టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అన్ని అర్హతలూ ఉన్నాయి..

ABN , First Publish Date - 2022-09-16T06:38:39+05:30 IST

టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు స్వీకరించినా, ఇన్‌చార్జిగానే కొనసాగుతున్న ధర్మారెడ్డికి హైకోర్టు గురువారం పెద్ద ఊరటనే ఇచ్చింది.

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి అన్ని అర్హతలూ ఉన్నాయి..
ఈవో ధర్మారెడ్డి

- విస్పష్టమైన తీర్పునిచ్చిన హైకోర్టు

తిరుమల, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): టీటీడీ ఈవోగా పూర్తి బాధ్యతలు స్వీకరించినా, ఇన్‌చార్జిగానే కొనసాగుతున్న ధర్మారెడ్డికి హైకోర్టు  గురువారం పెద్ద ఊరటనే ఇచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానాల ఈవోగా ఏవీ ధర్మారెడ్డి నియామకం సక్రమమేనని, ఆయనకు ఈవోగా అన్ని అర్హతలూ ఉన్నాయని స్పష్టం చేసింది. తిరుపతికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి  దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ 46 పేజీల సవివరమైన తీర్పును జస్టిస్‌ కృష్ణమోహన్‌ వెలువరించారు. టీటీడీ ఈవోగా ఐఏఎస్‌ అధికారులనే నియమించాలని, ఇండియన్‌ డిఫెన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ అధికారి అయిన ధర్మారెడ్డి నియామకం నిబంధనలకు విరుద్ధమన్న నవీన్‌కుమార్‌రెడ్డి వాదనపై లోతైన పరిశీలన చేశామంటూ కోర్టు వ్యాఖ్యానించింది.  టీటీడీ ఈవోగా సీనియర్‌ అధికారిని నియమించడానికి జిల్లా కలెక్టర్‌ స్థాయిని నిబంధనలో ప్రస్తావించారనీ, అంతకన్నా ఎక్కువస్థాయిలో ఉన్న అధికారిని నియమించడానికి ఎలాంటి అభ్యంతరాలు లేవని కోర్టు పేర్కొంది.1992వ సంవత్సర బ్యాచ్‌కు చెందిన ధర్మారెడ్డి సెంట్రల్‌ సర్వీసులో జాయింట్‌ సెక్రటరీ హోదాలో ఉన్నారని, అది రాష్ట్ర సర్వీసులో సెక్రటరీ స్థాయి అని పేర్కొంది. జిల్లా కలెక్టర్‌ కంటే ఇది చాలా పెద్దస్థాయి అని అభిప్రాయపడింది. టీటీడీ ఈవోగా ఐఏఎస్‌ అధికారినే నియమించాలన్న పిటిషనర్‌ వాదన సరికాదనీ, కలెక్టర్‌ కంటే పైస్థాయిలో ఉన్న అధికారిని టీటీడీ ఈవోగా నియమించవచ్చనని తెలిపింది. దీనికి అనుగుణంగా అన్నివిధాలుగా అర్హత కలిగిన ధర్మారెడ్డిని పూర్తిస్థాయి టీటీడీ ఈవోగా నియమించవచ్చని స్పష్టం చేసింది. ఈవో అర్హతల గురించిన ప్రస్తావన ఉన్న రాష్ట్ర దేవాదాయ చట్టంలోని 107వ సెక్షన్‌ను క్షుణ్ణంగా పరిశీలించాక కోర్టు తీర్పు వెలువరించడం విశేషం. టీటీడీలో అనేక మార్పులు చేసిన ధర్మారెడ్డికి మరిన్ని పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం, అధికారం ఈ తీర్పుతో లభించినట్లయింది.గతంలో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో మహాలఘు ప్రవేశపెట్టడం వల్ల శ్రీవారి ధర్శనాల సంఖ్య 35 వేల నుంచి లక్షకు పెరిగే అవకాశం లభించింది. అదనపు బూందీ పోటు ఏర్పాటు చేయడంతో 40 వేలుగా ఉన్న లడ్డూల తయారీ 5.5 లక్షల వరకు పెరింది. మాడవీధులను విస్తరించి రెండు లక్షల మంది గ్యాలరీల్లో కూర్చునే ఏర్పాటు చేు. 

ఎండోమెంట్‌ యాక్ట్‌ 107 ఏం చెప్తోంది?

రాష్ట్ర ఎండోమెంట్‌ యాక్ట్‌లో సెక్షన్‌ 107లో టీటీడీ ఈవో నియామకం అర్హతను స్పష్టంగా పేర్కొన్నారు. అందులో ‘టీటీడీ ఈవోగా నియమించబడే అధికారి కలెక్టర్‌ పదవిని కలిగి ఉండాలి. లేదా ఏదైనా ఇతర సర్వీసు నుంచి కలెక్టర్‌ స్థాయి కంటే తక్కువ కాకుండా సమానమైన పోస్ట్‌లో ఉండాలి’ అని ఉంది. సెక్షన్‌లోని రెండో అంశం ప్రకారం ధర్మారెడ్డి ఈవోగా పనిచేయడానికి అర్హులు. 2004లోనే ధర్మారెడ్డి టీటీడీ ప్రత్యేకాధికారిగా నియమితులై 2006 ఆగస్టు వరకు విధులు నిర్వహించారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్‌గా 2006 సెప్టెంబరు నుంచి 2008 మార్చి వరకు పనిచేశారు. తిరిగి ఏప్రిల్‌ 2008 నుంచి 2010 ఆగస్టు వరకు మరోసారి టీటీడీ ప్రత్యేకాధికారిగా విధులు నిర్వహించారు. 2010 సెప్టెంబరు నుంచి ఏప్రిల్‌ 2011 వరకు ఏపీ సమాచార కమిషన్‌లో సెక్రటరీగా పనిచేసిన ధర్మారెడ్డి, మూడవసారి టీటీడీలో అదనపు ఈవోగా 2019 నుంచి విధులు నిర్వహిస్తున్నారు. పైఅంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుని హైకోర్టు ఈవోగా నియామకాన్ని సమర్థించింది. ఈవోగా ఉన్న జవహర్‌రెడ్డి బదిలీ కావడంతో ఈ ఏడాది మే 8న ధర్మారెడ్డికి టీటీడీ ఈవో(ఎ్‌ఫఏసీ)గా బాధ్యతలు రాష్ట్రప్రభుత్వం అప్పగించిన సంగతి తెలిసిందే.


Updated Date - 2022-09-16T06:38:39+05:30 IST