Share News

Trump Tariffs: ట్రంప్ దెబ్బ.. భారీగా పెరగనున్న వీటి ధరలు

ABN , Publish Date - Apr 03 , 2025 | 11:17 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అన్నంత పని చేశాడు. టారిఫ్ పెంపు, ప్రతీకార సుంకాల విధింపుతో వాణిజ్య యుద్ధానికి తెర తీశాడు. ట్రంప్ విధించిన సుంకాల వల్ల విదేశాల మీద ఎంత ప్రభావం ఉంటుందో తెలియదు కానీ.. అమెరికన్ల మీద మాత్రం భారీగా ప్రభావం పడనుంది అంటున్నారు నిపుణులు. తాజా సుంకాల వల్ల కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..

Trump Tariffs: ట్రంప్ దెబ్బ.. భారీగా పెరగనున్న వీటి ధరలు
Trump

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్.. సుంకాలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాడు. కొత్త టారిఫ్‌లు ఏప్రిల్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పాటుగా.. అమెరికాతో వాణిజ్య భాగస్వాములుగా ఉన్న 60 దేశాలపై ప్రతీకార సుంకాలు విధించారు ట్రంప్. అన్ని దేశాలపై 10శాతం సార్వత్రిక సుంకం అమల్లో ఉంటూనే.. కొన్ని దేశాలను లక్ష్యంగా చేసుకునే నిర్దిష్ట దిగుమతి సుంకాలు విధించేందుకు రెడీ అయ్యాడు ట్రంప్. దీని ప్రకారం చూసుకుంటే.. కొన్ని దేశాలపై రెండు రకాలుగా భారం పడనుంది.


ఇక ఇండియా విషయానికి వస్తే. .మోదీ తనకు ప్రియ మిత్రుడే అన్న ట్రంప్ ప్రతీకార సుంకాల విధింపు అంశంలో మాత్రం స్నేహ ధర్మాన్ని పాటించలేదు. పైగా సుంకాల విషయంలో.. అమెరికాతో భారత్ తీరు సరిగా లేదని ఆరోపించారు. అయినప్పటికి తాను భారత్ మీద కేవలం 26 శాతం మాత్రమే ప్రతీకార సుంకం విధిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. అలానే డ్రాగన్ కంట్రీ చైనా మీద 34 శాతం ప్రతీకారం సుంకం విధించాడు.

ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. "నేడు అమెరికాకు పునర్జన్మ.. ఈ రోజు కోసం అమెరికా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తోంది. అమెరికా పారిశ్రామిక రంగానికి ఈరోజు పునర్జన్మ లభించినట్లు అయ్యింది. అమెరికా మళ్లీ సుసంపన్నమైన దేశంగా అవతరించిన రోజుగా నేడు (ఏప్రిల్ 2) ప్రపంచ చరిత్రలో నిలిచిపోతుంది" అన్నాడు. ఆయా దేశాలు సుంకాలు తగ్గిస్తేనే తాము కూడా తగ్గిస్తామని ట్రంప్ స్పష్టం చేశాడు. 10 శాతం సుంకం, ప్రతీకార సుంకాలు అమల్లోకి రానుండటంతో కొన్నింటి ధరలు భారీగా పెరగనున్నాయి. అవి ఏవంటే..


ఆటోమొబైల్స్..

ఆటో దిగుమతులపై ట్రంప్ గతంలో ప్రకటించిన 25 శాతం సుంకంతో పాటుగా దిగుమతి చేసుకున్న వస్తువులపై విధిస్తున్న 10 శాతం జనరల్ టారిఫ్‌ కూడా విధించనున్నారు. కొన్ని అమెరికా నిర్మిత వాహనాల్లో ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఉన్నాయి. వీటిపై టారిఫ్ ప్రభావం పడుతుంది. ఫలితంగా ఆయా కార్ల కొనుగోలు ధర భారీగా పెరుగుతుందంటున్నారు నిపుణులు.

బట్టలు, షూస్..

అమెరికాలోని వాల్‌మార్ట్ వంటి స్టోర్లలో అమ్మే దుస్తులు, బూట్లలో ఎక్కువ భాగం అగ్రరాజ్యం వెలుపల అనగా చైనా, వియత్నాం, బంగ్లాదేశ్‌లో తయారైనవే ఉంటాయి. ఈ మూడు దేశాలపై కూడా ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించాడు. దీనిలో భాగంగా చైనాపై 34 శాతం, వియత్నాంపై 46 శాతం, బంగ్లాదేశ్‌‌పై 37 శాతం టారిఫ్ విధించారు. దాంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి..


వైన్, స్పిరిట్స్..

ఇటాలియన్, ఫ్రెంచ్ వైన్లు, స్కాటిష్ విస్కీ వంటి వాటి ధరలు కూడా భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాల దిగుమతులు 20 శాతం టారిఫ్‌ను ఎదుర్కొనున్నాయి. యునైటెడ్ కింగ్‌డమ్ ఉత్పత్తులు 10 శాతం దిగుమతి సుంకాన్ని ఎదుర్కొంటాయి. దాంతో వైన్, స్పిరిట్స్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

కాఫీ, చాక్లెట్..

ట్రంప్ నిర్ణయాల వల్ల భారీగా ధరలు పెరిగే మరో అంశం.. కాఫీ, చాక్లెట్స్. అమెరికా అధికంగా బ్రెజిల్, కొలంబియా వంటి లాటిన్ అమెరికన్ దేశాల నుంచి 80 శాతం కాఫీ గింజలు దిగుమతి చేసుకుంటుంది. ఈ రెండు దేశాల మీద కూడా టారిఫ్‌లు విధించడంతో.. అమెరికాలో కాఫీ, చాక్లెట్స్ ధరలు పెరగనున్నాయి.


అవకాడో..

మెక్సికన్ వాతావరణ అవకాడోల పెరుగుదలకు సరిగా సరిపోతుంది. అమెరికాకు దిగుమతి అవుతున్న అవకాడోల్లో 89 శాతం మెక్సికో నుంచే వస్తున్నాయి. అయితే అమెరికా వ్యవసాయ శాఖ.. మెక్సికో పండ్లు, కూరగాయల మీద టారిఫ్ విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో వీటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉంది అంటున్నారు.

ఇంధన ధరలు..

అమెరికాకు ముడి చమురును సరఫరా చేసే అతిపెద్ద విదేశీ సరఫరాదారు కెనడా. అధికారిక వాణిజ్య గణాంకాల ప్రకారం, గత సంవత్సరం జనవరి, నవంబర్ మధ్య అమెరికా దిగుమతి చేసుకున్న చమురులో 61 శాతం కెనడా నుండి వచ్చిందని అధికారులు తెలిపారు.

కెనడియన్ ఇంధనంపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. దాంతో ఇంధన ధరలు కూడా భారీగా పెరగున్నాయి.

Updated Date - Apr 03 , 2025 | 11:17 AM