Share News

Is It Time for Action? లెక్క తేలింది.. ఇక చర్యలేనా?

ABN , Publish Date - Feb 14 , 2025 | 11:37 PM

Numbers Revealed... Is It Time for Action? గత వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్‌ భూముల లెక్క తేలింది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు.

 Is It Time for Action? లెక్క తేలింది..  ఇక చర్యలేనా?

  • మొదటిస్థానం సీతంపేట

  • రెండు, మూడు స్థానాల్లో మక్కువ, పార్వతీపురం మండలాలు

  • క్షేత్రస్థాయిలో సర్వే పూర్తి.. నివేదికలు సిద్ధం చేసిన అధికారులు

  • గత వైసీపీ సర్కారు పాలనలో సాగిన వ్యవహారం

పార్వతీపురం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ సర్కారు హయాంలో జిల్లాలో అడ్డగోలుగా సాగిన ఫ్రీహోల్డ్‌ భూముల లెక్క తేలింది. కూటమి ప్రభుత్వం ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలు సిద్ధం చేశారు. ‘మన్యం’లో ఈ ప్రక్రియ దాదాపుగా పూర్తయిందని చెప్పొచ్చు. అధికారుల గణాంకాల ప్రకారం.. జిల్లాలో ఫ్రీ హోల్డ్‌ అయిన భూమి విస్తీర్ణం 14,864 ఎకరాలుగా నమోదైంది. పార్వతీపురం డివిజన్‌లో 7,337 ఎకరాలు, పాలకొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 7,527 ఎకరాలు ఫ్రీ హోల్డ్‌ జాబితాలో చేరాయి. ఇందులో సీతంపేట మండలం 4,547 ఎకరాలతో మొదటి స్థానంలో, మక్కువ 2,442 ఎకరాలు, పార్వతీ పురం 2,109 ఎకరాలతో ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి.

మండలాల వారీగా ...

- పార్వతీపురం రెవెన్యూ డివిజన్‌ పరిధిలో చూస్తే.. పార్వతీపురం మండలంలో 2,109.86 ఎకరాలు, సీతానగరంలో 548.525 , బలిజిపేటలో 224.67, సాలూరులో 611.229, పాచిపెంటలో 16.33, మక్కువలో 2442.3, కొమరాడలో 795.322, గురుగుబిల్లిలో 588.985 చొప్పున మొత్తంగా 7337.22 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ అయ్యాయి.

- పాలకొండ రెవెన్యూ డివిజన్‌కు సంబంధించి జియ్యమ్మవలస మండలంలో 334.473 ఎకరాలు, గుమ్మలక్ష్మీపురంలో 670.2, కురుపాంలో 17.19, పాలకొండ మండలంలో 191.55, సీతంపేటలో 4,547.06, భామినిలో 1,699.02, వీరఘట్టంలో 67.7 ఎకరాల చొప్పున ఈ డివిజన్‌లో 7,527.2 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ జాబితాలో చేరాయి.

ఆ రెండు మండలాల్లో..

- గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమంది పార్వతీపురం, బలిజిపేట మండలాల్లో పేదల దగ్గర భారీగా భూములను కొనుగోలు చేశారు. వాటిని ఫ్రీహోల్డ్‌లో చేర్చేందుకు అప్పట్లో ఓ యువ మంత్రి వ్యూహ రచన చేశారు. ఈ మేరకు జిల్లా అధికారులపై కూడా ఒత్తిడి తెచ్చారు. దీంతో పెద్ద ఎత్తున సర్వే బృందాలు ఆ భూములను సర్వే చేశాయి. ఈ లోపుగా ‘ఆంధ్రజ్యోతి’ వరుస కథనాలు ప్రచురితమవడం, మరోవైపు సాధారణ ఎన్నికల కోడ్‌ అమలులోకి రావడంతో సర్వేకు బ్రేక్‌ పడింది. మొత్తంగా ఆ రెండు మండలాల్లో భూములు ఫ్రీ హోల్డ్‌ జాబితాలో చేరలేదు. ఈ విషయాన్ని డీఆర్వో హేమలత వద్ద ప్రస్తావించగా.. ‘జిల్లాలో ఫ్రీహోల్డ్‌ భూములపై సర్వే చేసి నివేదిక సిద్ధం చేశాం .. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ప్రభుత్వానికి పంపిస్తాం.’ అని ఆమె తెలిపారు.

- వాస్తవంగా గత వైసీపీ సర్కారు తీసుకొచ్చిన ఫ్రీ హోల్డ్‌ జీవోను కొంతమంది భూస్వాములు వారికి అనుకూలంగా మలుచుకున్నారు. కొందరు అక్రమార్కులు జీవోను అడ్డం పెట్టుకుని పేదల పేరున ఉన్న అసైన్డ్‌ భూములను కొనుగోలు చేసి రిజిస్ర్టేషన్‌ చేయించుకున్నారు. మరికొందరు అధికారుల సహకారంతో నిబంధనలకు విరుద్ధంగా ఆ భూములను సొంతం చేసుకున్నారు. లీజుల పేరిట తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. తెరవెనక కొంతమంది వైసీపీ నేతలు కూడా అధికారులపై ఒత్తిడి తెచ్చి అప్పట్లో వారికి అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో భూములను ఫ్రీహోల్డ్‌ జాబితాలో చేర్పించారనే ఆరోపణలున్నాయి. అయితే వాటిపై ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కూటమి ప్రభుత్వం ‘ఫ్రీహోల్డ్‌’పై దృష్టి సారించింది. తాజాగా అధికారులు వాటిపై నివేదికలు సిద్ధం చేయడంతో సర్కారు ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

Updated Date - Feb 14 , 2025 | 11:37 PM