Rahul Gandhi: మీడియాను బీజేపీ నాయకులు నియంత్రిస్తున్నారు
ABN, First Publish Date - 2022-11-28T16:48:00+05:30
తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని రాహుల్ ఆరోపించారు.
ఇండోర్: భారత్ జోడో యాత్రలో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్యప్రదేశ్ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేసేందుకు బీజేపీ భారీగా ఖర్చు చేస్తోందని రాహుల్ ఆరోపించారు. మీడియాలో రైతుల కష్టాలు తెలియజేసే వార్తలు రావడం లేదని కేవలం బీజేపీ నాయకులు మాత్రమే కనపడుతున్నారని రాహుల్ చెప్పారు. మీడియాను బీజేపీ నాయకులు నియంత్రిస్తున్నారని రాహుల్ ఆరోపించారు. తాను సరైన దారిలో వెళ్తున్నందుకే తనపై వ్యక్తిగత దాడులు చేస్తున్నారని రాహుల్ చెప్పారు. పాదయాత్ర తనకు కొత్త అనుభవాన్నిచ్చిందన్నారు. అయితే రాజకీయాల కోసం తాను భారత్ జోడో యాత్ర చేపట్టడం లేదని రాహుల్ స్పష్టం చేశారు.
అమేథీలో పోటీ చేసే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేనని రాహుల్ చెప్పారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సచిన్ పైలట్‌ను ద్రోహి అనడంపై రాహుల్ స్పందించారు. ఎవరు ఏమన్నారనే విషయంలోకి తాను వెళ్లాలనుకోవడం లేదని, ఇద్దరు నేతలూ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమని చెప్పారు. గెహ్లాట్ వ్యాఖ్యలు రాజస్థాన్‌లో తన భారత్ జోడో యాత్రకు విఘాతం కలిగించవని రాహుల్ చెప్పారు.
Updated Date - 2022-11-28T16:49:30+05:30 IST