వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు

ABN , First Publish Date - 2022-10-31T05:04:30+05:30 IST

టెలికాం రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ సహాయంతో వైద్యరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని రమేశ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు అన్నారు.

వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు
Ramesh Babu

‘క్లౌడ్‌ డాక్స్‌ రమేశ్‌’ వైద్యసేవలు ప్రారంభంలో డాక్టర్‌ రమేశ్‌బాబు

విజయవాడ, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): టెలికాం రంగంలో వస్తున్న నూతన టెక్నాలజీ సహాయంతో వైద్యరంగంలో కూడా విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని రమేశ్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ పోతినేని రమేశ్‌బాబు అన్నారు. ఎన్టీఆర్‌ కాలనీలోని రమేశ్‌ హాస్పిటల్‌ కార్యాలయంలో ‘క్లౌడ్‌ డాక్స్‌ రమేశ్‌’ వైద్యసేవలను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రమేశ్‌బాబు మాట్లాడుతూ.. భారత్‌లో ప్రతి లక్ష ఐసీయూ బెడ్లకు 1,500 మంది ఇంటెన్సివ్‌కేర్‌ డాక్టర్లు మాత్రమే అందుబాటులో ఉన్నారన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ కొరత ఉందని, టెలీ ఐసీయూ విధానాన్ని దీనికి పరిష్కార మార్గంగా చేసుకోవలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. దశాబ్ద కాలంగా టెలీ మెడిసిన్‌ వైద్య విధానాన్ని 5 జిల్లాల్లో ప్రభుత్వ, ప్రైవేటు వైద్యసంస్థల్లో ప్రవేశపెట్టి వేలమంది రోగులకు ఉచిత వైద్యసేవలు అందించామని, ఆ అనుభవంతో ఇప్పుడు ఈ ‘క్లౌడ్‌ డాక్స్‌ రమేశ్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. గ్రామాలు, పట్టణాలు, నగరాలలో ఉన్న ప్రైవేటు హాస్పిటల్స్‌ను స్పోక్స్‌గా పరిగణించి, ఆధునాతన పరికరాలను అక్కడ అమర్చి.. రోగి పల్స్‌ రేట్‌ దగ్గర నుంచి హర్ట్‌ రేట్‌, టెంపరేచర్‌, లాబొరేటరీ రిపోర్టుల విశ్లేషణ, వెంటిలేటర్‌పై ఉన్న రోగుల మానిటరింగ్‌ను రమేశ్‌ హాస్పిటల్స్‌ హబ్‌ నుంచి చూసే విధంగా ఏర్పాటు చేశామని చెప్పారు.

తద్వారా మరణాల రేటుని 40 శాతం వరకు తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, స్టెమీ ఇండియా డైరెక్టర్‌ డాక్టర్‌ థామస్‌ అలెగ్జాండర్‌, జి.వి.కే.ఈ.ఎం.ఆర్‌.ఐ డైరెక్టర్‌ రమణారావు, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్‌ కుమార్‌, నేషనల్‌ హెల్త్‌ అథారిటీ డైరెక్టర్‌ కిరణ్‌గోపాల్‌, రమేశ్‌ హాస్పిటల్స్‌ క్లస్టర్‌ సీఈవో దేవానంద్‌, చైర్మన్‌ మద్దిపాటి సీతారామ్మోహన్‌రావు పాల్గొన్నారు.

క్లౌడ్‌ డాక్స్‌ అంటే ఏమిటి..?

వైద్యులు ఔట్‌ పేషంట్లకు ఇంటి వద్దే వైద్యసేవలందించే వైద్య విధానం. చిన్న చిన్న రోగాలకు, రెగ్యులర్‌ ఫాలో అప్‌ వైద్యసేవల కోసం రోగులు ఆస్పత్రులకు పరుగులు తీయడం, అక్కడ గంటల తరబడి వేచి ఉండటం పెద్ద సమస్యగా ఉంది. ఈ విధానానికి ప్రత్యామ్నాయంగా టెలీ మెడిసిన్‌ సేవలను అందుబాటులోకి తెస్తున్నారు. ఈ తరహా సేవలనే.. విజయవాడ రమేశ్‌ హాస్పిటల్స్‌ ‘క్లౌడ్‌ డాక్స్‌ రమేశ్‌’ పేరుతో ప్రారంభించింది. ఈ విధానంలో టెలీ ఐసీయూ విధానాన్ని కూడా అందుబాటులోకి తెస్తున్నారు. డిజిటల్‌ టెక్నాలజీతో ఆస్పత్రిలో అడ్మిట్‌ అయిన రోగుల ఆరోగ్య పరిస్థితిని 24 గంటలూ కూలంకుషంగా విశ్లేషిస్తూ ఎప్పటికప్పుడు అక్కడ నర్సులను, డాక్టర్లను అప్రమత్తం చేస్తుంటారు. దీని కోసం ప్రముఖ డీఎం క్రిటికల్‌ కేర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ ధరణీంద్ర ఆధ్వర్యంలో క్రిటికల్‌కేర్‌ స్పెషలిస్టులు, మల్టీస్పెషాలిటీ వైద్యనిపుణులు, నర్సులతో ఒక ప్రత్యేక హబ్‌ను.. కమాండ్‌ కంట్రోల్‌తో అనుసంధానం చేస్తారు. ఇక్కడి నుంచి డాక్టర్లు పర్యవేక్షిస్తూ రోగుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం సలహాలు, సూచనలు అందిస్తుంటారు.

Updated Date - 2022-10-31T05:04:32+05:30 IST