Viral: మీ ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు.. వారానికి 70 పని గంటలపై ఇన్ఫీ నారాయణమూర్తి కీలక వ్యాఖ్య
ABN , Publish Date - Jan 21 , 2025 | 07:12 PM
ఇలాగే పనిచేయాలని ఎవరు ఎవరీ నిర్దేశించజాలరని ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అన్నారు. ఈ విషయంలో ఎవరికి వారు ఓ అభిప్రాయానికి వచ్చి అందుకు అనుగూణంగా ముందుకు సాగాలని తాజాగా చెప్పారు.

ఇంటర్నెట్ డెస్క్: దేశాభివృద్ధి కోసం యువత వారానికి 70 గంటలు పని చేయాంటూ ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి గతంలో చేసిన వ్యాఖ్యలు పెను వివాదానికి దారి తీశాయి. తనకు కుదిరితే ఉద్యోగులతో ఆదివారాలూ పనిచేయిస్తానంటూ ఆ తరువాత ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చర్చను పతాక స్థాయికి చేర్చాయి. ఈ అంశంపై అనేక మంది కార్పొరేట్ బాస్‌లు తమ వివరణ ఇచ్చారు. అయితే, తాజాగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ‘వారానికి 70 పనిగంటల’పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు (Narayana Murthy).
‘‘అప్పట్లో ఆఫీసుకు ఉదయం 6.30కే చేరుకునే వాణ్ణి, రాత్రి 8.30కు ఇంటికి బయలుదేరే వాణ్ణి. ఇది వాస్తవం. నేను ఇలాగే 40 ఏళ్ల పాటు చేశా. కాబట్టి, ఇది తప్పని ఎవరూ అనలేరు’’ అని ఆయన అన్నారు. అయితే, ఈ అంశంపై చర్చకు లేదా డిబేట్‌కు తావులేదని స్పష్టం చేశారు. ఈ విషయాలపై ఎవరికి వారు ఆలోచించుకుని, పూర్తిస్థాయిలో అర్థం చేసుకుని, ఆపై తమ అభిప్రాయానికి అనుగూణంగా చేయాలని స్పష్టం చేశారు.
Narayana Murthy: వాతావరణ మార్పులతో హైదరాబాద్‌కు వలసలు పెరుగుతాయ్: ఇన్ఫీ నారాయణ మూర్తి
‘‘ఈ విషయంలో ఇలాగే చేయాలని ఎవరూ చెప్పజాలరు. ఇలా చేయాలి, ఇలా చేయకూడదు అని ఎవరు ఎవరినీ నిర్దేశించలేరు’’ అని స్పష్టం చేశారు. కిలాచంద్ మెమోరియల్ లెక్చర్‌కు హాజరైన నారాయణమూర్తి మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
2023లో తొలిసారిగా ఇన్ఫీ నారాయణ మూర్తి వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై చర్చకు కారణమైన విషయం తెలిసిందే. దేశాభివృద్ధి కోసం యువత వారానికి 70 గంటలు పనిచేయాలని సంచలనానికి తెరతీశారు. చైనా, జపాన్ లాంటి దేశాలతో పోటీ పడేందుకు ఇది తప్పదని అన్నారు.
Narayana Murthy: 4 నెలల మనవడికి ఇన్ఫీ నారాయణ మూర్తి రూ.240 కోట్ల గిఫ్ట్!
ఆ మరుసటి ఏడాది మరోసారి ఈ అంశంపై స్పందిస్తూ తన అభిప్రాయంలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు. జీవితంలో చాలా కష్టపడ్డందుకు తనకెంతో గర్వంగా ఉందని అన్నారు. ‘‘నేను రిటైర్ అయ్యేవరకూ రోజుకు 14 గంటల చెప్పున వారానికి సగటున 6.5 రోజులు పని చేశా’’ అని చెప్పుకొచ్చారు. తనకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్‌పై నమ్మకం లేదని అన్నారు. ఆ తరువాత అనేక మంది పారిశ్రామికవేత్తలు నారాయణమూర్తికి మద్దతుగా నిలిచారు.
అయితే, ఆదివారాలు ఉద్యోగులు పనిచేయాలంటూ ఎల్ అండ్ టీ చైర్మన్ సుబ్రమణియన్ వ్యాఖ్యానించడం చర్చను మరో మలుపు తిప్పింది. దీంతో, కార్పొరేట్ సంస్థల్లో పని సంస్కృతిపై విమర్శలు పతాకస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలో నారాయణమూర్తి తాజా మరోసారి తన అభిప్రాయాలను ప్రజల ముందుంచారు.