Share News

Trump Social Media Post: ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌

ABN , Publish Date - Apr 11 , 2025 | 06:04 AM

ట్రంప్‌ తన సోషల్‌ మీడియా పోస్టులో "కొనడానికి ఇది గొప్ప సమయం!!!" అని పేర్కొన్న సమయంలో, ఆయన మెడియా గ్రూప్‌ షేర్ల విలువ పెరిగి, ట్రంప్‌ సంపద భారీగా పెరిగింది. ఈ ఘటనపై డెమొక్రాట్లు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడినట్లు ఆరోపిస్తున్నారు

Trump Social Media Post: ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌
Donald Trump

  • కొనడానికి ఇదే సమయమంటూ.. సుంకాల అమలు వాయిదాకు ముందు పోస్ట్‌

  • రూ.3,570 కోట్ల మేర పెరిగిన ట్రంప్‌ సంపద

  • దీనిపై విచారణ జరపాలని డెమొక్రాట్ల డిమాండ్‌

  • బెదిరింపులకు లొంగం.. చర్చలకు సిద్ధం: చైనా

  • అమెరికాకు వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా.. యూరప్‌, దక్షిణాసియా నేతలతో సంప్రదింపులు

  • జిన్‌పింగ్‌ చాలా తెలివైన వ్యక్తి అని ట్రంప్‌ ప్రశంస

  • తొలుత విధించిన 20 శాతం సుంకాలు కలిపితే

  • చైనాపై సుంకాలు 145 శాతానికి: వైట్‌హౌస్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 10: ప్రతీకార సుంకాల అమలును 90 రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించడానికి మూడు గంటల ముందు.. ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమమమైన ట్రూత్‌ సోషల్‌లో ఒక ఏక వాక్య పోస్టు పెట్టారు. ‘‘కొనడానికి ఇది గొప్ప సమయం!!! డీజేటీ’’ అని ఆ పోస్టులో ఆయన రాశారు. ఏం కొనడానికి అది గొప్ప సమయంలో ఆయన నిర్దిష్టంగా చెప్పలేదుగానీ.. ఆయన పోస్టులోని ‘డీజేటీ’ అనే పొడి అక్షరాలను మాత్రం స్టాక్‌మార్కెట్లో ట్రంప్‌ మీడియా అండ్‌ టెక్నాలజీ గ్రూప్‌ను ఉద్దేశించి వాడతారు. సుంకాల అమలు వాయిదా ప్రకటనతో మార్కెట్లు మళ్లీ దూసుకుపోతాయన్న విషయం తెలిసి.. కావాలనే ట్రంప్‌ ఆ పోస్టు పెట్టారని, దీనివల్ల ట్రంప్‌ మీడియా షేర్ల విలువ భారీగా పెరిగి 22.67 శాతం మేర లాభాల్లో ముగిసిందని, ఆ గ్రూపులో 53 శాతం వాటా ఉన్న ట్రంప్‌ వ్యక్తిగత సంపద ఒక్కరోజులోనే 415 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.3,570 కోట్ల) మేర పెరిగిందని.. డెమొక్రాట్లు మండిపడుతున్నారు. ట్రంప్‌ ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని... దీనిపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ట్రంప్‌ పోస్టుతో.. ఏదో జరగబోతోందని నమ్మిన ఆయన అభిమానులు, మదుపరులు పెద్దఎత్తున ట్రంప్‌ మీడియా షేర్లు కొనుగోలు చేశారు. భారీగా లాభపడ్డారు. ఈ క్రమంలోనే.. తన మాట విని షేర్లు కొన్న ఒక సన్నిహితుడికి 2.5 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.21 వేల కోట్లు), మరొకరికి 900 మిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.7,743 కోట్లు) వచ్చాయని ట్రంప్‌ చెబుతున్న వీడియో ఒకటి వైరల్‌ అయింది.


అయితే.. ఆయన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడలేదని, అమెరికా ప్రజలకు, మార్కెట్లకు దేశ ఆర్థిక భద్రతపై నమ్మకం కల్పించడం అధ్యక్షుడిగా ఆయన బాధ్యత అని వైట్‌హౌస్‌ వర్గాలు ఆయన్ను వెనకేసుకొచ్చాయి. అలాగే.. భారత్‌పై విధించిన 26 శాతం అదనపు సుంకాల అమలును జూలై 9 అర్ధరాత్రి 12.01 గంటల దాకా వాయిదా వేస్తూ వైట్‌హౌస్‌ వర్గాలు కార్యనిర్వాహక ఉత్తర్వును విడుదల చేశాయి. ఫెంటైనిల్‌ అక్రమ రవాణాను నిరసిస్తూ చైనాపై తొలుత విధించిన 20 శాతం సుంకాలను, తాజాగా విధించిన 125 శాతం సుంకాలను కలిపితే ఆ దేశంపై మొత్తం సుంకాల భారం 145 శాతానికి చేరుతుందని ఆ వర్గాలు వివరణ ఇచ్చాయి.

తలుపులు తెరిచే..

