ఎంక్వైరీపై వర్రీ
ABN, Publish Date - Aug 22 , 2024 | 11:22 PM
కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లలో ఆందోళన నెలకొంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేప్టేందుకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో గుబులు మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ పట్టుకుంది.
మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లలో గుబులు
విజిలెన్స్ మధ్యంతర నివేదికతో ఆందోళన
కమిషన్ ముందు క్రాస్ ఎగ్జామినేషన్ మొదలవడంతో టెన్షన్
21 మంది అధికారులు ఎవరనేదే చర్చ
మహదేవపూర్ రూరల్, ఆగస్టు 22 : కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజీ ఇంజనీర్లలో ఆందోళన నెలకొంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం ఇచ్చిన నివేదిక ఆధారంగా పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేప్టేందుకు మధ్యంతర ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో గుబులు మొదలైంది. ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ పట్టుకుంది. బ్యారేజీ కుంగుపాటుకు 21 మంది ఇంజనీర్ల పాత్ర ఉందని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పీసీ ఘోష్ కమిషన్‌కు నివేదిక అందించారు. దీనిపై ఇంజనీరింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఏక్షణాన కాళేశ్వరం ప్రాజెక్టు ఎంక్వైరీ కమిషన్ నుంచి పిలుపు వస్త్తుందోనని పలువురు హడలిపోతున్నారు. కొన్ని నెలలుగా సాఫీగా సాగుతున్న విచారణ కొత్త మలుపు చోటుచేసుకోవడం ఆ శాఖలో మరోమారు అలజడి సృష్టించింది.
ఎవరెవరిని పిలుస్తారో..?
గత సంవత్సరం అక్టోబరు 20న మేడిగడ్డ బ్యారే జీలోని 7వ బ్లాకుల్లో 19, 20, 21వ పిల్లర్లు కుంగు బాటుకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ, స్టేట్ డ్యాం సేప్టీ అథారిటీలు బ్యారేజీ ని పరిశీలించాయి. ఆ వెంటనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖతో విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విచారణ కొనసాగుతుండగానే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌తో న్యాయ విచారణ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇంజనీరింగ్ అధికారుల కంటికి కనుకు కరువైంది. ఏఈఈ స్థాయి నుంచి ఈఎన్‌సీ, సీఈ స్థాయి వరకు బ్యారేజీ నిర్మాణంలో భాగస్వామ్యం వహించిన ప్రతి ఒక్కరిపై విచారణ జరిగింది. తాజాగా విజిలెన్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం అధికారులు పీసీ ఘోష్ కమిషన్‌కు మధ్యంతర నివేదిక సమర్పించారు. బ్యారేజీ కుంగుబాటుపై 21 మంది ఇంజీనీర్ల పాత్ర ఉందంటూ పేర్కొనడంతో అక్కడ పనిచేసిన, పనిచేస్తున్న అధికారుల్లో ఆందోళన మొదలైంది. దీనికి ముందు బ్యారేజీలో పనిచేసే అధికారుల నుంచి అఫిడవిట్‌లో సమాచారం సేకరించిన కమిషన్ తాజా పరిణామాల నేపథ్యంలో ఎవరెవరిని క్రాస్ ఎగ్జామిన్ చేస్తుందోననే చర్చ కొనసాగుతోంది.
ఎవరా 21 మంది?
పీసీ ఘోష్ కమిషన్‌కు విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ ఇచ్చిన మధ్యంతర నివేదికలో ఉన్న అధికారులు ఎవరనేది ప్రధానంగా చర్చనీయాంశమైంది. 21మంది జాబితాలో ఏస్థాయి అధికారుల పేర్లు ఉన్నాయో.. అనే గుబులు మొదలైంది. బ్లాక్-7కు ప్రాతినిధ్యం వహించిన ఇంజనీ రింగ్ అధికారులతోపాటు ఈఈ, ఎస్‌ఈ, సీఈల వరకు ఇందులో ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు బ్యారేజీలోని మిగతా ఇంజనీర్లను కూడా విచారిస్తారా? అనేది ఇంజనీరింగ్ వర్గాల్లో చర్చ నడుస్తోం ది. ఇదిలా ఉండగా కొంతమంది ఇంజనీర్లు మాత్రం బాధ్యులు ఎవరైనా విచారణ మాత్రం తమకు తప్పేలా లేదంటూ వాపోతున్నారు. అప్పటి బీఆర్‌ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బ్యారేజీ అంశాన్ని రాజకీయంగా వాడుకుంటూ అందులో పనిచేసే ఇంజనీర్ల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని కొంత మంది అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి విజిలెన్స్ మధ్యంతర నివేదిక, కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ పర్వంతో ఇం జనీరింగ్ అధికారుల్లో కలవరం మొదలైంది. ఇందులో ఎవరెవరిని బాధ్యులు చేస్తారోన నేది చర్చనీయాంశంగా మారింది.
Updated Date - Aug 22 , 2024 | 11:22 PM