కనిపించని శత్రువుపై బహుముఖ పోరు
ABN , First Publish Date - 2021-05-26T06:05:14+05:30 IST
‘మనచేతలే మన ప్రాధాన్యతలను వెల్లడిస్తాయి’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ బోధనల స్ఫూర్తితో భారతదేశం కరోనా మహమ్మారిపై బహుముఖ పోరును కొనసాగిస్తోంది....

‘మనచేతలే మన ప్రాధాన్యతలను వెల్లడిస్తాయి’ అన్న జాతిపిత మహాత్మాగాంధీ బోధనల స్ఫూర్తితో భారతదేశం కరోనా మహమ్మారిపై బహుముఖ పోరును కొనసాగిస్తోంది. వైద్య రంగంలో ఇప్పటికే ఉన్న మౌలిక వసతులను కాపాడుకుంటూ, కొత్త వసతుల కల్పనను ప్రోత్సహిస్తూ, కరోనా నిర్ధారణ పరీక్షల సామర్థ్యాన్ని పెంచుకుంటూ, ఆక్సిజన్, ప్రాణాలు కాపాడే మం దులు తదితర అత్యవసర వైద్య సంబంధిత వస్తువుల ఉత్పత్తి వేగాన్ని పెంచుకుంటూ, ప్రతి భారతీయ పౌరుడికి కరోనా టీకా ఇచ్చేందుకు అవసరమైన వ్యూహాలకు పదును పెడుతూ... ఇలా ప్రతి అంశంలోనూ ముందుచూపుతో వ్యవహరిస్తూ, కనిపించని శత్రువుపై మనం సంఘటితంగా పోరాటం చేస్తున్న తరుణమిది.
పైన పేర్కొన్న ప్రతి అంశంలోనూ 130 కోట్ల మంది ప్రజలం మనమంతా ఏకమై విస్తృతంగా పనిచేయాల్సిన అవసరం ఉంది. వైరస్‌కు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు మార్పు చెందుతుండటం వల్లనైనా, లేదా మనకు అనేక దశాబ్దాల వారసత్వంగా సంక్రమించిన మౌలికవసతుల కొరత కారణంగానైనా.. ప్రపంచంలో ఎవరూ అంచనా వేయలేని ఈ ఉపద్రవంపై ఐకమత్యంగా నిర్మాణాత్మక సహాయ సహకారాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది.
అసాధారణ సమయాల్లోనూ అందరికీ టీకాలను అందుబాటులోకి తీసుకురావడం అనేది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఎన్నో ఒడిదుడుకులు మనకు ఎదురవుతాయి. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ‘కరోనా టీకా’ను తన బ్రహ్మాస్త్రంగా అమ్ములపొదిలో పొందుపరచడం ద్వారా భారతదేశం తన ప్రత్యేకతను చాటుకుంది. 2021 జనవరి 16న భారతదేశం స్వదేశీ తయారీ టీకాలను ప్రజలకు అందించే మహాయజ్ఞాన్ని ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో, ముందస్తు వ్యూహాలతో దూసుకెళ్లడం వల్లనే ఈ టీకా కార్యక్రమం ప్రారంభమైందనేది నిర్వివాదాంశం. ప్రపంచమంతా కరోనాతో భీతిల్లుతున్న సమయంలోనే, కేంద్ర ప్రభుత్వం ముందుచూపుతో గత సంవత్సరం ఏప్రిల్ 14న టీకా అభివృద్ధి కార్యక్రమానికి ప్రత్యేమైన టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసింది. స్వదేశీ పరిజ్ఞానంతో పరిశోధనలు చేసి శాస్త్రవేత్తలు, పరిశోధకుల నిరంతర శ్రమతో పాటు రిస్క్ తీసుకునేందుకు ముందుకువచ్చిన పారిశ్రామికవేత్తల కృషితో టీకాను తయారు చేసుకోగలిగాం. ఇలా కరోనాకు సొంత టీకాలు తయారు చేసుకున్న దేశాలు చాలా తక్కువ.
