పురపాలకం అయ్యేనా?
ABN, Publish Date - Sep 11 , 2024 | 11:18 PM
వేగంగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్ ఉండటంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. కోర్టు కూడా మంజూరైంది. ఇన్ని ఉన్నా పురపాలక హోదాకు మాత్రం స్టేషన్ ఘన్‌పూర్ నోచుకోవడం లేదు. ఘన్‌పూర్ కంటే తక్కువ జనాభ, విస్తీర్ణం తక్కువ ఉన్న మండల కేంద్రాలను గత ప్రభుత్వం మున్సిపాలిటీగా చేసి ఘన్‌పూర్‌ను మాత్రం విస్మరించింది.
‘ఘన్‌పూర్’కు అందని ద్రాక్షలా మునిసిపల్ హోదా
అన్ని అర్హతలున్నా పక్కన పెట్టిన వైనం
నీటిమూటలుగానే నేతల ప్రకటనలు
కడియం చొరవపైనే ప్రజల ఆశలు
స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబరు 11: వేగంగా అభివృద్ధి చెందుతోంది. జాతీయ రహదారి, రైల్వేస్టేషన్ ఉండటంతో పాటు రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మారింది. కోర్టు కూడా మంజూరైంది. ఇన్ని ఉన్నా పురపాలక హోదాకు మాత్రం స్టేషన్ ఘన్‌పూర్ నోచుకోవడం లేదు. ఘన్‌పూర్ కంటే తక్కువ జనాభ, విస్తీర్ణం తక్కువ ఉన్న మండల కేంద్రాలను గత ప్రభుత్వం మున్సిపాలిటీగా చేసి ఘన్‌పూర్‌ను మాత్రం విస్మరించింది. గత ప్రభుత్వంలో ఇక్కడి నుంచి ఇద్దరు ఉపముఖ్యమంత్రులుగా పనిచేసినా పురపాలకంగా మార్చలేక పోయారు అనే విమర్శలు వెల్లువెత్తాయి. 2018 ఎన్నికల ముందు నుంచి ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా చేయాలనే ప్రధాన డిమాండ్ ఉన్నా అది కార్యరూపం దాల్చలేదు. 2019లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 71కొత్త మున్సిపాలిటీలను ప్రకటించింది. ఆ సమయంలో ఘన్‌పూర్‌ను పక్కన పెట్టింది. అనంతరం ప్రజల నుంచి ఒత్తిడి పెరుగడంతో 2023 ఫిబ్రవరి 27వ తేధిన హన్మకొండ జిల్లా వేలేరు మండలంలోని సోడాషాపల్లి గ్రామంలో జరిగిన బీఆర్‌ఎస్ సభలో అప్పటి మంత్రి కేటీఆర్ ఘన్‌పూర్‌ను మున్సిపాలిటిగా చేస్తామని, ప్రతిపాదనలు పంపాలని సూచించారు. దీంతో చాగల్, శివునిపల్లి, ఘన్‌పూర్ గ్రామాలను కలుపుకొని మున్సిపాలిటీ చేసేలా ప్రతిపాధనలు పంపారు. ఈ నేపథ్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికలలోపే ప్రకటిస్తారని అందరూ భావించినా అది జరగలేదు. తాము మళ్లీ అధికారంలోకి రాగానే ఘన్‌పూర్‌ను పురపాలకంగా మార్చుతామని బీఆర్‌ఎస్ నాయకులు ప్రచారం చేశారు. కానీ బీఆర్‌ఎస్ అధికారం కోల్పోవడంతో స్టేషన్‌ఘన్‌పూర్ మునిసిపాలిటీ ప్రతిపాదనలు అటకెక్కాయి. ఘన్‌పూర్ ఎమ్మెల్యేగా బీఆర్‌ఎస్ నుంచి కడియం శ్రీహరి గెలవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పురపాలక హోదా ప్రశ్నార్థకంగా మారింది. కానీ అనంతర రాజకీయ పరిణామాల్లో కడియం శ్రీహరి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరడంతో ఘన్‌పూర్ పురపాలకంగా మారుతుందన్న ఆశ ప్రజల్లో మళ్లీ చిగురించింది. ఆయన నాయకత్వంలో ఘన్‌పూర్ మున్సిపాలిటీ ప్రకటన వస్తుందని ప్రజలు ఎదురుచూస్తున్నారు.
