Share News

Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..

ABN , Publish Date - Apr 12 , 2025 | 04:09 PM

వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దక్షిణాసియా కార్యాలయం నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.

 Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..
Tokay Gecko Lizards

గౌహతి: అస్సాం రాష్ట్రం దిబ్రుగఢ్‌లో బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేంటి.. బల్లులను పోలీసులు స్వాధీనం చేసుకోవడం ఏంటని అనుకుంటున్నారా?. అక్కడే ఉంది మరి ట్విస్ట్. అవి మన ఇళ్లల్లో కనిపించే సాధారణ బల్లులు కాదండోయ్.. లక్షలు విలువ చేసే అత్యంత అరుదైన జాతి బల్లులు. వాటిని టోకే గెక్కో అని పిలుస్తారు. ఆ జాతికి చెందిన ఒక్క బల్లిని బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తే ఒక్కసారిగా కళ్లు చెదిరేంత సొమ్మొచ్చి చేతుల్లో పడుతుంది. అందుకే వాటిని వేటాడి విక్రయించేందుకు స్మగ్లర్లు పోటీ పడుతారు. అలా పోటీ పడే పోలీసుల చేతికి చిక్కారు కొందరు కేటుగాళ్లు.


వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దక్షిణాసియా కార్యాలయం నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందం.. దిబ్రూఘర్ జిల్లా పోలీసుల సహకారంతో స్మగ్లర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే టోకే గెక్కో బల్లులు అమ్మేందుకు కొందరు మోహన్‌బరి ప్రాంతానికి వస్తున్నారనే పక్కా సమాచారం వారికి అందింది. ఈ మేరకు మోహన్‌బరి టినియాలిలోని సన్ ఫీస్ట్ దాబా వద్దకు సిట్ బృందం ముందుగానే చేరుకుంది. ఆ దాబా వద్దకు కారులో ఇద్దరు రాగా.. మరో వ్యక్తి బైక్‌పై వచ్చాడు. చర్చల అనంతరం బల్లులు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి అత్యంత అరుదైన 11 టోకే గెక్కో బల్లులను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో బల్లిని రూ.60లక్షలకు అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారని తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు.


అరుదైన 11 టోకే గెక్కో జాతి బల్లులను స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. వాటిని విక్రయించేందుకు యత్నించిన దేబాషిస్ దోహుటియా(34), మనష్ దోహుటియా(28), దీపాంకర్ ఘర్ఫాలియా(40)ను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. నిందితులు వాటిని అరుణాచల్ ప్రదేశ్ నుంచి తీసుకువచ్చారని తెలిపారు. అలాగే ఒక్కొక్కటి రూ.60 లక్షలకు విక్రయించేందుకు ప్రయత్నించారని వెల్లడించారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం టోకే గెక్కోలు అంతరించిపోతున్న జీవుల జాబితాలో చేర్చబడినట్లు చెప్పుకొచ్చారు. వాటిని ఎగుమతి, దిగుమతి వంటి చర్యలు చట్ట ప్రకారం నిషేధమని పేర్కొన్నారు. ఇలాంటి నేరానికి పాల్పడితే గరిష్ఠంగా ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని చెప్పారు. ఈ జాతుల బల్లులు అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తాయని, ఆగ్నేయాసియా బ్లాక్ మార్కెట్లో వీటికి డిమాండ్ ఉందని అధికారులు చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..

Optical Illusion Test: మీ కళ్లకు సూపర్ టెస్ట్.. ఈ కవర్‌ల మధ్యలో జెల్లీ ఫిష్ ఎక్కడుందో 9 సెకెన్లలో కనిపెట్టండి

Updated Date - Apr 12 , 2025 | 04:16 PM