కొవాగ్జిన్‌తో పాటు భారతదేశం.. ఆక్స్‌ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ సహాయంతో సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా కేంద్రంగా కొవిషీల్డ్ అనే టీకా ఉత్పత్తికి కూడా ప్రధాన కేంద్రంగా ఉంది. టీకా ఉత్పత్తిని మరింత పెంచే ప్రయత్నంలో భాగంగా రెండో స్వదేశీ టీకా కోసం జైడస్ క్యాడిలా భారతదేశంలో సిద్ధమవుతోంది. ఇదే సమయంలో అంతర్జాతీయ టీకాలైన స్పుత్నిక్, జాన్సన్ అండ్ జాన్సన్ టీకాలను కూడా ఇక్కడే ఉత్పత్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చే ఏర్పాట్లను వేగవంతం చేసింది. సార్వత్రిక టీకాకరణ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే నుంచి డిసెంబర్ వరకు సుమారు 260కోట్ల టీకాలను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావడానికి కూడా కేంద్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. కరోనా మహమ్మారి నుంచి ప్రతి భారతీయుడిని కాపాడుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ దృఢసంకల్పానికి ఇదొక నిదర్శనం.
ప్రస్తుతం భారతదేశ ఆక్సిజన్ ఉత్పత్తి 100శాతాన్నీ వైద్య అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆసుపత్రులకు మళ్లించారు. స్టీల్ ప్లాంట్లు, ప్రభుత్వరంగంలోని ఇతర పారిశ్రామిక సంస్థలు తమ అవసరాలకోసం ఉత్పత్తి చేస్తున్న ఆక్సిజన్‌ను పూర్తిగా వైద్యపరమైన అవసరాలకు మళ్ళిస్తున్నాయి. కేంద్రం నిర్ణయించిన మేరకు ఈ ఆక్సిజన్‌ను కరోనా ఆసుపత్రులకు యుద్ధ ప్రాతిపదికన సరఫరా చేస్తున్నాయి. భారతదేశంలో పారిశ్రామిక సామర్థ్యం అత్యధికంగా ఉన్న కొన్ని రాష్ట్రాల్లో నిల్వ, రవాణా, ఇతర లాజిస్టిక్స్ సమస్యలున్నప్పటికీ.. వాటిని పరిష్కరించుకుంటూ డిమాండుకు అనుగుణంగా రవాణా, పంపిణీ శృంఖలను మెరుగుపరుచుకుంటూ ఆయా ప్రాంతాలకు ఆక్సిజన్ అందించేందుకు విశేషమైన కృషి జరుగుతోంది. ఆక్సిజన్ అందుబాటులో వున్న అనేక ఇతర దేశాల నుంచి పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటూ ఆక్సిజన్ కొరతను అధిగమించడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. నిపుణుల సూచనల ఆధారంగా, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు నిరంతరాయంగా ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వద్దనున్న వివరాల ప్రకారం కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న సమయంలో, మే 7 వరకు మొత్తం 37.23 లక్షల యాక్టివ్ కరోనా కేసులుండగా, వారి కోసం 10,972 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమైంది. ఈ అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని భారతదేశ ఆక్సిజన్ తయారీ ప్లాంట్లు నిర్విరామంగా కృషిచేశాయి. వాటి సామర్థ్యానికంటే 130 శాతం అధికంగా ఉత్పత్తి చేశాయి.
భారత రైల్వేల ఆధ్వర్యంలో గ్రీన్ ఛానెల్ ద్వారా నడుస్తున్న ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైళ్ల ద్వారానూ, రైలు మార్గం లేని చోటికి రోడ్డు రవాణా ద్వారానూ అవసరమైన మేర ఆక్సిజన్ అందించడంలో కేంద్ర ప్రభుత్వం విశేషమైన కృషిచేసింది. ఈ కృషి కారణంగానే ఆక్సిజన్ ఉత్పత్తి తక్కువగా ఉన్న ప్రాంతాలకు కూడా ఆక్సిజన్ సరఫరా జరిగింది. రవాణాదారులతో కలిసి పనిచేస్తూ, సుదూర ప్రాంతాలకు ఆక్సిజన్ పంపించేందుకు రవాణా రంగాన్ని క్రియాశీలకంగా ముందుకు నడిపించింది.
