OTP Fraud: ఓటీపీ లేకుండానే దోపిడీ!
ABN , First Publish Date - 2022-11-01T06:13:16+05:30 IST
సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు దానికి అనుగుణంగా వినియోగదారులకంటే ముందుగానే అప్‌డేట్ అవుతున్నారు. నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసినట్టుగా కార్డులు జేబులో ఉండగానే అందులో ఉన్న నగదును మాయం చేస్తున్నారు.
సైబర్ నేరగాళ్ల కొత్త ఎత్తుగడ
క్రెడిట్‌కార్డుదారులకు సైబర్ షాక్
కార్డు వివరాలు సైట్లలో సేవ్ చేయడమే కారణం?
విజయవాడలో వెలుగుచూసిన కేసు
సైబర్ పోలీసులకు సవాల్
(ఆంధ్రజ్యోతి-విజయవాడ):సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతున్న కొద్దీ సైబర్ నేరగాళ్లు దానికి అనుగుణంగా వినియోగదారులకంటే ముందుగానే అప్‌డేట్ అవుతున్నారు. నొప్పి తెలియకుండా ఆపరేషన్ చేసినట్టుగా కార్డులు జేబులో ఉండగానే అందులో ఉన్న నగదును మాయం చేస్తున్నారు. కొద్దినెలల క్రితం వరకు ఓటీపీలు పంపి, వాటిని తెలుసుకుని ఖాతాలను ఖాళీ చేసిన సైబర్ నేరగాళ్లు ఇప్పు డు వాటితో పని లేకుండానే అసలు పనిని పూర్తి చేసుకుంటున్నారు. ముఖ్యంగా క్రెడిట్ కార్డులను ఉపయోగిస్తున్న వారికి ఝలక్ ఇస్తున్నారు. సైబర్ కాప్స్‌కు తాజాగా జరుగుతున్న ఓటీపీ రహిత మోసాలు మరో తలనొప్పిగా మారాయి.
తాజా ఉదాహరణ..
విజయవాడ బృందావనకాలనీకి చెందిన జి.తిరుపతిరావు ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగి. ఆయన హెచ్‌డీఎ్‌ఫసీ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తుంటారు. షాపిం గ్ చేసిన ప్రతిసారీ బిల్లు చెల్లించే క్రమంలో కార్డును స్వైప్ చేసినప్పుడు అతడి మొబైల్ ఫోన్‌కు ఓటీపీ వచ్చేది. కొద్దిరోజుల క్రితం షాపింగ్‌కు వెళ్లినప్పుడు బిల్లు చెల్లించడానికి కార్డును స్వైప్ చేయగా అందులో నగదు నిల్వ లేదని తేలింది. కార్డు పరిమితి రూ.1.75 లక్షలు. దానిలో నుంచి రూ.1.74 లక్షలతో షాపింగ్ చేసినట్టుగా కనిపించింది. తిరుపతిరావుకు తెలియకుండా, ఎలాంటి ఓటీపీ రాకుండా ఈ మొత్తం నగదు మాయమైంది. దీంతో ఆయన నాలుగు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇలా చేస్తున్నారా...
ఆన్‌లైన్‌లో షాపింగ్ చేస్తున్న వారిలో కొంతమంది కార్డు నంబరు పిన్, సీవీవీ కోడ్, కార్డుపై ఉండే పేరును ఆయా సైట్లలో సేవ్ చేసుకుంటున్నారు. మరోసారి షాపింగ్ చేసేటప్పుడు ఈ వివరాలన్నీ నమోదు చేయకుండా ఉండేందుకు ఈవిధంగా చేస్తున్నారు. దీన్ని సైబర్ నేరగాళ్లు క్యాచ్ చేస్తున్నారని సైబర్ కాప్స్ చెబుతున్నారు. ఆయా వెబ్‌సైట్లలోకి సైబర్ నేరగాళ్ల చొరబడినప్పుడు ఇలా సేవ్ అయిన వివరాలతో షాపింగ్ చేసి నగదు ఖాళీ చేసేస్తున్నారు. అలాగే, ఫోన్‌కు ఓటీపీ రావడం, దాన్ని అవతలికి వ్యక్తులకు చెప్పడాన్ని ఓటీపీ మోసంగా పరిగణిస్తారు. ఓటీపీ రాకుండా కార్డులో ఉన్న నగదు మాయమైందం టే దాన్ని ఫారిన్ ట్రాన్సాక్షన్‌గా చూస్తున్నారు. కొంతమంది కార్డులను తీసుకున్నప్పుడు విదేశాలకు చెందిన వెబ్‌సైట్లలో షాపింగ్ చేసుకోవడానికి అనుమతి తీసుకుంటారు. వాటిల్లో షాపింగ్ చేసినప్పుడు కార్డుదారుల మొబైల్‌కు ఎలాంటి ఓటీపీ రాదు. ఓటీపీ రాకుండా ఖాతా నిల్వ తగ్గినప్పుడు 3 నెలల్లోపు ఆ మొత్తాన్ని సంబంధిత బ్యాంక్ తిరిగి ఖాతాదారుడికి చెల్లించాల్సి ఉంటుందని, ఆ బాధ్యత బ్యాంకులతేనని సైబర్ నిపుణులు చెబుతున్నారు. ప్రధానంగా కార్డు వివరాలను ఆయా సైట్లలో సేవ్ చేయకుండా ఉండడమే దీనికి పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. అలాగే, ఓటీపీ ఎవరడిగినా చెప్పకపోవడం, అనుమానం వచ్చినప్పుడు పిన్ నంబరును మార్చుకోవడం సురక్షితమంటున్నారు. అంతేకాకుండా ఓటీపీ లేకుండా నగదు కట్ అయిన సందర్భాల్లో వెంటనే ఆయా బ్యాంకర్లను సంపద్రించాలని సూచిస్తున్నారు.