BSE Iconic Bell: బాంబే స్టాక్ ఎక్సేంజ్ గంట కొట్టిన ప్రిన్స్
ABN , Publish Date - Apr 09 , 2025 | 05:36 PM
భారత్ - యూఏఈ దేశాలు దాదాపు రెండు వందల ఏళ్లకు పైగా సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు కలిగి ఉన్నాయి. కాగా, ఆ దేశ ఉప ప్రధాని.. ప్రిన్స్ రాక ఇరు దేశాల మధ్య స్నేహానికి సంకేతం

ముంబై దలాల్ స్ట్రీట్‌లో ఈ ఉదయం ఒక ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతమైంది. బిఎస్ఇ (బాంబే స్టాక్ ఎక్సేంజ్) ఓపెనింగ్ బెల్‌ను బుధవారం దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాన మంత్రి, ఆ దేశ రక్షణ మంత్రి కూడా అయిన షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ మ్రోగించారు. ఆయన ఈ ఉదయం ముంబైలోని బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE)ని సందర్శించారు. ప్రిన్స్‌కు ఇది తొలి అధికారిక భారతదేశ పర్యటన కావడం విశేషం. బాంబే స్టాక్ ఎక్సేంజ్ ఎండి,సిఇఒ అయిన సుందరరామన్ రామమూర్తితో కలిసి, యుఏఈ ప్రిన్స్ ఈ ఐకానిక్ బిఎస్‌ఇ ప్రారంభ గంట కొట్టారు.
అంతకుముందు, బిఎస్ఇ సందర్శనకు వచ్చిన యూఏఈ ప్రిన్స్‌ను బిఎస్‌ఇ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఒ అయిన సుందరరామన్ రామమూర్తి హృదయపూర్వకంగా స్వాగతించారు. అనంతరం ఇరువురు మార్కెట్ సెంటిమెంట్‌ను సూచించే ప్రసిద్ధ ఎద్దు(బుల్) స్టాట్యూతో ఫొటోలు దిగారు. కాగా, యూఏఈ ఉపప్రధాని సందర్శన భారత్ - యూఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక సంబంధాలను సూచించడమే కాకుండా, భారతదేశంతో ఆర్థిక సంబంధాల్ని బలోపేతం చేయడంలో దుబాయ్ వ్యూహాత్మక ఆసక్తిని కూడా చూపించిందనే చెప్పాలి.
ఇండియా బిజినెస్ ఫోరమ్‌కు యూఏఈ ప్రిన్స్ షేక్ హమ్దాన్
కాగా, ముంబైలో నిన్న దుబాయ్ ఛాంబర్స్ నిర్వహించిన దుబాయ్ - ఇండియా బిజినెస్ ఫోరమ్‌కు షేక్ హమ్దాన్ హాజరైన సంగతి తెలిసిందే. రెండు దేశాల మధ్య లోతైన సహకారాన్ని అన్వేషించడం, కీలక వ్యాపారవేత్తలు - విధాన రూపకర్తలను ఒకచోట చేర్చడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో భారత కేంద్ర వాణిజ్య & పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం - యుఎఇ భాగస్వామ్యాన్ని 'శ్రేయస్సు, విశ్వాసం, ఉమ్మడి దృక్పథానికి ఒక నమూనా'గా ప్రశంసించారు. క్రౌన్ ప్రిన్స్ రాక రెండు దేశాల మధ్య శాశ్వతమైన, అభివృద్ధి చెందుతున్న సంబంధాన్ని ప్రతిబింబిస్తుందని ఆయన నొక్కి చెప్పారు.
“దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్‌ను కలవడం ఆనందంగా ఉంది” అని గోయల్ (X)లో పోస్ట్ చేశారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం(CEPA)కింద ఆర్థిక సహకారాన్ని విస్తరించడం, ద్వైపాక్షిక వృద్ధికి కొత్త మార్గాలను గుర్తించడంపై చేపడుతున్న చర్చలను కేంద్ర మంత్రి ఈ సందర్భంగా వివరించారు. ముంబై - దుబాయ్ నగరాల మధ్య చారిత్రక సంబంధాలను కూడా గోయల్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. “రెండు నగరాలు శతాబ్దాల నాటి సాంస్కృతిక, వాణిజ్య సంబంధాలు కలిగిన విషయాన్ని కేంద్రమంత్రి గుర్తు చేశారు.
ఇంతకుముందెన్నడూ లేని విధంగా దుబాయ్‌లో భారతీయ కార్మికుల కోసం ఆసుపత్రిని ఏర్పాటు చేయడంపై కేంద్రమంత్రి ఆనందం వ్యక్తం చేశారు. భారత ప్రవాసుల సంక్షేమానికి దుబాయ్ చేసిన సహకారాన్ని మంత్రి ప్రశంసించారు. "ఇది హృదయపూర్వకమైన చర్య, భారతీయులందరి తరపున మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము" అని కేంద్రమంత్రి.. యూఈఏ ప్రిన్స్‌తో అన్నారు.
ఇవి కూడా చదవండి
Trump China Tariffs: చైనాపై ట్రంప్ బాదుడు 104 శాతానికి!
Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..
Read Latest Telangana News And Telugu News