గృహ నిర్మాణాలు వేగవంతం
ABN , Publish Date - Feb 14 , 2025 | 11:56 PM
జిల్లాలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద చేడుతున్న గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఇంజనీర్లను హెచ్చరించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నేరడువలస, మంత్రజోల, దుర్భిలి, కురుపాం గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు

కురుపాం, ఫిబ్రవరి14(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రధానమంత్రి జన్‌మన్ పథకం కింద చేడుతున్న గృహాలను త్వరితగతిన పూర్తి చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సహించబోమని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ ఇంజనీర్లను హెచ్చరించారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉదయం నేరడువలస, మంత్రజోల, దుర్భిలి, కురుపాం గ్రామాలలో కలెక్టర్ పర్యటించారు. నేరడువలసలో పీఎం జన్‌మన్ కింద నిర్మించిన గృహాలను పరిశీలించారు. 29 గృహాలకు 14 గృహాలు మాత్రమే పనులు ప్రారంభం కావడంపై ఆరా తీశారు. మిగిలిన గృహాలు త్వరితగతిన పూర్తి చేయాలని, అలసత్వం వహిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. గృహ నిర్మాణాల వల్ల వలసలు వెళ్లకుండా గ్రామంలోనే పనులు లభిస్తాయని.. కూలీలకు, మేస్త్రీలకు ఇదొక సదవకాశమని కలెక్టర్ వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించి కార్యకర్త పి.సుశీల పనితీరును ప్రశంసించారు.
జీడిసాగుపై ఆసక్తి చూపాలి
జిల్లాలో జీడి పంట సాగు చేసేందుకు అనుకూలమని, దీంతో రైతులకు రెట్టింపు ఆదాయం లభిస్తుందని కలెక్టర్ అన్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అవసరమైతే జీడి మొక్క అంటు కట్టడంపై ప్రత్యేకంగా శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. దళారుల మాటలు విని మోసపోకుండా వన్ ధన్ వికాస కేంద్రాల ద్వారా విక్రయాలు చేపట్టి అధిక లాభాలు పొందాలని సూచించారు. అనంతర మంత్రజోల గ్రామంలో చిరుధాన్యాలతో బిస్కెట్ల తయారీ కేంద్రాన్ని కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్ పరిశీలించారు. దుర్భిలి గ్రామంలో యూత్ ఎంపవర్‌మెంట్ సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లైబ్రరీని పరిశీలించారు. స్టడీ సర్కిల్‌ను సందర్శించారు. డీఎస్సీ, పోలీస్ కానిస్టేబుల్, స్టాఫ్ సెలెక్షన్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న 42 మంది ఆదివాసీ విద్యార్థులతో మాట్లాడి..సూచనలు చేశారు.
సూర్యఘర్ యోజన పరిశీలన
కురుపాంలో ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన కింద లబ్ధిదారుడు పొట్నూరు మధుసూదనరావు ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానల్‌ను కలెక్టర్ పరిశీలించారు. వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిఒక్కరూ సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకోవాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మంతినివలస గ్రామంలో పీఎం జన్‌మన్ కింద నిర్మించిన గృహాలను పరిశీలించారు. గిరిజనుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉమామహేశ్వరి, తహసీల్దార్ రమణమ్మ, వెలుగు ఏపీఎం బి.వెంకటరావు, ఏపీవో పి.బావాజీ, హౌసింగ్ ఏఈ అచ్చమ్మ, ఎస్‌ఐ నారాయణరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.