ట్రంప్‌ సుంకాల బాదుడుపై చైనా గురువారం సూటిగా, ఘాటుగా స్పందించింది. ‘‘అమెరికాతో ఘర్షణను మేము కోరుకోం. ఆ దేశం మాతో చర్చలు జరపడానికి సిద్ధమైతే.. అందుకు తలుపులు తెరిచే ఉంచుతాం. అయితే, చర్చలు పరస్పర గౌరవంతో, సమానత్వంతో సాగాలి. అలా కాకుండా ట్రంప్‌ మాపై ఒత్తిడి తెస్తే మాత్రం దృఢంగా నిలబడతాం’’ అని చైనా వాణిజ్య శాఖ అధికార ప్రతినిధి హీయాంగ్చియాన్‌ స్పష్టం చేశారు. ఒత్తిడి తేవడం, బెదిరించడం, బ్లాక్‌మెయిల్‌ చెయ్యడం వంటివి.. చైనాతో వ్యవహరించడానికి సరైన మార్గాలు కావని ఆమె తేల్చిచెప్పారు. వాషింగ్టన్‌ తన ధోరణిలోనే ముందుకెళ్లాలని భావిస్తే తాము తుదికంటా పోరాడతామని హెచ్చరించారు. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ సైతం.. కవ్వింపు చర్యలకు తాము భయపడబోమని, సుంకాలపై వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. అంతేకాదు.. సుంకాల బాదుడుతో ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తున్న అమెరికాకు వ్యతిరేకంగా కూటమిని నిర్మించేందుకు.. యూరప్‌, దక్షిణాసియా దేశాలతో చైనా సంప్రదింపులు జరుపుతోంది. అందులో భాగంగానే.. చైనా ప్రీమియర్‌ లీ చాంగ్‌ యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులాకు ఫోన్‌ చేసి మాట్లాడారు. చైనా వాణిజ్య మంత్రి వాంగ్‌.. ఈయూ వాణిజ్య, ఆర్థిక భద్రత కమిషనర్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఆసియాన్‌ దేశాల నేతలతోనూ మాట్లాడారు. అయితే, అమెరికాకు వ్యతిరేకంగా చైనాతో చేతులు కలిపేందుకు ఆ దేశాలు ముందుకు రావట్లేదని సమాచారం. తాము అమెరికాతో సంప్రదింపులకే ప్రాధాన్యమిస్తామని ఆస్ట్రేలియా, తైవాన్‌ తేల్చిచెప్పేశాయి. కంబోడియా, వియత్నాం కూడా అదే బాటలో నడుస్తున్నాయి. భారత్‌ కూడా చైనా విజ్ఞప్తిని తోసిపుచ్చినట్టు తెలుస్తోంది.


చైనా కూడా రెడీనే..

ప్రతీకార సుంకాల విధింపుతో.. చైనా సహా చాలా దేశాలు తమతో చర్చలకు ముందుకు వచ్చాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు! చైనా కూడా తమతో ఒప్పందానికి తహతహలాడుతోందిగానీ.. ఎప్పుడు చేసుకోవాలనే విషయంలోనే ఒక నిర్ణయానికి రాలేకపోతోందని వ్యాఖ్యానించారు. ‘‘(చైనా) అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌.. నాకు బాగా తెలుసు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన వ్యక్తుల్లో ఆయన ఒకరు. జిన్‌పింగ్‌ దీనిపై ఒక నిర్ణయం తీసుకుంటారు’’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. త్వరలోనే చైనాతోపాటు ఇతరదేశాలతోనూ మంచి ఒప్పందాలు కుదురుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా.. అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్‌ బెసెంట్‌.. ట్రంప్‌ సుంకాల ప్రకటనను ‘బేరసారాల వ్యూహం’గా పేర్కొన్నారు. ఆ వ్యూహం విజయవంతమైందని,దానివల్లే గడిచిన వారం రోజులుగా తమతో సంప్రదింపులకు 75కు పైగా దేశాలు ముందుకొచ్చాయని పేర్కొన్నారు.. సమస్యంతా చైనా వంటి దేశాలతోనేనని.. అవి ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అసమతౌల్యాలకు కారణమవుతాయని ఆయన అసహనం వ్యక్తం చేశారు. డ్రాగన్‌ దేశానికి ఇరుగుపొరుగు దేశాలైన జపాన్‌, దక్షిణ కొరియా, వియత్నాం, ఇండియా వంటి దేశాలు తమతో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ముందుకొస్తున్నాయని వెల్లడించారు.

మేమూ నిలిపివేస్తాం..

సుంకాల అమలును 90రోజులపాటు వాయిదా వేస్తున్నట్టు ట్రంప్‌ ప్రకటించిన నేపథ్యంలో.. అమెరికాపై 25ు సుంకాలను విధిస్తూ తాము తీసుకున్న నిర్ణయాన్ని కూడా 90 రోజులపాటు నిలిపివేస్తున్నట్టు యూరోపియన్‌ యూనియన్‌ ప్రకటించింది. ‘‘మేం చర్చలకు కూడా ఒక అవకాశాన్ని ఇద్దామనుకుంటున్నాం’’ అని యూరోపియన్‌ కమిషన్‌ ప్రెసిడెంట్‌ ఉర్సులా స్పష్టం చేశారు. కాగా.. అమెరికాపై 25ు సుంకాలను విధించాలని ఈయూ తీసుకున్న నిర్ణయం గురించి ఒక విలేకరి ప్రశ్నించేదాకా ట్రంప్‌కు తెలియకపోవడం గమనార్హం. విలేకరులు దీని గురించి ప్రస్తావించినప్పుడు ఆయన.. ‘బ్యాడ్‌ టైమింగ్‌’ అని సమాధానమిచ్చారు. అయినప్పటికీ.. యూరప్‌ దేశాలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తనకు ఆనందం కలిగించిందన్నారు.

Updated Date - Apr 11 , 2025 | 07:14 AM