G-20 Summit : జీ20 సదస్సు ప్రకటనలో మారుమోగిన మోదీ సందేశం
ABN, First Publish Date - 2022-11-16T16:03:52+05:30
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన సందేశం జీ20 సదస్సు పత్రికా ప్రకటన
బాలి (ఇండోనేషియా) : రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఇచ్చిన సందేశం జీ20 సదస్సు పత్రికా ప్రకటన (G20 Communique)లో మారుమోగుతోంది. ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం ప్రభావం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై మరింత ప్రతికూలంగా ఉన్న విషయాన్ని ఈ ప్రకటన గుర్తు చేసింది. ఈ సమస్యపై చర్చ జరిగిందని, ఇతర వేదికలపై వ్యక్తం చేసిన వైఖరులను పునరుద్ఘాటించామని తెలిపింది. ఉక్రెయిన్‌పై రష్యా దూకుడును గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు పేర్కొంది. బేషరతుగా ఉక్రెయిన్ నుంచి వెనుకకు రావాలని డిమాండ్ చేసింది.
ఈ ఏడాది సెప్టెంబరులో ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్‌లో జరిగిన షాంఘై సహకార సంఘం (SCO) సమావేశం సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లదిమిర్ పుతిన్ (Vladimir Putin)తో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ, ఇది యుద్ధాలు చేసే కాలం కాదని పుతిన్‌కు చెప్పారు. ఈ సందేశ సారం బుధవారం జీ20 సదస్సు ప్రకటనలో ప్రతిధ్వనించింది. ‘‘ఈ కాలం యుద్ధాలది కాకూడదు’’ అని పేర్కొంది.
‘‘ఉక్రెయిన్ (Ukraine)లో యుద్ధం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను మరింత ప్రతికూలంగా ప్రభావితం చేయడం ఈ ఏడాది మనం చూస్తున్నాం. దీనిపై చర్చ జరిగింది. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి (UNSC), ఐక్య రాజ్య సమితి సాధారణ సభ సహా ఇతర వేదికలపై మేం వ్యక్తం చేసిన మా దేశాల వైఖరులను పునరుద్ఘాటించాం. 2022 మార్చి 2న తీర్మానం నెం.ES-11/1 మోజారిటీ ఓటుతో ఆమోదం పొందింది. (141 ఓట్లు అనుకూలంగా, 5 ఓట్లు ప్రతికూలంగా వచ్చాయి). ఈ తీర్మానం ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఉక్రెయిన్ భూభాగం నుంచి పూర్తిగా, బేషరతుగా ఉపసంహరించుకోవాలని రష్యాను కోరింది’’ అని బుధవారం జీ20 ప్రకటన పేర్కొంది.
ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని G20 సభ్యుల్లో అత్యధికులు ఖండించారని తెలిపింది. దీనివల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలిపింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత లోటుపాట్లు మరింత పెరుగుతున్నాయని పేర్కొంది. ఈ యుద్ధం వృద్ధిని కట్టడి చేస్తూ, ద్రవ్యోల్బణాన్ని పెంచుతోందని, సరఫరా వ్యవస్థలకు తీవ్ర అంతరాయం కలిగిస్తోందని పేర్కొంది. మరోవైపు ఇంధనం, ఆహార భద్రతలకు ముప్పును పెంచుతోందని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వానికి ముప్పులను మరింత పెంచుతున్నట్లు తెలిపింది.
రష్యా, చైనా దేశాల అభిప్రాయాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుత పరిస్థితులు, ఆంక్షల గురించి ఈ రెండు దేశాలకు ఇతర అభిప్రాయాలు, అంచనాలు ఉన్నాయని ఈ ప్రకటన పేర్కొంది. భద్రతా సమస్యలను పరిష్కరించే వేదిక జీ20 సదస్సు కాదని, అయితే భద్రతా సమస్యల పర్యవసానాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చెప్పుకోదగ్గ విధంగా ఉండవచ్చునని పేర్కొంది. శాంతి, సుస్థిరతలను కాపాడే అంతర్జాతీయ చట్టాలు, మల్టీలేటరల్ సిస్టమ్‌లను సమర్థించడం చాలా ముఖ్యమని తెలిపింది.
జీ20 సదస్సు ఔట్‌కమ్ డాక్యుమెంట్ చర్చలు విజయవంతం కావడం కోసం భారత దేశం ముఖ్య పాత్రను పోషించిందని ఫారిన్ సెక్రటరీ వినయ్ క్వాట్రా చెప్పారు. మన దేశ వైఖరి నిర్మాణాత్మకంగా, సహకారాత్మకంగా ఉందన్నారు.
Updated Date - 2022-11-16T16:03:58+05:30 IST