Google Pay: గూగుల్ పేలో కూడా బాదుడు మొదలు.. ఈ చెల్లింపులకు
ABN , Publish Date - Feb 20 , 2025 | 06:18 PM
మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నారా. అయితే ఈ వార్త మీ కోసమే. ఎందుకంటే పలు రకాల సేవల విషయంలో జీ పే కూడా ఛార్జీలను వసూలు చేస్తుంది. తాజాగా పలు లావాదేవీల విషయంలో 0.5 నుంచి 1 శాతం వరకు రుసుం విధించారు. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

గూగుల్ పే (Google Pay) యూజర్లకు అలర్ట్. ఎందుకంటే ఇప్పుడు జీ పే కూడా పలు రకాల బిల్స్ చెల్లింపుల సమయంలో ఛార్జీలు వసూలు చేస్తుంది. ఇప్పటికే ఫోన్ పే కూడా రీఛార్జ్ సహా పలు చెల్లింపులకు ఛార్జీలను వసూలు చేస్తుండగా.. ఈ క్రమంలో గూగుల్ పే కూడా అదే బాటలోకి వచ్చింది. దీంతో ఇప్పుడు మీరు కరెంట్ లేదా గ్యాస్ సిలిండర్ బిల్స్ వంటివి చెల్లింపు చేయాలంటే ఛార్జీలు చెల్లించాలి. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా చేసే చెల్లింపులపై ఈ ఛార్జీలు వర్తిస్తాయి. ఈ క్రమంలో మీరు చేసే చెల్లింపులకు 0.5% నుంచి 1% వరకు ఛార్జీలను వసూలు చేస్తున్నారు. ఇది కాకుండా GST కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ క్రమంలోనే గూగుల్ పే వినియోగదారులు ఇటివల క్రెడిట్ కార్డు ఉపయోగించి విద్యుత్ బిల్లులు చెల్లించిన క్రమంలో రూ. 15 సౌలభ్య రుసుమును చెల్లించాల్సి వచ్చిందని ఓ వ్యక్తి పేర్కొన్నారు. ఈ రికవరీని Google Pay ప్రాసెసింగ్ ఫీజుగా అభివర్ణించిందని చెబుతున్నారు. ఇందులో జీఎస్టీ కూడా ఉంది. ఇది తెలిసిన నెటిజన్లు ఏకంగా 15 రూపాయల ఛార్జ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మొదట ఉచితంగా వినియోగించుకోవచ్చని ప్రకటించిన ఈ సంస్థ, క్రమంగా ప్రజలకు అలవాటుగా మారిన తర్వాత ఫీజులు వసూలు చేస్తుందని పలువురు యూజర్లు వ్యాఖ్యానిస్తున్నారు.
అయితే గూగుల్ పే ఈ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి సమాచారం వెల్లడించలేదు. డబ్బు బదిలీ, మెట్రో కార్డ్ రీఛార్జ్, బీమా ప్రీమియం, రైల్వే టిక్కెట్లు, విమాన టిక్కెట్ల వంటి ఇతర సేవలకు Google Pay, UPI ఎలాంటి ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలుస్తోంది. ఈ ఛార్జీలను తప్పించుకోవాలంటే ఆయా సంస్థల అధికారిక వెబ్ సైట్లు లేదా ఇంటర్ ఫేస్‌ల ద్వారా చెల్లింపులు చేస్తే వినియోగదారులు తప్పించుకునే ఛాన్సుంది. ఉదాహరణకు ఎయిర్‌టెల్ లేదా జియో వంటి రీఛార్జ్ కోసం యూజర్లు ఆయా కంపెనీల యాప్స్ నుంచి చెల్లింపులు చేసుకుంటే ఇతర ఛార్జీలు పడకుండా ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
Stock Markets: ఈరోజు కూడా నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. టాప్ 5 లాసింగ్ స్టాక్స్
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News