Gold Discovery: పాకిస్థాన్‌లో 33 టన్నుల బంగారం నిక్షేపాలు!
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:04 AM
తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో ‘బంగారం’ పంట పండింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో విస్తరించి ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు.
సింధు నది లోయలో గుర్తింపు
విలువ రూ.18 వేల కోట్లకు పైనే..
వెలికి తీసేందుకు కసరత్తు
ఇస్లామాబాద్, జనవరి 12: తీవ్ర ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న దాయాది దేశం పాకిస్థాన్‌లో ‘బంగారం’ పంట పండింది. ఆ దేశంలోని పంజాబ్ ప్రావిన్స్ అటోక్ జిల్లాలో విస్తరించి ఉన్న సింధు నది లోయలో భారీగా బంగారం నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. సుమారు 32.6 మెట్రిక్ టన్నుల బంగారం నిక్షేపాలు ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ పాకిస్థాన్ (జీఎ్‌సపీ) వెల్లడించింది. వీటి విలువ రూ.18 వేల కోట్లకు పైనే (600 బిలియన్ పాకిస్థానీ రూపాయలు) ఉంటుందని అంచనా వేసింది. సింధు నది, హిమాలయాల దిగువన టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు ఎక్కువగా ఉంటాయి. ఆ చర్యల వల్లే అక్కడ బంగారం అణువులు ఏర్పడుతుంటాయి. ఆ అణువులు సింధు నది ప్రవాహం ద్వారా పాక్‌లోని పరీవాహక ప్రాంతంలో వ్యాపించి ఉంటాయని భావిస్తున్నారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాక్‌కు ఇక మంచిరోజులు వచ్చినట్టేనని నిపుణులు చెబుతున్నారు. సింధు నదిలో 32 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న బంగారం నిల్వలను వెలికితీసేందుకు చర్యలు చేపట్టనున్నామని పంజాబ్ ప్రావిన్స్ గనుల శాఖ మంత్రి ఇబ్రహీం హసన్ మురాద్ తెలిపారు. పంజాబ్ ప్రావిన్స్, ఖైబర్ ఫంఖ్తున్వా ప్రావిన్స్‌తో పాటు పెషావర్ బేసిన్, మర్దాన్ బేసిన్ ప్రాంతాల్లో బంగారు నిల్వలున్నట్లు గుర్తించామన్నారు.
Updated Date - Jan 13 , 2025 | 04:04 AM