పంచాయతీ ఎన్నికలకు కసరత్తుతో మునిసిపాలిటీపై సందిగ్ధం..
ఇప్పటికే గ్రామాల వారీగా పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముం దే ఎంపీడీవో కార్యాలయ అధికారుల ఆధ్వర్యంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను రూపొందించారు. ఓ వైపు జీపీ ఎన్నికలకు కసరత్తు జరుగుతున్న క్రమం లో ఘన్‌పూర్‌ను మున్సిపాలిటీగా ప్రభుత్వం ప్రకటించ కపోవడంతో మూడు గ్రామాలకు చెందిన ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. అసలు ఘన్‌పూర్ మున్సిపాలీటి అవుతుందా, కాదా అనే అంశమై సందిగ్ధం నెలకొంది. 2011 జనాభ లెక్కలను అనుసరించి స్టేషన్‌ఘన్‌పూర్ డివిజన్‌కేంద్రం పట్టణ జనాభా 12,271 ఉండగా, శివుని పల్లి పట్టణ జనాభా 6,242, ఈ రెండింటి జనాభా కలి పితే మొత్తం 18,963 ఉండంతో అందరూ మున్సిపాలి టీ అవుతుందని అనుకున్నారు. ప్రస్తుతం ఘన్‌పూర్ పట్టణ జనాభా సుమారు 20 వేల వరకు చేరుకోగా, శివునిపల్లి పట్టణ జనాభా సుమారు 10వేల వరకు ఉంది. ఘన్‌పూర్ పట్టణ పరిధిలో రెవెన్యూ డివిజన్ కార్యాలయం, రైల్వే స్టేషన్, బస్టాండ్, సమృద్ధిగా తాగునీరు, విస్తృతంగా పట్టణీకరణ జరుగుతోంది. ఇన్ని సదుపాయాలున్న ఘన్‌పూర్‌ను ఇప్పటికైనా మున్సి పాలిటీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.
స్వార్థంతో మున్సిపాలిటీ కాకుండా చేశారు
- శెనబోయిన నాగేష్, తెలుగు యువత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, శివునిపల్లి గ్రామం
మున్సిపాలిటీ అయ్యే అర్హతలన్నీ ఉన్నా కొందరు నేతల తమ స్వార్థ రాజకీయాల కోసం హోదా కాకుండా చేశారు. ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను చేసిన ఘన్‌పూర్‌ను పురపాలకం చేయకపోవడం దురదృష్టకరం. ఇప్పటికైనా నేతలు మేలుకొని పట్టణీకరణ చేసేందుకు కృషి చేయాలి.
ఘన్‌పూర్ కన్నా చిన్నవి మునిసిపాలిటీలయ్యాయి
- కనకం గణేష్ బీఆర్‌ఎస్ జిల్లా నేత, ఛాగల్ గ్రామం
స్టేషన్‌ఘన్‌పూర్ కంటే తక్కువ జనాభాఉన్న పట్టణాలను పురపాలకా లుగా చేశారు. పురపాలకమైతే కేంద్రం నుంచి కూడా నిధులు వస్తాయి. తద్వారా పట్టణం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఎంతో ఘన చరిత్ర కలిగిన ఘన్‌పూర్‌కు ఈ దుస్థితి రావడం దురదృష్టకరం. ఇప్పటికైనా నేతలు స్పందించి ఘన్‌పూర్, శివునిపల్లి, ఛాగల్ గ్రామాలను కలిపి పురపాలకంగా ప్రకటించి చిత్తశుద్ధిని చాటుకోవాలి.
ప్రభుత్వం ఘన్‌పూర్‌ను పురపాలకంగా ప్రకటిస్తుంది..
- అంబటి కిషన్‌రాజ్, కాంగ్రెస్ జిల్లా నేత
ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రత్యేక చొరవతో సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఘన్‌పూర్ ను పురపాలకంగా ప్రకటిస్తుం ది. గత ప్రభుత్వంలో నాయ కుల నిర్లక్ష్యంతో అన్ని అర్హతలున్నా ఘన్‌పూర్‌కు ఆ హోదా దక్కకుండా పోయింది. త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన వస్తుందనే నమ్మకం ఉంది.
Updated Date - Sep 11 , 2024 | 11:18 PM