాలి
కేంద్ర, రాష్ట్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
కంటెయినర్ ఆస్పత్రుల ఏర్పాటు అభినందనీయం
ములుగు జిల్లా పర్యటనలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలతో కలిసి కలెక్టరేట్‌లో అధికారులతో సమావేశం
విద్యావేత్తలు, జాతీయ క్రీడాకారులతో భోజనం
ప్రఖ్యాత రామప్ప దేవాలయం సందర్శన
లక్నవరం ఐలాండ్‌లోని పర్యాటక కాటేజీలో బస
ములుగు, ఆగస్టు 27: ‘అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందరికీ అందాలి. ఆదివాసీలు, గిరిజనులు, అట్టడుగు వర్గాల అభ్యున్నతికోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కృషిచేస్తోంది. విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యమిస్తోంది. వీటిని అందిపుచ్చుకొని ప్రజలు,ముఖ్యంగా ఆదివాసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. అలాగే విద్యతోనే ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని అందూ గుర్తించాలి’ అని గవర్నర్ జిష్టుదేవ్ వర్మ పేర్కొన్నారు. మూడురోజుల ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యటనకుగాను తొలిరోజైన మంగళవారం ఆయన ములుగు జిల్లాకు వచ్చారు. తొలుత గట్టమ్మ సమీపంలోని ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్ర్తీశిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, జిల్లా కలెక్టర్ టీఎస్.దివాకర, ఎస్పీ శబరీశ్, ఐటీడీఏ పీవో చిత్రమిశ్రా, డీఎఫ్‌వో రాహుల్ కిషన్‌జాదవ్, అదనపు కలెక్టర్లు శ్రీజ, మహేందర్‌జీ పూలమొక్కలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. గంటసేపు విశ్రాంతి తర్వాత ములుగు కలెక్టరేట్‌కు చేసుకున్న గవర్నర్ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లా అధికార యంత్రాంగంతో సమావేశమ య్యారు. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న ఆదివాసీలకు అత్యవసర వైద్యసేవలు అందించేందుకు కంటెయినర్ ఆస్పత్రులు ఏర్పాటుచేయడం అభినందనీయమని, వినూత్న ఆలోచనను అమలుచేసిన మంత్రి సీతక్కను అభినందించారు. ఆధునిక సమాజంలో ఆదివాసీలు, గిరిజనులు భాగస్వాములను చేసేందుకు ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. పేదలకు మౌళిక వసతులు కల్పించేందుకు ప్రత్యేకంగా కృషి చేయాలన్నారు. గతంలో తాను రూరల్ డెవలప్‌మెంట్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేసిన అనుభవం ఉందని తెలిపారు. గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఏజెన్సీ ప్రాంతా నికి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా జిల్లా భౌగోళిక పరిస్థితులు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతీరుపై కలెక్టర్ టీఎస్.దివాకర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. విస్తారమైన అడవులు, విశాలమైన గోదావరి తీరం, ఆంధ్ర ప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దును కలిగి ఉన్నట్లు తెలిపారు. వర్షాకాలంలో 80కిపై గా పరివాహక గ్రామాలు గోదావరి ముంపుకు గురవుతాయని, వానాకాలం లో ముంపు బాధితులను ముందస్తు గా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నా మని వివరించారు. మాతాశిశు మరణాల రేటు గణనీయంగా తగ్గిందని, సంక్షేమ శాఖలను ఒకే గొడుగు కిందకు తీసుకు వచ్చి సమర్ధవంతంగా అమలు చేస్తున్నా మని, సఖి కేంద్రం ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తున్నావని తెలిపారు. ఎస్పీ శబరీశ్ శాంతిభద్రతల పరిరక్షణను వివరించారు.
మేడారానికి జాతీయ హోదాకు చొరవ చూపాలి : సీతక్క
మేడారం మహాజాతరకు జాతీయ పండుగ హోదా దక్కేలా చొరవ చూపాలని మంత్రి సీతక్క గవర్నర్‌ను కోరారు. త్రిపుర డిప్యూటీ సీఎంగా, మంత్రిగా పనిచేసిన క్రమంలో ప్రజా సంక్షేమం, అభివృద్ధికోసం పాటుపడ్డారని, తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటగా ములుగు జిల్లా పర్యటనకు రావడం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ములుగుప్రాంతంలో రాష్ట్రంలోనే అత్యధికంగా ఆదివాసీ, గిరిజన ప్రజలు నివసిస్తూ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకగా నిలుస్తున్నారన్నారు. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన సమ్మేళనమైన మేడారంసమ్మక్క, సారలమ్మ జాతర రెండేళ్లకోసారి జరుగుతుందని తెలిపారు. ఈప్రాంత సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారమందిస్తోందన్నారు.
క్రీడాకారులు, విద్యావేత్తలతో గవర్నర్ భేటీ
జాతీయ, రాష్ట్రస్థాయి పురస్కారాలు పొందిన విద్య, సామాజికవేత్తలు, కవులు, క్రీడాకారులతో ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో గవర్నర్ జిష్ణుదేవ్ భేటీ అయ్యారు. వారితో కలిసి భోజనం చేశారు. అంతకుముందు మంత్రి సీతక్క జిష్ణుదేవ్ వర్మతో ప్రత్యేకంగా సమావేశమై జిల్లా ప్రాధాన్యతను వివరించారు. గవర్నర్ భేటీలో ప్రొఫెసర్ పాండురంగారావు, రచయిత రాచర్ల గణపతి, అంతర్జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు పాలడుగు వెంకటేశ్వర్‌రావు, అసిస్టెంట్ ప్రొఫెసర్ అంబటి శ్రీజన్, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కందాల రామయ్య, రెజ్లింగ్ క్రీడాకారిని చల్ల మౌనిక, జిమ్నాస్ట్ పి.రజిత, పర్యావరణ పరిశోధకుడు కాజంపురం దామోదర్, సోషల్ వర్కర్ కొమురం ప్రభాకర్ పాల్గొన్నారు. గవర్నర్ పర్యటనలో ఆర్డీవో సత్యపాల్‌రెడ్డి, ఓఎస్డీ మహేష్ గీతే, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, తదితరులు పాల్గొన్నారు.
నేటిపర్యటన ఇలా..
గవర్నర్ జిష్ణుదేవ్ తన పర్యటనలో భాగంగా తొలిరోజైన మంగళవారం ములుగు జిల్లా రామప్ప, జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురంలోని కాకతీయుల కట్టడాలు, కోటగుళ్లను సందర్శించారు. రాత్రికి లక్నవరంలోని ఐలాండ్‌లో టూరిజం కాటేజీలో బస చేశారు. ఇక బుధవారం ఉదయం ఆయన 6గంటల నుంచి 9గంటల వరకు లక్నవరం అందాలను వీక్షిస్తారు. ఆతర్వాత వరంగల్ చేరుకుని సాయంత్రం 6గంటలకు వరంగల్ కోటను సందర్శించి కాకతీయుల కాలం నాటి అపురూప శిల్పసంపదతో పాటు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేపట్టిన కోట అభివృద్ధి పనులను ఆయన పరిశీలిస్తారు. ఆ తర్వాత మూడోరోజైన గురువారం జనగామ జిల్లాలో ఆయన పర్యటన ఉండనుంది.
Updated Date - Aug 27 , 2024 | 11:52 PM