High Court Madurai: కళ తప్పిన అవార్డులు

ABN , First Publish Date - 2022-11-19T08:37:10+05:30 IST

కళల గురించి తెలియని వారికికూడా ‘కలైమామణి’ అవార్డులిస్తున్నారని, దీంతో అవార్డులంటేనే గౌరవం లేకుండా పోతోందని హైకోర్టు మదురై(High

High Court Madurai: కళ తప్పిన అవార్డులు

- ‘కలైమామణి’ కేసులో హైకోర్టు మదురై ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు

- నాటక మండ్రం సరిగ్గా పని చేయకుంటే రద్దు చేస్తామని హెచ్చరిక

చెన్నై, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): కళల గురించి తెలియని వారికికూడా ‘కలైమామణి’ అవార్డులిస్తున్నారని, దీంతో అవార్డులంటేనే గౌరవం లేకుండా పోతోందని హైకోర్టు మదురై(High Court Madurai) ధర్మాసనం తీవ్రంగా వ్యాఖ్యానించింది. కలైమామణి అవార్డు ఏ ప్రాతిపదికన ఇస్తారు, అవార్డుకు కళాకారులను ఎలా ఎంపిక చేస్తారో తెలియజేయాలని ఆదేశించింది. కళారంగంలో విశేష కృషి చేసిన వారికి ఇవ్వాల్సిన కలైమామణి అవార్డు రెండు చిత్రాల్లో నటిస్తే చాలు పొందవచ్చనే భావన కనిపిస్తోందని పేర్కొంది. సాహితి, సంగీతం, నాటక మండ్రం సక్రమంగా పనిచేయడం లేదని, ఇదే పరిస్థితి కొనసాగితే ఆ మండ్రాన్ని రద్దు చేసే అవకాశముందని హెచ్చరించింది. 2019-20 సంవత్సర కలైమామణి అవార్డులు ఏ ప్రాతిపాదికన ఇచ్చారో, ఎవరెవరికి ఇచ్చారో తెలియజేయాలని, ఆ వివరాలన్నింటినీ తమ ముందుంచాలని తమిళనాడు(Tamil Nadu) పర్యాటక, కళల శాఖ కార్యదర్శి, తమిళనాడు సాహితి, సంగీత, నాటక మండ్రం అధ్యక్షుడు, కార్యదర్శి తదితరులను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.మహాదేవన్‌, జస్టిస్‌ జె.సత్యనారాయణప్రసాద్‌లతో కూడిన మదురై ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2019-20 సంవత్సరాలకు గాను గత ఏడాది ఇచ్చిన కమలైమామణి అవార్డుల్లో పలు అక్రమాలు జరిగాయంటూ తిరునల్వేలికి చెందిన సముద్రం అనే వ్యక్తి దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ జరిపిన ధర్మాసనం ఈ మేరకు స్పందించింది. అంతకు ముందు పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తమిళనాడు సాహితి, సంగీతం, నాటక మండ్రం ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉత్తమ కళాకారులకు ‘కలైమామణి’ పురస్కారం ఇస్తారని తెలిపారు. 18 ఏళ్లలోపు వారికి ‘కలై ఇళమణి’, 19-35 ఏళ్ల వారికి ‘కళ వలర్మతి’, 36-50 ఏళ్లవారికి ‘కలై సుడర్‌మణి’, 51 - 60 ఏళ్లవారికి ‘కలై నన్మణి’, 61 ఏళ్లు పైబడిన వారికి ‘కలై ముదుమణి’ అవార్డులు ఇస్తారన్నారు. వాటిలో ‘కలైమామణి’ అవార్డు ఇప్పటివరకు వయస్సు, అర్హత ప్రకారం ఇవ్వడంలేదన్నారు. 2019-20 సంవత్సరానికి సంబంధించిన ‘కలైమామణి’ అవార్డు 2021 ఫిబ్రవరి 20న ప్రదానం చేశారని తెలిపారు. ఆ సమయంలో అర్హత లేని వారికి కలైమామణి అవార్డు ఇచ్చారన్నారు. సాహితి, సంగీతం, నాటక మండ్రం సభ్యుల కార్యదర్శి, అధ్యక్షుడు సంతకం లేకుండా ప్రశంసాపత్రాలు అందజేశారన్నారు. అర్హత లేని వారికిచ్చిన కలైమామణి అవార్డు వెనక్కి తీసుకోవాలని కోరుతూ అధికారులకు వినతిపత్రం సమర్పించినా తగిన స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలో, అర్హత లేని వారికి అందజేసిన కలైమామణి అవార్డును వెనక్కి తీసుకొనేలా ఉత్తర్వులు జారీచేయాలని పిటిషన్‌లో అభ్యర్థించారు.

Updated Date - 2022-11-19T08:37:13+05:30 IST