ఎస్వీబీసీ సలహాదారుగా సింగర్ మంగ్లీ
ABN , First Publish Date - 2022-11-22T02:12:48+05:30 IST
శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) పాలకవర్గ సలహాదారుగా గాయని మంగ్లీ(ఎం.సత్యవతి) నియమితులైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

మార్చిలోనే నియామక ఉత్తర్వులు
రెండేళ్ల పదవీకాలం
నెలకు రూ.లక్ష గౌరవ వేతనం
ఇప్పటివరకు వెల్లడించని టీటీడీ
తిరుపతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): శ్రీవేంకటేశ్వర భక్తి చానల్(ఎస్వీబీసీ) పాలకవర్గ సలహాదారుగా గాయని మంగ్లీ(ఎం.సత్యవతి) నియమితులైన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల కాలానికి ఆమెను నియమిస్తూ ఈ ఏడాది మార్చి 29నే ఎస్వీబీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉత్తర్వులు జారీ చేశారు. నెలకు రూ.లక్ష చొప్పున గౌరవ వేతనం చెల్లించడంతోపాటు, ఆమె తిరుపతి పర్యటనకు వచ్చినప్పుడల్లా వాహన, వసతి సౌకర్యాలు కల్పించనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 1.4.2022 నుంచే ఈ నియామకం అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. అయితే ఈ నియామక విషయాన్ని ప్రభుత్వంగానీ, ఎస్వీబీసీగానీ ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మంగ్లీ కూడా ఈ విషయాన్ని వెల్లడించలేదు. ఈనెల 17న మంగ్లీ తిరుమలకు విచ్చేసి రెండ్రోజులు కొండపై గడిపి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా నియామక ఉత్తర్వు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. సలహాదారు నియామకంపై ఇంత గోప్యత పాటించాల్సిన అవసరం ఏమిటనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది.