Drinking from Cans: నేరుగా క్యాన్స్ నుంచి డ్రింక్ చేసే వారు తెలీక చేసే పొరపాటు ఇదే!
ABN, Publish Date - Feb 07 , 2025 | 05:06 PM
క్యాన్‌లను గోదాముల్లో నిల్వ చేసే సమయాల్లో వాటిపై రోగకారక సూక్ష్మక్రిములు చేరే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్యాన్‌ను బాగా శుభ్రపరిచాకే అందులోని పానీయాన్ని తాగాలని సూచిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: క్యాన్ నుంచి నేరుగా కూల్ డ్రింక్ లేదా బీరును తాగడం సాధారణ విషయం. నిత్యం అనేక మంది ఇలానే చేస్తుంటారు. అయితే, ఇలా చేస్తే ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కూల్ డ్రింక్ లేదా బీర్ క్యాన్‌ల నిల్వ, రవాణా సందర్భంగా అవి కలుషితమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. వినియోగదారులకు పంపిణీ చేసేటప్పుడు కూడా వీటిని ఏ రకంగానూ శానిటైజ్ చేయరు (Drinking From Cans Can Be Harmful).
ఇక గోదాముల్లో నిల్వ సందర్భంగా ఈ క్యాన్స్‌పై ఎలుకలు పాకే అవకాశం మెండుగా ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో క్యాన్‌పై ఎలుకల మతమూత్రాలు పడొచ్చు. దీంతో, ఈ క్యాన్స్ నుంచి నేరుగా పానియాలను తాగితే మాత్రం కచ్చితంగా లెప్టోస్పైరోసిస్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఈ వ్యాధుల బారిన పడితే తలనొప్పి, జ్వరం వంటి వాటితో పాటు కిడ్నీ, లివర్ వంటి కీలక అవయవాలు కూడా పాడయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Microplastics: మైక్రోప్లాస్టిక్స్‌తో మెదడుకు రక్త సరఫరాలో అడ్డంకులు.. కొత్త అధ్యయనంలో వెల్లడి
ఇక క్యాన్‌ల లోపలి పొరల నుంచి పానియాల్లోకి బిస్‌ఫినాల్ ఏ వంటి కాంపౌండ్ లీకయ్యే ప్రమాదం ఉంది. ఇది శరీరంలో చేరితే హార్మోన్ల సమతౌల్యాన్ని దెబ్బతీయొచ్చు. ఇక క్యాన్‌లకు ఉండే పదునైన అంచుల ద్వారా పెదాలు, నోటిపై గాయాలు ఏర్పడి వాటి ద్వారా ఇన్‌ఫేక్షన్లు సోకచ్చు.
ఇలాంటి సమస్యల బారిన పడకుండా ఉండాలంటే క్యాన్‌లో స్ట్రా వేసుకుని పానీయాన్ని తాగాలని నిపుణులు చెబుతున్నారు. లేదా పానీయాన్ని గ్లాసులో వంపుకుని తాగితే మరింత మంచిదని సూచిస్తున్నారు.
Fatty liver: అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే ఫ్యాటీ లివర్ ఉన్నట్టు అనుమానించాలి
ఇక క్యాన్‌ల కారణంగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండాలంటే వాటిని శుభ్రమైన వస్త్రం లేదా టిష్యూ లేదా యాంటీబాక్టీరియల్ వైప్స్‌తో తుడిచాకే వినియోగించాలి. లేదా నేరుగా పంపు కింద నీటి ధారలో కడిగినా ఇన్‌ఫెక్షన్ కారక క్రిములు చాలా వరకూ తొలగిపోతాయి.
ఇక క్యాన్‌లు తెరిచే ముందు వాటిపై దుమ్ము ఉన్నదీ లేనిదీ చెక్ చేయాలి. క్యాన్ ఎక్కడైనా డ్యామేజ్ అయ్యిందో లేదో తనిఖీ చేశాకే తాగాలి. కలుషితం అయినట్టు ఏమాత్రం అనుమానం వచ్చినా క్యాన్‌ను పారేయడమే శ్రేయస్కరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. క్యాన్‌లు నిల్వ చేసే సమయాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటే రోగాల వ్యాప్తికి చాలా వరకూ అడ్డుకట్ట వేయొచ్చు.
Updated Date - Feb 07 , 2025 | 05:06 PM