యువకుడి ఉన్మాదం
ABN, Publish Date - Jul 12 , 2024 | 12:45 AM
కూతురి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆ దంపతుల దారుణ హత్యకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను పెద్దల్లో పంచాయితీ పెట్టి విడదీశారని యువతి తల్లిదం డ్రులపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు.. వారి పాలిట కాలయముడ య్యాడు. గాఢ నిద్రలో ఉన్న వారిపై వేట కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత మార్చాడు. ఇక ఈ దాడిలో ఆ యువకుడి భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వరంగ ల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల్ తండాలో జరిగిన గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న యువతి తల్లిదండ్రులపై వేటకత్తితో దాడి
భార్యను దూరం చేశారన్న కక్షతో నరికి చంపిన వైనం
గాఢ నిద్రలో ఉండగా ఘాతుకం
భార్య, ఆమె సోదరుడిపైనా దాడి.. తీవ్రగాయాలు
వరంగల్ జిల్లా పదహారు చింతల్‌తండాలో ఘటన
చెన్నారావుపేట, జూలై 11: కూతురి ప్రేమ, పెళ్లి వ్యవహారం ఆ దంపతుల దారుణ హత్యకు దారి తీసింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న తమను పెద్దల్లో పంచాయితీ పెట్టి విడదీశారని యువతి తల్లిదం డ్రులపై కక్ష పెంచుకున్న ఆ యువకుడు.. వారి పాలిట కాలయముడ య్యాడు. గాఢ నిద్రలో ఉన్న వారిపై వేట కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత మార్చాడు. ఇక ఈ దాడిలో ఆ యువకుడి భార్య, ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వరంగ ల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారుచింతల్ తండాలో జరిగిన గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ దారుణ ఘటన కలకలం రేపింది. పోలీసులు, గ్రామస్థుల తెలిపిన వివరాల ప్రకారం.. పదహారు చింతల్ తండాకు చెందిన బానోతు శ్రీనివాస్ (40) బానోతు సుగుణ (35) దంపతులకు ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న ఆ దంపతుల కూతురు దీపిక హనుమకొండలోని పింగిళి కళాశాలలో డిగ్రీ రెండో సంవత్సరం, కుమారుడు మదన్‌లాల్ అమీనాబాద్ మోడల్ పాఠశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నారు. ఇక గీసుకొండ మండలం కొమ్మాలకు చెందిన మేకల నాగరాజు(బన్నీ) అనే యువకుడు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం గుండెంగ గ్రామంలోని తన అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటూ ఆటోడ్రైవర్‌గా పని చేస్తూ.. నిత్యం గుండెంగ నుంచి నెక్కొండకు ఆటోను నడుపుతుంటాడు. అయితే గతంలో దీపిక అమీనాబాద్ మోడల్ పాఠశాలలో చదువుతున్న సమయంలో నాగరాజు తన ఆటోలో ఎక్కించుకొని పాఠశాల వద్ద దింపేవాడు. ఇలా దీపిక, నాగరాజుల మధ్య పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. అనంతరం డిగ్రీ కోసం హన్మకొండకు వెళ్లిన దీపిక అక్కడే హాస్టల్‌లో ఉంటోంది.
దీపికను పెళ్లి చేసుకున్న నాగరాజు..
హన్మకొండలోని హాస్టల్‌లో ఉంటున్న దీపికను గత నవంబరులో హైదరాబాద్‌లోని ఓ దేవాలంలో రహస్య వివాహం చేసుకున్న నాగరాజు హైదరాబాద్‌లోనే నివాసం ఉంటున్న తన తల్లిదండ్రుల వద్ద ఉంచాడు. వారం రోజుల తర్వాత దీపిక తల్లి సుగుణ.. హాస్టల్ ఉందనుకున్న తన కూతురు కనిపించడం లేదంటూ సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసిన రెండు రోజుల తర్వాత తల్లిదండ్రు లను ఫోన్ చేసిన దీపిక.. తాను నాగరాజు అనే యువకుడిని వివాహం చేసుకున్నానని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నానని చెప్పింది. దీంతో దీపిక తల్లి సుగుణ హైదరాబాద్ లోని తన కూతురు వద్దకు వెళ్లి, నచ్చ జెప్పి ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి దీపిక తల్లిదండ్రుల వద్దే ఉంటోంది.
భార్యను తన నుంచి విడదీశారని కక్ష కట్టి..
