Kho Kho League : గ్రామీణ క్రీడకు అంతర్జాతీయ సొబగు
ABN, Publish Date - Jan 13 , 2025 | 03:29 AM
పోతిరెడ్డి శివారెడ్డి.. ఖో ఖో వరల్డ్‌క్‌పలో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగోడు.
ఖో-ఖో వరల్డ్‌కప్ నేటి నుంచే
బరిలో 23 దేశాలు
ఆరంభ పోరులో భారత్‌తో నేపాల్ ఢీ
ఖో ఖో.. కొత్త శోభ సంతరించుకుంది. మన గ్రామీణ క్రీడ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అలరించేందుకు ప్రపంచ కప్ రూపంలో వచ్చేసింది. ఈ క్రీడ చరిత్రలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న మెగా టోర్నీ ఆతిథ్యానికి దేశ రాజధాని గ్రాండ్‌గా ముస్తాబైంది. పురుషులు, మహిళల జట్లు పోటీపడుతున్న ఈ ప్రతిష్ఠాత్మక ఈవెంట్ సోమవారం నుంచి వారం పాటు జరగనుంది.
న్యూఢిల్లీ: ఇటీవల అల్టిమేట్ ఖో ఖో లీగ్‌తో కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మన గ్రామీణ క్రీడ ఇక విశ్వవ్యాప్తం కానుంది. ఖో ఖో చరిత్రలో మొదటిసారిగా ప్రపంచకప్ జరుగుతోంది. అంతర్జాతీయ ఖో ఖో సమాఖ్య సహకారంతో భారత ఖో ఖో సంఘం ఈ మెగా టోర్నీని నిర్వహిస్తోంది. ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వేదికగా ఈ విశ్వకప్ జరగనుంది. మొత్తం 23 దేశాలు టోర్నమెంట్‌లో తలపడుతున్నాయి. పురుషుల విభాగంలో 20, మహిళల కేటగిరీలో 19 జట్లు బరిలో దిగుతున్నాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో పోటీలు జరుగుతాయి. రెండు విభాగాల్లోనూ ఆయా జట్లు నాలుగు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. ప్రతి గ్రూపులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు నాకౌట్ చేరతాయి. భారత పురుషుల జట్టు నేపాల్, పెరూ, బ్రెజిల్, భూటాన్‌తో కలిసి గ్రూప్-ఏలో, భారత మహిళల జట్టు దక్షిణ కొరియా, ఇరాన్, మలేసియాతో కలిసి గ్రూప్-ఏలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి.భారత పురుషుల జట్టుకు తెలుగు యోధాస్ కెప్టెన్, మహారాష్ట్ర ఆటగాడు ప్రతీక్ కిరణ్, మహిళల జట్టుకు ప్రియాంక ఇంగ్లే సారథ్యం వహించనున్నారు.
పురుషుల జట్టులో ఏపీ క్రీడాకారుడు పోతిరెడ్డి శివారెడ్డికి ఆల్‌రౌండర్‌గా చోటు లభించగా, వికారాబాద్ కుర్రాడు విశ్వనాథ్ జానకిరామ్ స్టాండ్‌బైగా ఎంపికయ్యాడు. ఈ విశ్వక్‌పలో భారత్ హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. సోమవారం జరిగే ఆరంభ మ్యాచ్‌లో భారత పురుషుల జట్టు నేపాల్‌తో తలపడనుంది. భారత మహిళల జట్టు తమ తొలి మ్యాచ్‌ను మంగళవారం దక్షిణకొరియాతో ఆడనుంది.
ఇలా ఆడతారు
ప్రతి జట్టులో 12 మంది క్రీడాకారులుంటారు. కోర్టులో మాత్రం తొమ్మిది మంది మాత్రమే ఆడతారు. ఆట స్థితిగతులు బట్టి మిగిలిన ప్లేయర్లు మారుతుంటారు. మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్ ఉంటాయి. ఒకసారి జట్టు చేజ్ చేస్తే మరోసారి తాము చేసిన స్కోరును కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఆడే క్రీడాకారులను డిఫెండర్, చేజర్, ఆల్‌రౌండర్‌గా విభజిస్తారు.
టోర్నీలో తెలుగు తేజం
పోతిరెడ్డి శివారెడ్డి.. ఖో ఖో వరల్డ్‌క్‌పలో ఆడే భారత జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక తెలుగోడు. శివారెడ్డి స్వస్థలం ఏపీలోని బాపట్ల జిల్లా, ముండ్లమూరు మండలం, ఈదర గ్రామం. శివారెడ్డిది రైతు కుటుంబం. తండ్రి గురువారెడ్డి, తల్లి కోటేశ్వరమ్మ. ఆర్థిక సమస్యలతో కెరీర్ ప్రారంభంలో శివారెడ్డి అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, ఆటే లక్ష్యంగా ముందుకు సాగాడు. తొలిసారిగా 2018లో జాతీయ జట్టుకు ఎంపికైన అతను.. తనదైన ప్రతిభతో అనతికాలంలోనే జట్టులో కీలక ఆటగాడిగా మారాడు. అల్టిమేట్ ఖో-ఖో లీగ్ తొలి సీజన్‌లో ముంబై ఖిలాడీస్, నిరుడు గుజరాత్ జెయింట్స్ జట్టు తరఫున శివారెడ్డి ఆడాడు. కోచ్‌లు కాశీవిశ్వనాథ్ రెడ్డి, సీతారామరెడ్డి ప్రోత్సాహంతో ఈస్థాయికి వచ్చిన తాను.. ఈ వరల్డ్‌కప్‌లో భారత్‌ను విజేతగా నిలపడమే తన లక్ష్యమని ఆంధ్రజ్యోతితో శివారెడ్డి తెలిపాడు.
Updated Date - Jan 13 , 2025 | 03:29 AM