Share News

చివరి దశకు దాళ్వా నాట్లు

ABN , Publish Date - Feb 10 , 2025 | 12:47 AM

దాళ్వా సాగు నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నాట్లు పూర్తి కానున్నాయి.

 చివరి దశకు  దాళ్వా నాట్లు

ఐదు మండలాల్లో ఇంకా అక్కడక్కడా మిగిలిన నాట్లు

గత దాళ్వా కంటే సాగు పెరిగే అవకాశం

భీమవరం రూరల్‌, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): దాళ్వా సాగు నాట్లు చివరి దశకు చేరుకున్నాయి. మరో రెండు, మూడు రోజుల్లో నాట్లు పూర్తి కానున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో 2 లక్షల 18 వేల ఎకరాల్లో నాట్లు పూర్తయ్యాయి. ఇంకా పాలకొల్లు, మొగల్తూరు, ఆచంట, పోడూరు, భీమవరం మండలాల్లో 10 వేల ఎకరాల వరకు నాట్లు వేయాల్సి ఉంది. ఈ మండలాల్లో గడిచిన సార్వా పంట వర్షాల వల్ల ఆలస్యానికి దారితీసింది. దీంతో దాళ్వా నారుమడులు వెనక్కు వేశారు. వరినాట్లు తీయడం ఆలస్యానికి దారి తీసింది. ఈ ఏడాది దాళ్వా సాగు పెరుగుతుంది. గత ఏడాది దాళ్వా పంటలో 2 లక్షల 20 వేల 146 ఎకరాలు సాగు చేశారు. ఈ ఏడాది దాళ్వా సాగులో వ్యవసాయ అధికారులు 2 లక్షల 20 వేల సాగుగా అంచనా వేశారు. అయితే 2 లక్షల 28 వేల ఎకరాల వరకు సాగు జరిగే అవకాశం ఉందనే అంచనాతో అధికారులు ఉన్నారు. దీంతో ఈసారి దాళ్వా సాగు 8 వేల ఎకరాల వరకు పెరగనుంది.

సకాలంలో రైతుకు అందిన నగదు

గడిచిన సార్వా పంట ధాన్యం కొనుగోలు త్వరితగతిన జరిగేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 4 లక్షల 30 వేల టన్నుల ధాన్యం పైగా కొనుగోలు చేశారు. రైతు ధాన్యం విక్రయం చేసిన 48 గంటలలోపు సొమ్ములు రైతుల ఖాతాలో జమ అయ్యాయి. గడిచిన ఐదేళ్ళలో ధాన్యం సొమ్ముల చెల్లింపులు నెలలు పట్టాయి. దీంతో ఈ సార్వాలో ధాన్యం సొమ్ములు త్వరితగతిన పడటం రైతులలో ఉత్సాహం పెరిగింది. వెనువెంటనే దాళ్వా నారుమడులు పనులు చేపట్టారు. గత ఏడాది సాగు లేక బీడుగా మారిన పంట భూములను ఈ దాళ్వాకు సాగులోకి తెచ్చారు. దీంతో సాగు శాతం పెరిగింది. అధికారుల లెక్కలకన్నా పెరిగే అవకాశం ఉండొచ్చు.

ముందు వెనుకగా సాగు

సార్వా పంట మాసూళ్ళలో వర్షాలు ఆటంకం దాళ్వా నారుమడులు ముందు వెనుక పడేలా చేశాయి. నాట్లు అదే తరహాలో ముందు వెనుకగా సాగాయి. లక్ష ఎకరాలు జనవరి 10 తేదీలోపు నాట్లు పడ్డాయి. మిగిలిన నాట్లు ఈ నెల 10 తేదీ వరకు పడుతున్నాయి. అయితే రైతులు మాత్రం పంట దశ ముందుకు వచ్చేలా విత్తన ఎంపికలో తెలివైన నిర్ణయం తీసుకున్నారు. ముందు సాగు 1121 రకం సాగింది. వెనుక సాగులో 1158 రకం, పీఆర్‌ 126 రకాలనుసాగు చేశారు. ఈ రెండు రకాలు 110 రోజుల్లో పంటకు వస్తాయి. అందువలన ముందు వెనుక సాగు ఒకేసారి పంట దశకు చేరుకుంటాయి. దిగుబడి కూడా బాగుంటుంది.

Updated Date - Feb 10 , 2025 | 12:47 AM