Trump on Tariff Effects: నా వార్నింగ్‌ను పట్టించుకోకుండా చైనా ప్రతీకార సుంకాలకు దిగింది.. ట్రంప్ ఆగ్రహం
ABN, Publish Date - Apr 07 , 2025 | 06:16 PM
తాను విధించిన సుంకాలు అద్భుత ఫలితాన్ని ఇస్తున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇంధన ధరలు తగ్గాయని, వడ్డీ రేట్లు కూడా దిగొచ్చాయని చెప్పుకొచ్చారు. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపాలని దేశ ప్రజలకు సోషల్ మీడియా వేదికగా పిలుపునిచ్చారు.

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా ప్రతీకార సుంకాల దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. కానీ ట్రంప్ మాత్రం తగ్గేదే లేదంటున్నారు. తన వ్యూహం ఫలితాన్ని ఇస్తోందని చెప్పుకొచ్చారు. ఇంధన ధరలు, ద్రవ్యోల్బణం తగ్గుతోందని అన్నారు. అమెరికాకు జవాబుగా చైనా సుంకాల విధించడంపై కూడా మండిపడ్డ ట్రంప్ ఇదంతా మునుపటి అమెరికా అధ్యక్షులు చేసిన పనే అంటూ గయ్యిమన్నారు. తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో ఆయన పెట్టిన పోస్టు ప్రస్తుతం కలకలం రేపుతోంది.
‘‘ఇంధన ధరలు తగ్గాయి. వడ్డీ రేట్లు కూడా తగ్గాయి (ఫెడరల్ రిజర్వ్ తన నత్తనడక మాని వడ్డీ రేట్లను తగ్గించాలి). ఆహారం ధరలు కూడా తిరోగమనంలోనే ఉన్నాయి. అసలు ద్రవ్యోల్బణమే లేదు. అమెరికా విధానాలను దుర్వినియోగ పరిచిన వారి నుంచి బిలియన్‌ల కొద్దీ డబ్బును రాబడుతున్నాం. కానీ చైనా మాత్రం అమెరికాపై సుంకాలు విధిస్తోంది. ఇప్పటికే ఉన్న సుంకాలకు తోడు అదనంగా మరో 34 శాతం టారిఫ్ విధించింది. నా వార్నింగ్‌ను లక్ష్య పెట్టలేదు. అమెరికా విధానాలను దుర్వినియోగ పరిచి ఎంతో కూడబెట్టారు. దీనంతటికీ కారణం మునుపటి అమెరికా నాయకులే. అమెరికాకు జరిగిన నష్టానికి వారే కారణం. అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా నిలపాలి’’ అంటూ ట్రంప్ దేశప్రజలకు పిలుపునిచ్చారు.
అమెరికా విధానాలను దుర్వినియోగపరుస్తూ భారీగా లబ్ధి పొందిన దేశాల్లో చైనా నెం.1 అని ట్రంప్ తిట్టిపోస్తున్న విషయం తెలిసిందే. అయితే, ట్రంప్‌కు భయపడేదే లేదంటున్న చైనా కూడా అగ్రరాజ్య ఉత్పత్తులపై ప్రతీకార సుంకాలను విధించింది. ఏప్రిల్ 10 నుంచి 34 శాతం అదనపు సుంకం అమల్లోకి వస్తుందని పేర్కొంది. ప్రపంచవాణిజ్య సంస్థలో కూడా అగ్రరాజ్యంపై ఫిర్యాదు చేస్తానని వెల్లడించింది. అరుదైన ఖనిజ సంపద ఎగుమతులను కూడా నిలిపివేస్తామని వార్నింగ్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, అమెరికా ప్రభుత్వ సుంకాల కాణంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉందని అమెరికా ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. నిరోద్యోగిత పెరిగే ముప్పు కూడా అధికంగా ఉందని అన్నారు. సుంకాల ప్రభావం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఉండే అవకాశం ఉందని అన్నారు. అయితే, ఇంత త్వరగా పరపతి విధానంలో మార్పు కూడా సబబు కాదని స్పష్టం చేశారు. మరోవైపు, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించాలని ట్రంప్ డిమాండ్ చేస్తున్నారు. అమెరికా కేంద్ర బ్యాంకును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని జెరోమ్‌పై ఆరోపణలు గుప్పించారు.
ఇవి కూడా చదవండి:
పాంబన్ బ్రిడ్జి నిర్మాణంలో ఆంధ్రుడి ప్రతిభ
Read Latest and International News
Updated Date - Apr 07 , 2025 | 10:27 PM