సుగుణ కూతురు దీపికను హైదరాబాద్ నుంచి ఇంటికి తీసుకువచ్చిన తర్వాత.. దీపిక, నాగరాజు ప్రేమ, పెళ్లి విషయంలో ఇటు దీపిక తల్లిదండ్రులు, నాగరాజు పరస్పరం చెన్నారావుపేట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదులు చేశారు. దీంతో ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించి, పెద్దల సమక్షంలో సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఆ తర్వాత పెద్ద మనుషుల మధ్య పంచాయితీ నిర్వహించగా.. దీపిక, నాగరాజు ఎవరికి వారు విడిగా ఉండాలని తీర్మానించగా.. అందుకు ఇరు కుటుంబాల వారు అంగీకరించారు. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లిపోయిన నాగరాజు.. ప్రేమించి పెళ్లి చేసుకున్న దీపికను తన నుంచి దూరం చేశారని దీపిక కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. నెల రోజుల క్రితం హైదరాబాద్ నుంచి మళ్లీ గుండెంగ గ్రామానికి వచ్చి తిరిగి ఆటో నడుపుకుంటున్నాడు. ఈ క్రమంలో పదహారు చింతల్‌తండాలో ఉన్న దీపిక ఇంటి వద్ద ఇటీవల రెక్కీ నిర్వహించాడు. పథకం ప్రకారం గురువారం తెల్లవారుజామున 1.30గంటల సమయంలో నాగరాజు వేట కత్తితో ద్విచక్ర వాహనంపై దీపిక ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయంలో ఇంటి వరండాలో దీపిక, ఆమె తల్లిదండ్రులు శ్రీనివాస్, సుగుణ గాఢ నిద్రలో ఉన్నారు. ఇదే ఆదునుగా భావించిన నాగరాజు తొలుత సుగుణపై, ఆ తర్వాత శ్రీనివాస్‌పై, దీపికపై వేట కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. వారి కేకలు విని ఇంట్లో నిద్రిస్తున్న కుమారుడు మదన్‌లాల్ బయటకు వచ్చాడు. దాంతో అతనిపై కూడా నాగరాజు కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన సుగుణ అక్కడికక్కడే మృతి చెందింది. దీపిక, మదన్‌లాల్ కేకలు వస్తూ తప్పించుకునే ప్రయత్నం చేశారు. దాంతో చట్టు పక్కల వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చి నాగరాజును అడ్డుకునే ప్రయత్నం చేయగా వారి వైపు కత్తి చూపుతూ అడ్డొస్తే అందరినీ చంపుతా అంటూ బెదిరిస్తూ.. అక్కడి నుంచి పరారయ్యాడు. ఆతర్వాత తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్‌ను నర్సంపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ అతడూ మృతిచెందాడు. దీపిక, మదన్‌లాల్‌ను హన్మకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. తండావాసుల సమాచారంతో ఎస్‌ఐ గూడ అరుణ్‌కుమార్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు.
పోలీసుల ఆదుపులో నిందితుడు?
జంట హత్యలకు కారకుడైన మేకల నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. హత్యలు చేసి పరారైన నాగరాజు గుండెంగలోని ఓ పాఠశాలకు చేరుకుని కత్తితో చేయి కోసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి వెళ్లి నాగరాజును అదుపులోనికి తీసుకున్నట్టు సమాచారం. నాగరాజుకు సహకరించాడనే అనుమానంతో అతడి స్నేహితుడిపై తండావాసులు దాడి చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారని, వెంటనే ఆ యువకుడిని చెన్నారావుపేట పోలీసు స్టేషన్‌కు తరలించారని స్థానికులు పేర్కొంటున్నారు.
యువతీయువకుల గ్రామాల్లో పోలీసు బందోబస్తు
జంట హత్యల అనంతరం పదహారు చింతల్‌తండాతోపాటు గుండెంగలో వరంగల్ సీపీ ఆదేశాల మేరకు నర్సంపేట, మహబూబాబాద్‌కు చెందిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయా గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా చర్యలు చేపట్టారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాక్ స్వాడ్ బృందాలతో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. డీసీపీ రవిందర్, నర్సంపేట ఏసీపీ కిరణ్‌కుమార్, గూడూరు సీఐ బాబురావు. నెక్కొండ సర్కిల్ సీఐ చంద్రమోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థుల ద్వారా హత్య జరిగిన తెలుకున్నారు. సీఐ రమణమూర్తి, ఖానాపురం ఎస్సై రఘుపతి, నర్సంపేట ఎస్సై ప్రవీణ్, గూడూరు ఎస్సై నగేష్., చెన్నారావుపేట ఎస్సై గూడ అరుణ్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షించారు. ఇక దీపిక తల్లిదండ్రుల అంత్యక్రియలు గురువారం రాత్రి ముగిశాయి.
కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసులతో వాగ్వాదం
పదహారు చింతల్ తండాలో జంట హత్యకు పాల్పడ్డ నాగరాజును శిక్షించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలంటూ తండావాసులు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిందితుడిని ఉరితీయాలంటూ నినాదాలు చేశారు. నాగరాజును తమకు తక్షణమే అప్పజెప్పాలని పట్టుబట్టారు. ఉదయం 10గంటల వరకు గ్రామస్థులు ఆందోళన కొనసాగించడంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొనగా బాధిత కుటుంబానికి న్యాయం చేసేలా కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు శాంతించారు.
Updated Date - Jul 12 , 2024 | 12:45 AM