‘పశు సంవర్థక శాఖ’లో కదలిక

ABN , First Publish Date - 2022-11-01T02:07:52+05:30 IST

ఎట్టకేలకు పశు సంవర్థక శాఖలో కదలిక వచ్చింది. జిల్లా అధికార యంత్రాంగం కుప్పానికి తరలి వచ్చింది. వైద్యాధికారులను, సిబ్బందిని గ్రామాలకు పంపి లంపీ స్కిన్‌ లక్షణాలున్న పశువులనుంచి రక్త నమూనాలు సేకరించింది. కుప్పం నియోజకవర్గంలో పశు సంపదను లంపీ స్కిన్‌ వ్యాధి కబళిస్తుండటం.. పశువైద్యాధికారులు పట్టించుకోకపోవడం.. గోపాలమిత్రలతోపాటు కొందరు సిబ్బంది వేలకువేలు వసూలు చేయడం.. వీటన్నింటిపై ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘పాడి రైతు బతుకు బుగ్గి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

‘పశు సంవర్థక శాఖ’లో కదలిక
కుప్పిగానిపల్లెలో వెంకటేశ్‌కు చెందిన పాడి ఆవునుంచి రక్త నమూనాలు సేకరిస్తున్న డాక్టర్‌ ఆమని

కుప్పం, అక్టోబరు 31: ఎట్టకేలకు పశు సంవర్థక శాఖలో కదలిక వచ్చింది. జిల్లా అధికార యంత్రాంగం కుప్పానికి తరలి వచ్చింది. వైద్యాధికారులను, సిబ్బందిని గ్రామాలకు పంపి లంపీ స్కిన్‌ లక్షణాలున్న పశువులనుంచి రక్త నమూనాలు సేకరించింది. కుప్పం నియోజకవర్గంలో పశు సంపదను లంపీ స్కిన్‌ వ్యాధి కబళిస్తుండటం.. పశువైద్యాధికారులు పట్టించుకోకపోవడం.. గోపాలమిత్రలతోపాటు కొందరు సిబ్బంది వేలకువేలు వసూలు చేయడం.. వీటన్నింటిపై ‘ఆంధ్రజ్యోతి’లో సోమవారం ‘పాడి రైతు బతుకు బుగ్గి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించి.. ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ప్రభాకర్‌, పశు వ్యాధి నిర్ధారణ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ పద్మావతి సోమవారం ఉదయం కుప్పం వచ్చారు. ఏడీ డాక్టర్‌ ఎస్‌.రెడ్డితో కలిసి కుప్పం పశువైద్యశాలలో కుప్పం, గుడుపల్లె మండలాల పశువైద్యాధికారులు, గోపాలమిత్రలు, రైతు భరోసా కేంద్రాల్లో పనిచేసే పశు సంవర్థక శాఖ సహాయకులతో సమావేశమయ్యారు. మధ్యాహ్నం శాంతిపురం, రామకుప్పం మండలాలకు సంబంధించి శాంతిపురం పశు వైద్యశాలలో సమావేశం నిర్వహించారు. లంపీ స్కిన్‌ వ్యాధి నివారణ వ్యాక్సిన్లపై సమీక్షించారు. వ్యాక్సిన్‌ ప్రక్రియను వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. పశువుల సంతలను వీలైనంత వరకు జరగకుండా చూడాలన్నారు. ఒకవేళ జరిగినా పక్క రాష్ట్రాలనుంచి పశువుల కొనుగోళ్లు జరుగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి ఆర్బీకేలో పశు విజ్ఞాన బడులను నిర్వహించి.. లంపీ స్కిన్‌పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం పశు వైద్యాధికారులను, గోపాలమిత్రలను, ఏహెచ్‌ఏలను మండలాలలోని ఆయా గ్రామాలకు పంపించారు.