భారత వైమానిక దళం కూడా ఈ అంశంలో క్రియాశీలకంగా వ్యవహరించింది. ఖాళీ ఆక్సిజన్ కంటైనర్లను ఉత్పత్తి కేంద్రాలకు చేర్చడం, అక్కడి నుంచి అవసరమున్న చోటికి వాటిని తరలించడం ద్వారా త్వరితగతిన ఆక్సిజన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. మొత్తంగా యుద్ధ విమానాలు 1300 ట్రిప్పులతో 600 ట్యాంకర్లను గమ్యాలకు చేర్చాయి. ఇందులో 150 అంతర్జాతీయ ట్రిప్పులున్నాయి. వివిధ దేశాల నుంచి 109 క్రయోజనిక్ ఆక్సిజన్ స్టోరేజ్ కంటైనర్లు, ఆక్సిజన్ జనరేటర్లు, సిలిండర్లు, కాన్సన్ట్రేటర్లు, ఇంజక్షన్లు, ఎన్–95 మాస్కులు, పీపీఈ కిట్లు, టెస్టు కిట్లను అత్యవసరంగా తీసుకొచ్చారు. బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేసే విషయంలో భారత ప్రభుత్వం చేయని కృషిలేదని నిపుణులు ప్రశంసించారు.
కరోనా నిర్వహణలో భారత సాయుధ బలగాలు, కేంద్రీయ పోలీసు బలగాలు కీలకమైన పాత్రను పోషించాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), ఇతర సాయుధ బలగాల యూనిట్లు కలిసి దేశంలోని వివిధ ప్రాంతాల్లో యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక ఆసుపత్రులను ఏర్పాటుచేశాయి. ఢిల్లీ, అహ్మదాబాద్, లక్నో, పాట్నా, వారణాసిల్లో ఈ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. దీంతోపాటుగా కరోనాను ఎదుర్కునేందుకు డీఆర్డీవో ‘‘2డీజీ’’ అనే ఔషధాన్ని అభివృద్ధి చేసింది. ఈ 2డీజీని భారతదేశంలో వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు వీలుగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతులు కూడా జారీచేసింది.
దీంతోపాటుగా అత్యవసర ఔషధాలైన రెమ్‌డెసివిర్ వంటి వాటి పంపిణీ కూడా వేగవంతమైంది. ఏప్రిల్ 1న 27లక్షలుగా ఉన్న రెమ్‌డెసివిర్ ఉత్పత్తి మే 4 నాటికి 1.05 కోట్లకు పెరిగింది. అంతకముందు ఉన్న రెమ్‌డెసివిర్ ఉత్పత్తి కేంద్రాలను 57కు పెంచడం కారణంగానే ఇంత పెద్దమొత్తంలో ఇంజక్షన్లను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం సాధ్యమైంది.
ఏప్రిల్ 30న టోసిలిజుమాబ్ 9,900 వయల్స్‌ను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. దాని ఉత్పత్తిని పెంచి మే 11నాటికి ఇదే ఔషధం 45వేల వయల్స్‌ను కేంద్రప్రభుత్వం ప్రజలకు అందుబాటులోకి తీసు కొచ్చింది.
కనిపించని శత్రువుతో పోరాటంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దేశంలో అన్ని రాష్ట్రాలలోని సర్వశక్తులను, అన్ని వనరులను వినియోగిస్తున్నవి. దీంతోపాటుగా కేంద్రప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఎప్పటికప్పుడు సూచనలు, జాగ్రత్తలను తెలియజేస్తూ ప్రత్యేకమైన టాస్క్‌ఫోర్సుల ద్వారా సమీక్షలను నిర్వహిస్తోంది.
ఎప్పుడో శతాబ్దానికోసారి మానవాళిపై విరుచుకుపడే ఎవరికీ అంతుచిక్కని ఇలాంటి మహమ్మారులను ఎదుర్కొనే విషయంలో ఎంత సమన్వయంతో పనిచేసినా కొన్ని సమస్యలు, లోటుపాట్లు వ్యక్తమవుతూనే ఉంటాయి. వీటిని ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ప్రజలను కాపాడుకుంటూ ముందుకెళ్లడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేందుకు అవసరమైన ఆత్మనిర్భరతను మనం సాధించవచ్చు. ఈ కరోనా మహమ్మారి త్వరలోనే అంతమవుతుంది. భారతదేశం తిరిగి ఆర్థికాభివృద్ధితో సుస్థిరపథంలో దూసుకు పోవడం ఖాయం.
జి. కిషన్ రెడ్డి
(కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి)
