Israel Gaza Airstrike: హమాస్‌పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్

ABN, Publish Date - Mar 18 , 2025 | 10:51 AM

హమాస్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు ప్రారంభించింది. గాజాపై మిసైల్ దాడులతో మంగళవారం విరుచుకుపడటం 200పై చిలుకుమంది మరణించారు.

Israel Gaza Airstrike: హమాస్‌పై మళ్లీ వైమానిక దాడులు ప్రారంభించిన ఇజ్రాయెల్
Israel Gaza Airstrike

ఇంటర్నెట్ డెస్క్: గాజాపై ఇజ్రాయెల్ మిలిటరీ దళాలు మంగళవారం భీకర దాడికి దిగాయి. జనవరి19న కాల్పుల విరమణ మొదలైన తరువాత ఇజ్రాయెల్ ఈ స్థాయిలో హమాస్‌పై వైమానిక దాడికి దిగడం ఇదే తొలిసారి. ఈ దాడిలో ఏకంగా 220 మంది మరణించినట్టు తెలుస్తోంది. ఉత్తర గాజాతో పాటు, గాజా నగరం, డెయిర్ అల్ బలాహ్, ఖాన్ యూనిస్, రఫా, దక్షిణ గాజా తదితర ప్రాంతాలు బాంబు పేళుళ్లతో దద్దరిల్లాయి. హమాస్ ఉగ్రసంస్థకు చెందిన పలు స్థావరాలను టార్గెట్ చేసుకున్నామని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది. గాజాకు సమీపంలోని ప్రాంతాల్లో స్కూల్లకు సెలవులను ప్రకటించింది.

ఇజ్రాయెల్ బందీలను తిరిగి అప్పగించేందుకు హమాస్ పదే పదే నిరాకరిస్తున్న నేపథ్యంలో దాడులకు దిగినట్టు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహూ ఓ ప్రకటనలో తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ప్రతినిధి తోపాటు ఇతర మధ్యవర్తులు చేసిన అనేక ప్రతిపాదనలను తాము తిరస్కరించినట్టు కూడా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. మరింత తీవ్రతతో ఇజ్రాయెల్ మిలిటరీ దాడికి దిగుతుందని కూడా పేర్కొంది.


Also Read: లష్కరే చీఫ్ హఫీజ్ సయీద్‌కు చావు తప్పదు.. విశ్లేషకుల అంచనా

మరోవైపు, దాడులు మళ్లీ ప్రారంభం అవడానికి ఇజ్రాయెల్ ప్రధానిదే బాధ్యత అని హమాస్ స్పష్టం చేసింది. నియమాలు ఉల్లంఘించారని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని తలకిందులు చేశారని ఆరోపించింది. ‘‘యుద్ధం మళ్లీ ప్రారంభించడమంటే.. బందీలకు మరణ శిక్ష విధించడమే’’ అని హమాస్ ఓ ప్రకటనలో పేర్కొంది. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు, రాజకీయ ఉనికికి కాపాడుకునేందుకు యుద్ధాన్ని ఇజ్రాయెల్ ప్రధాని ఓ పావుగా వాడుకుంటున్నారని ఆరోపించింది. ఈ దాడుల్లో పిల్లలు, మహిళలు, వృద్ధులే అధికంగా కన్నుమూసినట్టు గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ పేర్కొంది.

యుద్ధం మళ్లీ మొదలుకావడంపై అమెరికా కూడా స్పందించింది. దాడులు మొదలెట్టే ముందు ఇజ్రాయెల్ తమకు సమాచారం అందించినట్టు అమెరికా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు తెలిపారు.


Also Read: ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలపై ఈ వారమే ట్రంప్ పుతిన్ చర్చ..

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మూడు దశల్లో అమలు చేయాలనే ఉద్దేశంతో ఇజ్రాయెల్, హమాస్ చర్చలు ప్రారంభించాయి. తొలి దశను మరికొంత కాలం పొడిగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తుండగా రెండో దశలోనే తమ వద్ద ఉన్న బందీలను విడిచిపెడతామని హమాస్ పట్టుబడుతోంది.

రెండో దశ మొదలు కావాలంటే గాజాలో పూర్తిగా మిలిటరీ కార్యకలాపాలను తొలగించాలని ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది. రెండో దశ అమలుపై తక్షణం చర్చలు మొదలు పెడితే తమ వద్ద ఉన్న ఇజ్రాయెలీ అమెరికన సైనికుడితో పాటు మరో నలుగురు బందీల మృతదేహాలను విడిచిపెడతామని హమాస్ గత వారం పేర్కొంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఈ ప్రతిపాదనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో సుమారు 48 వేల పాలస్తీనా వాసులు మరణించగా మరో 1.12 లక్షల మంది గాయాలపాలయ్యారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2025 | 10:51 AM