పంచాయతీ లేఅవుట్ ప్లాట్లను రిజిస్టర్ చేయాలి
ABN , First Publish Date - 2021-07-28T08:34:39+05:30 IST
గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రియల్టర్లు మంగళవారం సచివాలయ ముట్టడికి యత్నించారు.

సచివాలయ ముట్టడికి రియల్టర్ల యత్నం.. అరెస్టులు
హైదరాబాద్ సిటీ, రాంనగర్, జూలై 27 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ లేఅవుట్లలో నిలిపివేసిన ఓపెన్ ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను పునరుద్ధరించాలనే డిమాండ్‌తో పలు జిల్లాల నుంచి తరలివచ్చిన రియల్టర్లు మంగళవారం సచివాలయ ముట్టడికి యత్నించారు. ఆదర్శ్‌నగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ర్యాలీగా సచివాలయం వైపు వెళ్తుండగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఐదుగురు సభ్యులతో కూడిన ప్రతినిధుల బృందాన్ని సీఎ్‌సను కలిసేందుకు అనుమతివ్వాలని కోరినా.. పోలీసులు అంగీకరించలేదు. ఈ క్రమంలో రియల్టర్లు, పోలీసుల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. వెంటనే రియల్టర్ల సంఘం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారగోని ప్రవీణ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ లేఅవుట్‌లో ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో రియల్టర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఆ ప్లాట్లను కొన్న వినియోగదారులు అయోమయంలో పడ్డారని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 20 లక్షల ఎకరాల్లో నిలిపివేసిన పంచాయతీ లేఅవుట్లలోని ప్లాట్లకు వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం సంఘం కార్యనిర్వాహక అధ్యక్షుడు నర్సయ్య, ఉపాధ్యక్షుడు బొంగు వెంకటేశ్ గౌడ్, నాయకులు పాల్గొన్నారు.