One way road bridge: కష్టాలు తీరనున్నాయ్..
ABN , First Publish Date - 2022-09-17T13:24:50+05:30 IST
చెన్నై నగర శివారు ప్రాంతాల్లో ఒకటైన పెరంగళత్తూరులో చెన్నై - తిరుచ్చి(Chennai - Trichy) జాతీయ రహదారిపై నిత్యం వాహనచోదకులు నరకయాతన

- పెరుంగళత్తూరు ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
- ప్రారంభోత్సవానికి వంతెన సిద్ధం
అడయార్(చెన్నై), సెప్టెంబరు 16: చెన్నై నగర శివారు ప్రాంతాల్లో ఒకటైన పెరంగళత్తూరులో చెన్నై - తిరుచ్చి(Chennai - Trichy) జాతీయ రహదారిపై నిత్యం వాహనచోదకులు నరకయాతన అనుభవిస్తున్నారు. ఉదయం, సాయంత్రం తీవ్రమైన ట్రాఫిక్ సమస్య ఎదుర్కొంటున్నారు. ఈ కారణంగా గంటల కొద్దీ వాహనాలు బారులు తీరుతున్నాయి. ఈ సమస్యకు తాత్కాలిక ఉపశమనం కలిగించనున్నారు. ఇందులోభాగంగా ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న వన్ వే రోడ్డు(One way road) వంతెన త్వరలో అందుబాటులోకి రానుంది. ఈ కారణంగా కొంతమేరకు ట్రాఫిక్ సమస్య పరిష్కారం కానుంది. ముఖ్యంగా ప్రధాన రద్దీ సమయాలతో పాటు వారాంతపు రోజుల్లో వాహన చోదకులు ఈ సమస్య నుంచి బయటపడనున్నారు.
పండగ సీజన్లో నరకమే..
పండగ సీజన్లో ఇక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే నరకంతో సమానం. ఆయుధపూజ, దీపావళి, సంక్రాంతి(Diwali and Sankranti) పండుగలకు తమ సొంతూర్లకు వెళ్ళి వచ్చే వాహనాలు కిలోమీటర్ల కొద్దీ బార్లు తీరేవి. ఈ ప్రాంతాన్ని దాటేందుకు వాహనచోదకులకు కొన్ని గంటల సమయం పట్టేంది. ఈ సమస్య పరిష్కారం కోసం ఇక్కడ వంతెన నిర్మాణానికి ప్రభుత్వం పూనుకుంది.
2000-01లో శంకుస్థాపన...
ఈ వంతెన నిర్మాణం కోసం 2000-01 సంవత్సరంలో శంకుస్థాపన చేశారు. ఇందుకోసం రూ.76 కోట్లను ఖర్చు చేసేందుకు జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అంగీకారం కుదిరింది. కానీ, పనులు మాత్రం ప్రారంభంకాలేదు.
రూ.76 కోట్ల నుంచి రూ.234 కోట్లకు పెంపు
అనుకున్న సమయంలో ఈ వంతెన నిర్మాణ పనులు ప్రారంభంకాలేదు. రెండు దశాబ్దాల పాటు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మిగిలిపోయాయి. ఈ క్రమంలో 2020లో ఈ వంతెన నిర్మాణం కోసం మళ్ళీ టెండర్లు ఆహ్వానించారు. అపుడు నిర్మాణ వ్యయం రూ.76 కోట్ల నుంచి రూ.234 కోట్లకు పెరిగిపోయింది.
కరోనాలో జాప్యం...
టెండర్లు ఖరారు చేసిన వెంటనే ఈ నిర్మాణ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. కానీ, కరోనా మహమ్మారితో పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంది. దీనితోడు పుదు పెరుంగళత్తూరు శ్రీనివాస నగర్ - నెడుకుండ్రం రహదారి మార్గంలో స్థల సేకరణలో సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఈ కారణంగా ఇక్కడ పనులు ఆగిపోగా, జీఎస్టీ రోడ్డు - చెంగల్పట్టు మార్గంలో మాత్రం ఈ పనులు శరవేగంగా పూర్తిచేశారు. అదేవిధంగా ఇతర సమస్యలను కూడా పరిష్కరించి వంతెన నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తి చేశారు. ఫలితంగా త్వరలోనే ఈ వంతెనను వాహనాల వినియోగాని తీసుకునిరానున్నారు.