Delhi: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఇకపై వారికీ ఆయుష్మాన్ భారత్
ABN, Publish Date - Sep 11 , 2024 | 09:46 PM
దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది.
ఢిల్లీ: దేశంలో 70 ఏళ్లు దాటిన వయో వృద్ధులకు ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా వర్తింప చేయాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమైంది. కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్ర ప్రసార, సమాచార శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ విలేకర్ల సమావేశంలో వివరించారు.మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు లబ్ది చేకూరుతుందని తెలిపారు. వీరంతా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
అలాగే ఢిల్లీ ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన పథకం - 4కి ఆమోదం తెలిపినట్లు చెప్పారు. దీంతో రానున్న ఐదేళ్లలో గ్రామీణ రహదారుల కోసం రూ. 25 వేల కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేయనుందని చెప్పారు. దేశవ్యాప్తంగా 31,350 మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ. 12,461 కోట్ల కేటాయించిన బడ్జెట్ ప్రతిపాదనలకు సైతం కేంద్ర మంత్రి వర్గం ఆమోదం చెప్పిందన్నారు.అదే విధంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచాలని కేంద్రం భావిస్తుందని తెలిపారు. అందులోభాగంగా రూ.10,900 కోట్లతో పీఎం ఈ డ్రైవ్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. దీంతో దేశవ్యాప్తంగా 88,500 ఛార్జింగ్ స్టేషన్లకు కేంద్రం తోడ్పాటునందించనుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారు.
Updated Date - Sep 11 , 2024 | 09:46 PM