పాడి రైతులకు సిబ్బంది బెదిరింపులు

‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురితమైన పాడి రైతుల వద్దకే పశువైద్య సిబ్బంది వెళ్లి లంపీస్కిన్‌ లక్షణాలున్న పశువుల నుంచి రక్తనమూనాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆ రైతులతో కొందరు గోపాలమిత్రలు, ఆర్బీకేలలోని కొద్దిమంది పశు సంవర్థక శాఖ సహాయకులు బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ‘మీ వద్దకు మేము రావడంలేదా? పశువులకు వైద్యం చేయడంలేదా? అయినా ఎందుకు పేపరోళ్లకు అలా చెప్పారు? మీరిలా ఫిర్యాదులు చేసుకుంటూ పోతే ఈ మాత్రం సాయం కూడా అందడం కష్టమవుతుంది’ అని పేర్కొన్నారు. ‘మీరు ఎప్పుడొచ్చి వైద్దిగం చేశారు? ఎప్పుడో ఒకరిద్దరు వచ్చినా ఇంజెక్షన్‌ వేయడానికి కాసులు తీసుకోలేదా?’ అని గుడుపల్లె మండలం కుప్పిగానిల్లెకు చెంది వెంకటేశ్‌ తిరగబడడంతో వారు మౌనం వహించారు. తాను రోగం వచ్చిన పశువుకోసం ఆరువేల రూపాయలు ఖర్చు పెట్టానని, ఇంజెక్షన్లకు డబ్బులు వసూలు చేశారని అదే మండలానికి చెందిన సాకమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు శాంతిపురం మండలం తుమ్మిశికి చెందిన సుబ్బమ్మ ఇంటికి సిబ్బందితో కలిసి వైద్యాధికారి వెళ్లారు. ఆ సమయానికి ఆమె లేదు కానీ, ఆమె కొడుకు, కోడలు ఉన్నారు. తమ ఆవు రోగం నయం చేసేందుకు ఇప్పటిదాకా వేలకు వేలు ఖర్చయిందని, ఎవరూ ఉచితంగా వైద్యం చేయలేదని వాళ్లూ తేల్చేశారు. పరిస్థితులు ఎదురు తిరగడంతో ఆపైన గోపాలమిత్రలు, ఏహెచ్‌ఏలు మౌనం వహించారు. ఈ పాడిరైతుల ముగ్గురితోపాటు, కుప్పం మండలం టి.సదుమూరుకు చెందిన రామచంద్ర, గుడుపల్లె మండలం కుప్పిగానిపల్లెకు చెందిన అజ్మత్‌ ఇళ్లకు వెళ్లి ఆవుల రక్త నమూనాలు సేకరించారు. కేవలం ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన పాడి రైతులనే విచారించి, వారి ఆవులనుంచే రక్త నమూనాలు స్వీకరించారు. అలా కాకుండా, నియోజకవర్గ వ్యాప్తంగా లంపీ స్కిన్‌ రోగ లక్షణాలున్న ప్రతి పశువునుంచీ రక్త నమూనాలు సేకరించి వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించాలని రైతులు కోరుతున్నారు.

ఫిర్యాదులపై విచారణకు ఆదేశం

గోపాలమిత్రలు, ఆర్బీకేల్లోని పశు సంవర్థక శాఖ సహాయకులు లంచం వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదులపై పశు సంవర్థక శాఖ డిప్యూటీ డైరెక్టర్‌ ప్రభాకర్‌ స్పందించారు. వీటిపై విచారణ జరిపించి నివేదిక ఇవ్వాలని ఏడీ ఎస్‌.రెడ్డిని ఆదేశించారు. రైతులు చెప్పినప్పుడే కాకుండా, సాధారణ సమయాల్లోనూ పశు వైద్యాధికారులు గ్రామాలను సందర్శించి పశువుల ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. ఏదైనా వ్యాధి సోకినట్లు తేలితే వెంటనే వైద్యం అందించాలన్నారు. లేదంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Updated Date - 2022-11-01T02:08:14+05:30 IST