Saudi Government : హజ్ పోర్టల్ తెరిచేందుకు సౌదీ అంగీకారం
ABN , Publish Date - Apr 16 , 2025 | 07:26 AM
సౌదీ ప్రభుత్వం, భారత ప్రభుత్వ జోక్యంతో హజ్ (నుసుక్) పోర్టల్‌ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. దాంతో, 10 వేల మంది భారతీయ యాత్రికులకు హజ్ యాత్రకు అవకాశం లభించనుంది.

10 వేల మంది యాత్రికులకు లభించనున్న అవకాశం
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కేంద్ర ప్రభుత్వ జోక్యంతో సౌదీ హజ్ మంత్రిత్వశాఖ హజ్ (నుసుక్) పోర్టల్‌ను తిరిగి తెరిచేందుకు అంగీకరించింది. దాంతో 10 వేల మంది భారతీయ యాత్రికులకు అవకాశం లభించనుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వెల్లడించింది. భారత్ నుంచి హజ్‌కు వెళ్లే యాత్రికుల కోటాను 70ు హజ్ కమిటీ ఆఫ్ ఇండియా చూస్తుండగా, మిగతా 30ు కంబైన్డ్ హజ్ గ్రూప్ ఆర్గనైజర్లు చూస్తున్నారు. అయితే మీనాలో ఏర్పాటు చేయాల్సిన క్యాంప్‌లు, బస, రవాణాకు సంబంధించి ఇవ్వాల్సిన యాత్రికుల డేటాకు సంబంధించిన ప్రక్రియలను సౌదీ ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపల హజ్ గ్రూప్ ఆర్గనైజర్లు పూర్తి చేయలేకపోయారు. దాంతో దాదాపు 10వేల మంది యాత్రికుల పరిస్థితి సందిగ్ధంలో పడింది. ఈ నేపథ్యంలో భారత ప్రభు త్వం కలగజేసుకుని మరో అవకాశం ఇవ్వాలని కోరడంతో హజ్ పోర్టల్‌ను తిరిగి తెరిచేందుకు సౌదీ ప్రభుత్వం అంగీకరించింది. కాగా, చంద్ర దర్శనానికి అనుగుణంగా ఈ ఏడాది జూన్ 4 నుంచి 9వ తేదీల మధ్య జరగనున్న హజ్ యాత్రకు భారత్ నుంచి 1,75,025మంది యాత్రికులకు సౌదీ అవకాశం కల్పించిందని కేంద్రం తెలిపింది.