Effects Of Fasting On Women: ఉపవాసాలతో మహిళలపై ఎలాంటి ప్రభావం పడుతుందంటే..
ABN, Publish Date - Apr 03 , 2025 | 10:08 PM
ఉపవావాసాలతో మహిళలపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కసరత్తులు చేసే మహిళల్లో ఈ ప్రతికూల ప్రభావం ఎక్కువని అంటున్నారు. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇంటర్నెట్ డెస్క్: ఉపవాసాలు అనేక సంస్కృతుల్లో భాగం. ఉపవాసాలతో ఆరోగ్యానికి మేలు జరుగుతుందని కూడా పలు అధ్యయనాల్లో తేలింది. అయితే స్త్రీపురుషుల్లో వ్యత్యాసాల కారణంగా మహిళలకు ఉపవాసాలు అంత మంచివి కావని డా.స్టేసీ సిమ్స్ తాజాగా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఉపవాసాల వల్ల మహిళల జీవక్రియలపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు (Effects Of Fasting On Women).
డా. స్టేసీ చెప్పిన వివరాల ప్రకారం, స్త్రీ గ్లైకోజన్ మొదలు కొవ్వుల వరకూ అనేక రకాల పదార్థాల ద్వారా తమకు కావాల్సిన శక్తిని ఉత్పత్తి చేసుకోగలరు. మహిళల్లో ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్ (కండరాలు) ఉండటమే దీనికి కారణం. ఈ కండరాలు కొవ్వులను వినియోగించి శక్తిని ఉత్పత్తి చేయగలవు.
అయితే, ఉపవాసాల కారణంగా ఈ ప్రక్రియపై ప్రతికూల ప్రభావం పడుతుందని డా.స్టేసీ పేర్కొన్నారు. ఉపవాసం కారణంగా శరీరంలో ఒత్తిడి కారక కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో, ఆక్సిడేటివ్ మజిల్ ఫైబర్స్.. కొవ్వులను ఉపయోగించి శక్తిని ఉత్పత్తి చేయలేవు. దీంతో, కొవ్వుకు బదులు గ్లైకోజన్ వంటి వనరుల వినియోగం పెరుగుతుంది. కొవ్వులు అలాగే ఉండిపోతాయి. ఇలాంటి సందర్భాల్లో కసరత్తులు చేస్తే కండరాల పెరుగుదల, కొవ్వుల వినియోగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. జీవక్రియల సమతౌల్యం దెబ్బతింటుంది. కాబట్టి, మహిళలకు ఉపవాసాలతో ప్రతికూల ఫలితాలే ఎక్కువని డా. స్టేసీ తెలిపారు.
సుదీర్ఘ కాలంపాటు ఉపవాసాలు చేస్తే కండరాలు కరిగిపోయే ప్రమాదం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు. జీవక్రియలు కూడా నెమ్మదిస్తాయని తెలిపారు. కాబట్టి, కసరత్తులు ఎక్కువగా చేసే మహిళలు ఉపవాసాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని డా. స్టేసీ సూచించారు. ఉపవాసాలతో సామర్థ్యం తగ్గి ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరించారు. అధిక కార్టిసాల్ కారణంగా కసరత్తుల ఉపయోగాలు దక్కకుండా పోతాయని అన్నారు.
ఇది కూడా చదవండి:
రోజూ 15 నిమిషాల పాటు జాగింత్‌తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలిస్తే..
టాయిలెట్ సీట్లపై కంటే దిండ్ల కవర్‌లపై ఎక్కువ బ్యాక్టీరియా.. తాజా అధ్యయనంలో వెల్లడి
ఇంట్లో ఏసీ లేదా.. ఇలా చేస్తే ఎండాకాలంలోనూ కూల్ కూల్
Updated Date - Apr 03 , 2025 | 10:10 PM