కరకచెట్టు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ
ABN , First Publish Date - 2021-03-22T06:19:00+05:30 IST
నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో..

ఈవో గది తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించిన దుండగులు
సీసీ కెమెరాల వైర్ కట్‌చేసి హార్డ్‌డిస్క్ ఎత్తుకుపోయిన వైనం
దుండగుల ఆచూకీ కోసం ఆరు పోలీసు బృందాలు ఏర్పాటు
విశాఖపట్నం/ పెదవాల్తేరు(ఆంధ్రజ్యోతి): నగరంలోని పెదవాల్తేరు ప్రాంతంలో వున్న ప్రఖ్యాత కరకచెట్టు పోలమాంబ ఆలయంలో భారీ చోరీ జరిగింది. శనివారం అర్ధరాత్రి తరువాత జరిగిన ఈ ఘటనలో అమ్మవారికి చెందిన 411.75 గ్రాముల బంగారు నగలు, నాలుగు కిలోల వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్టు ఆలయ ఈవో గుర్తించారు. అనంతరం ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి, త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ చోరీకి సంబంధించి పోలీసులు వివరాలిలా వున్నాయి.
పెదవాల్తేరు పరిసరాల్లోని 14 గ్రామాల ప్రజలు తమ ఆరాధ్య దైవంగా కరకచెట్టు పోలమాంబ అమ్మవారిని కొలుస్తుంటారు. శనివారం రాత్రి భక్తుల దర్శనాలు ముగిసిన తర్వాత అమ్మవారి అలంకరణ ఆభరణాలను పూజారి తీసి, ఈవో కార్యాలయంలోని గదిలో వున్న బీరువాలో భద్రపరిచారు. ఆదివారం తెల్లవారుజామున ఆలయాన్ని తెరిచేందుకు వచ్చిన అర్చకులు శ్రీనివాసచార్యులు, గోశాల సంరక్షకుడు నరేంద్ర.. ఆలయం ఆవరణలోని ఈవో గది తలుపులు గడియలు విరగ్గొట్టి ఉండడాన్ని చూశారు. వెంటనే ఈవో నీలిమకు సమాచారం అందించారు. ఆమె ఆలయానికి చేరుకుని పరిశీలించారు. తర్వాత ఉన్నతాధికారులకు తెలియపరిచారు. వారి సూచనతో త్రీటౌన్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఏసీపీ డి.శ్రావణ్‌కుమార్, సీఐలు కె.రామారావు, సింహాద్రినాయుడు ఆలయానికి చేరుకుని చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్‌టీమ్, డాగ్ టీమ్స్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. ఆలయం ఆవరణలో 16 సీసీ కెమెరాలు ఉన్నాయి. ఇవి నిరంతరం పనిచేస్తున్నాయి. చోరీకి పాల్పడిన దుండగులు.... సీసీ కెమెరాల వైర్లను కట్‌చేసి, వీడియో రికార్డింగ్ నమోదయ్యా కంప్యూటర్ హార్డ్ డిస్క్‌ను ఎత్తుకెళ్లిపోయారు.
ఆలయం వద్ద వాచ్‌మన్ ఉన్నప్పటికీ, దుండగులు వెనుకవైపునున్న గోడ దూకి లోపలికి ప్రవేశించారు. దీంతో దుండగుల రాకను వాచ్‌మన్ గుర్తించి ఉండకపోవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. దుండగులు నేరుగా ఈవో గది వద్దకు వెళ్లి అక్కడున్న గ్రిల్స్ గెడను విరగ్గొట్టారు. అనంతరం తలుపుకి వేసి ఉన్న తాళం కప్పను విరగ్గొట్టి లోపలకు వెళ్లారు. బీరువాను తెరిచి అందులో ఉంచిన అమ్మవారి కిరీటం, కంఠాభరణాలు, హారం, చెవిదిద్దులు, తదితర 411.75 గ్రాముల బంగారు నగలు, నాలుగు కిలోల వెండి ఆభరణాలను అపహరించుకుపోయారు. హుండీ పక్కన చిల్లర పడివుందని, నగదు చోరీకి గురికాలేదని ఆలయ సిబ్బంది చెప్పినట్టు పోలీసులు వివరించారు.
చోరీపై భిన్నాభిప్రాయాలు
కరకరచెట్టు పోలమాంబ ఆలయంలో చోరీ జరిగిన తీరుని చూస్తే... ఇక్కడి పరిసరాలపై బాగా అవగాహన ఉన్నవారే చోరీకి పాల్పడి ఉంటారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అయితే వాచ్‌మన్ చెబుతున్న కథనం ప్రకారం ఒడిశాకు చెందిన దండగుల పని అయిఉండవచ్చుననే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఆలయం ఆవరణలోని కల్యాణమండంలో శనివారం ఫంక్షన్ జరిగింది. దీనికి కొంతమంది ఒడిశాకు చెందిన వారు హాజరయ్యారు. వారిలో కొందరు రాత్రి పది గంటల సమయంలో వాచ్‌మన్ వద్దకు వచ్చి... ఈ రాత్రికి ఆలయంలో నిద్రపోవచ్చా? అని ఒడియాలో అడిగితే కుదరదని చెప్పాడు. దీంతో వారంతా రెండు వాహనాల్లో అక్కడి నుంచి వెళ్లిపోయారు. వాచ్‌మన్ తెలిపిన వివరాల ప్రకారం వాళ్లే చోరీకి పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
ఆరు బృందాలతో దర్యాప్తు
పోలమాంబ ఆలయంలో జరిగిన చోరీ కేసుని ఛేదించడానికి ఆరు బృందాలను ఏర్పాటుచేసినట్టు ఏసీపీ శ్రావణ్‌కుమార్ తెలిపారు. ఆలయంలో లభించిన ఆనవాళ్ల ప్రకారం పాతనేరస్థుల పని అయివుండవచ్చు? లేదా ఆలయం గురించి బాగా తెలిసినవారిపనైనా అయి ఉండవచ్చునన్నారు. ఆ రెండు కోణాల్లో దర్యాప్తు కోసం రెండు బృందాలకు బాధ్యతలు అప్పగించామన్నారు. ఆలయ సిబ్బంది, ఉద్యోగుల ఫింగర్‌ప్రింట్స్ తీసుకున్నామన్నారు. ఒడిశాకు చెందినవారి ప్రమేయాన్ని నిగ్గుతేల్చేందుకు ఒక బృందం పనిచేస్తోందన్నారు. ఆలయం పరిసరాల్లోని దుకాణాలు, భవనాల్లోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా అనుమానితులను గుర్తించేందుకు ఒక బృందం, సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా మరో బృందం... మొత్తం ఆరు బృందాలు పనిచేస్తున్నాయని ఏసీపీ వెల్లడించారు.