ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వేపుడు కంద

ABN, Publish Date - Nov 24 , 2024 | 10:40 AM

ఉడికిన పిమ్మట మిరియము పొడి బెల్లము చల్లి యుద్దుపొడి రాలిచి నే తిడి నెఱ్ఱఁగ వేఁచిన వేఁపుడుఁగంద మిళిందవేణి పొందుగ నిడియెన్‌

ఉడికిన పిమ్మట మిరియము పొడి బెల్లము చల్లి యుద్దుపొడి రాలిచి నే

తిడి నెఱ్ఱఁగ వేఁచిన వేఁపుడుఁగంద మిళిందవేణి పొందుగ నిడియెన్‌

రాయల యుగంలో వెలుగులోకి వచ్చిన మహాకవులలో కాకుమాను మూర్తికవి ఒకరు. ఆయన రాసిన ‘పాంచాలీ పరిణయము’ కావ్యం 4వ అధ్యాయంలో ఆనాటి తెలుగువంటకాల గురించి కడుపు నిండిపోయేటన్ని పద్యాలున్నాయి. ఈ పద్యంలో కంద వేపుడు గురించి వర్ణిస్తున్నాడు.

‘కందనాయక’ అంటే దుంపకూరల్లో ఇది రారాజు. 18వ శతాబ్దిలో బంగాళాదుంపలను అమెరికా నుండి తెచ్చారు. వాటికి అలవాటు పడి, కందని పూర్తిగా మరిచిపోయాం మనం. పూర్వం రుషులు కందమూలాలు తినేవారంటే కందని ఆహార పదార్థంగా ఉపయోగించటం తెలిసినవారని! ఇప్పటి మనకి కందగురించి తెలిసింది తక్కువ.


కారంగా, వగరుగా ఉంటుంది కంద. తేలికగా అరుగుతుంది. విరేచనబద్ధత, పొట్ట బిగువుగా ఉండటం, విపరీతమైన గ్యాసు, కడుపులో ఉండలు పెట్టినట్టుగా ఉండటం లాంటి బాధల్ని తగ్గిస్తుంది. తీక్షణంగా పనిచేసి, శరీరంలోకి వేగంగా చొచ్చుకు పోతుంది. కొద్దిగా వేడిచేస్తుంది. కానీ, కఫాన్ని, వాతాన్ని తగ్గిస్తుంది. జీర్ణకోశవ్యాధుల్లో ఇది మంచిది. విరేచనం ఫ్రీగా అవుతుంది. మొలలవ్యాధిని, విషదోషాల్ని హరించే ఔషధం. వారాని కొకసారైనా కందని తినండి.

కందని కడిగి తోలు తీసేప్పుడు కొందరికి దురద పెట్టవచ్చు. చేతికి నూనె రాసుకోవటమో, చేతి తొడుగులు వాడటమో మంచిది. ఈ కందని చిన్న ముక్కలుగా తరిగి కుక్కర్లో ఉడికించాలి. ఒక బాండీలో కొద్దిగా నెయ్యి తీసుకుని ఉడికిన ఈ కందముక్కల్ని అందులో వేసి వేగుతూ ఉండగా, మిరియాల పొడి, కొద్దిగా బెల్లంపొడి, మినప్పిండిని దానిపైన చల్లాలి. ముక్కలు ఎర్రగా అయ్యేలా వేగిస్తే అదే వేపుడు కంద! దీన్ని మిళిందవేణి అంటే తుమ్మెదల దండు వంటి జడ కలిగిన ఓ అమ్మాయి ఇంపుగా వడ్దించిందట!


కంద, పెండలం, కర్రపెండలం, తామర దుంప, అరటిదుంప, చేమదుంప ఇవన్నీ వేపుడుకూరకు అనుకూలంగా ఉంటాయి. కోమలమైన కూరగాయలు వేపుడుకి తట్టుకోలేవు. క్యాబేజీ అనే లేత ఆకుల పొత్తిని తరిగి నరకంలో పాపుల్ని వేగించి వేధించినట్టు సలసలా కాగే నూనెలో వేగిస్తే అది విష పదార్థం అవుతుంది. ఆలు, క్యారెట్‌, బీట్‌రూట్‌ కూడా కోమలమైనవే! వాటితో ఇగురు కూరలే శ్రేష్ఠం. కంద తురుములో ఉప్పు, చింతపండు కలిపి రెండురోజులు ఊరనిచ్చి, కారం, తగినంత మెంతిపిండి కలిపి తాలింపు పెట్టిన కమ్మనైన కందపచ్చడి నిలవుంటుంది. వేడి చేస్తుంది. కానీ, కఫ, వాత వ్యాధులను తగ్గిస్తుంది.


కందని మెత్తగా మిక్సీపట్టి, ఒక చెంచా ముద్దని ఓ కప్పు నీళ్లలో వేసి బాగా మరిగించి కాచిన కంద ‘టీ’ రోజూ ఒకటీ లేక రెండు సార్లు తాగుతుంటే విరేచనం ఫ్రీగా అవుతుంది. పురుషుల్లో జీవకణాలు పెరుగుతాయి. స్త్రీ పురుష లైంగికశక్తి పెరుగుతుంది. పేగులకు బలం చేకూరుతుంది. ఆయాసం, ఆస్తమా, దగ్గు తగ్గుతాయి. షుగరు వ్యాధి, లివర్‌ వ్యాధుల్లో ఇది తప్పకుండా వాడదగింది. వేరి కోజ్‌ వీన్స్‌తో బాధపడే వారికి బోదవ్యాధితో బాధపడేవారికి ఇది బాగా ఉపయోగపడు తుంది. కడుపులో నులిపురుగులున్నవారు కంద ‘టీ’ తాగితే నులిపురుగుల్ని బైటకు వెళ్లగొడ్తుంది. విషదోషాలు హరిస్తాయి.


అల్లం, ఉప్పు, కందముక్కలు కలిపి నూరిన ముద్దని 1-2 చెంచాల మోతాదులో తీసుకుని పెద్దగ్లాసు మజ్జిగలో కలిపి రోజూ రాత్రిపూట తాగుతుంటే మొలల మీద పనిచేస్తుంది. అమీబియాసిస్‌ వ్యాధిలో ఇది తప్పనిసరిగా తీసుకోదగిన ఔషధం.

నానబెట్టిన బియ్యం, పెసరపప్పు, కందముక్కలు, అల్లం, మిర్చి కలిపి రుబ్బి అట్లు పోస్తారు. కందహల్వా కూడా చేస్తారు. రక్తహీనతను పోగొట్టి, తిన్నది చక్కగా వంటబట్టేలా చేస్తాయి. విటమిన్ల లోపాలు తగ్గుతాయి. ఆయుర్వేద గ్రంథాల్లో దీన్ని రసాయనం అన్నారు. అంటే, రస రక్తాదిదాతువుల్లో సంచరించే ఔషధం అని! నీరసం నిస్సత్తువల్ని పోగొట్టి ఉత్సాహం నింపుతుంది కంద!

- డా. జి వి పూర్ణచందు, 94401 72642

Updated Date - Nov 24 , 2024 | 10:40 AM