మరోసారి పోలీస్ కస్టడీకి శిల్పాచౌదరి
ABN , First Publish Date - 2021-12-09T23:59:44+05:30 IST
నగరంలో పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పాచౌదరిని

హైదరాబాద్: నగరంలో పలువురిని మోసం చేసిన కేసులో అరెస్టైన శిల్పాచౌదరిని మరోసారి పోలీస్ కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడ్రోజుల పాటు పోలీసుల కస్టడీకి ఉప్పరపల్లి కోర్టు అనుమతి ఇచ్చింది. శిల్పాచౌదరిని శుక్రవారం నుంచి మూడ్రోజుల పాటు నార్సింగి పోలీసులు విచారించనున్నారు.
కోట్ల రూపాయల ఆర్థిక మోసంలో శిల్పాచౌదరి అరెస్టయిన సంగతి తెలిసిందే. పోలీసు విచారణలో తన డాబూ.. దర్పాన్ని ప్రదర్శించారు. పలు సందర్భాల్లో కంటతడి పెట్టారని తెలిసింది. న్యాయస్థానం అనుమతితో పోలీసులు శిల్పాచౌదరిని రెండు రోజులపాటు తమ కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. మొదటి రోజు ఆమెను చంచల్‌గూడ మహిళా జైలు నుంచి నార్సింగ్‌లోని స్పెషల్ ఆపరేషన్స్ టీమ్(ఎ్‌సవోటీ) కార్యాలయానికి తరలించారు. అక్కడ దర్యాప్తు అధికారులు-- నార్సింగ్ ఇన్స్పెక్టర్, అదనపు ఇన్స్పెక్టర్-- మహిళా పోలీసుల సమక్షంలో ఆమెను విచారించారు. తొలుత పోలీసులు మోసాల చిట్టాపై ప్రశ్నించగా.. శిల్ప విలపిస్తూ.. ‘‘నాకేం తెలియదు’’ అంటూ దాటవేసే ప్రయత్నం చేశారు. దాంతో పోలీసులు తమకు వచ్చిన ఫిర్యాదుల చిట్టాను.. ఆమె కోట్లు వసూలు చేసినట్లు ఆధారాలను ముందు పెట్టారు. కాల్‌డేటా రికార్డులను.. ఎవరితో ఎప్పుడు? ఎంతసేపు మాట్లాడారనే చిట్టాను తీశారు. దీంతో ఆమె ఒక్కో విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం. తనది మెదక్ జిల్లా అని.. ఓ బాబు ఉన్నాడని చెప్పినట్లు తెలిసింది. బాధితుల వివరాలను పోలీసులు చెబుతూ.. ‘‘ఇంకా చెప్పమంటారా? మీరే చెబుతారా?’’ అని ప్రశ్నించడంతో.. ఆమె అన్ని వివరాలు పూసగుచ్చినట్లు చెప్పారని తెలిసింది.