నవోదయ హాల్ టికెట్లపై గందరగోళం! 3 వేల మందికి సమస్య !
ABN , First Publish Date - 2022-04-26T18:27:34+05:30 IST
ఆలిండియాలో ఈనెల 30వ తేదీ నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో దేశవ్యాప్తంగా 3 వేల మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 15 నవోదయ విద్యాలయాల్లో..

సబ్ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
మదనపల్లె టౌన్, ఏప్రిల్ 25: ఆలిండియాలో ఈనెల 30వ తేదీ నిర్వహించనున్న జవహర్ నవోదయ విద్యాలయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల్లో దేశవ్యాప్తంగా 3 వేల మంది విద్యార్థులు గందరగోళంలో పడిపోయారు. రాష్ట్రంలోని 13 జిల్లాలకు గాను 15 నవోదయ విద్యాలయాల్లో ఆన్‌లైన్‌లో ప్రవేశపరీక్షకు దరఖాస్తు చేసుకున్న చాలామంది విద్యార్థులకు హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాలేదు. నవోదయ ప్రవేశ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా వారికి రిజిస్ట్రేషన్ నెంబర్లు వచ్చాయి. తీరా ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు ప్రయత్నించగా చాలామందికి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాలేదు. డౌన్‌లోడ్ చేసుకునే ముందు ట్రయల్ రన్ నిర్వహించగా విద్యార్థులు ఈ లింకును ఓపెన్ చేయడంతో అసలు సమస్య వచ్చినట్లు తెలుస్తోంది. ఇద్దరేసి విద్యార్థులకు ఒకే రిజిస్ట్రేషన్ నెంబరు చూపిస్తుండటం, హాల్ టికెట్లు డౌన్‌లోడ్ కాకపోవడం, సమయం మించి పోతుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టరేట్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఆరు నెలల పాటు మా బిడ్డను నవోదయ ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇప్పించాము..ఇప్పుడు చూస్తే ప్రవేశ పరీక్షకు హాల్ టికెట్లు మంజూరు కావడం లేదంటూ 38 మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ జవహర్ నవోదయ ప్రవేశ పరీక్ష ఉందన్నారు. ఈ పరీక్ష రాయడానికి తమ పిల్లలు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోగా వారికి రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చారన్నారు. ఇటీవల రిజిస్ట్రేషన్ నెంబర్లను పరిశీలించగా ఇద్దరేసి విద్యార్థులకు ఒకే రిజిస్ట్రేషన్ నెంబర్లు ఇచ్చారన్నారు. అది కాకుండా తమ పిల్లలకు హాల్‌టికెట్లు కూడా ఆన్‌లైన్‌లో చూపించలేదన్నారు. ఆర్డీవో మురళి దృష్టికి సమస్యను తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ కాశయ్య మాట్లాడుతూ ఈ సమస్యపై గత శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రులు తన దృష్టికి తీసురాగా, హైదరాబాద్‌లోని సౌత్ రీజియన్ నవోదయ సమితికి, చిత్తూరు డీఈవో దృష్టి తీసుకెళ్లామన్నారు. విద్యార్థులు ట్రయల్ లింకులో అప్లై చేయడంతో ఇలా జరిగి ఉంటుందన్నారు. ఢిల్లీలోని నవోదయ విద్యాలయ సమితి కమిషనర్ వినాయక్‌దత్‌కు సమస్యను విన్నవిస్తామని తెలిపారు.