Ashok Gehlot: గెహ్లాట్ కీలక నిర్ణయం
ABN, First Publish Date - 2022-12-19T19:17:45+05:30
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అల్వార్: రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉజ్వల్ పథకం లబ్దిదారులకు వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి 500 రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తామని ప్రకటించారు. దారిద్ర్య రేఖకు దిగువనున్న వారికి ఏడాదికి 12 సిలిండర్లను ఇదే ధరతో అందిస్తామన్నారు. ధరల పెరుగుదల కారణంగానే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలందరికీ అందాలనేదే తమ లక్ష్యమని చెప్పారు. భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీతో కలిసి ఆయన అల్వార్‌లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.
రాజస్థాన్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అయితే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఇప్పటినుంచే అమలు చేస్తామని మాత్రం గెహ్లాట్ చెప్పలేదు.
రాజస్థాన్‌లో ప్రస్తుతం కాంగ్రెస్ అధికారంలో ఉంది. యువ నేత సచిన్ పైలట్‌ను తీవ్రంగా విమర్శిస్తూ అవమానిస్తున్న గెహ్లాట్ ఇటీవల కూడా ఆయనపై నోరుపారేసుకున్నారు. రాష్ట్రాన్ని పాలించే సామర్థ్యం సచిన్ పైలట్‌కు లేదనేది గెహ్లాట్ వాదన. దీనిపై పైలట్, ఆయన వర్గీయులు గుర్రుగా ఉన్నా ఏమీ చేయలేకపోతున్నారు. ఇద్దరూ పార్టీకి కావాల్సిన వారేనని రాహుల్ గాంధీ నచ్చచెప్పడంతో ప్రస్తుతానికి వివాదం సద్దుమణిగింది. అయితే ఎన్నికల వేళ మళ్లీ రచ్చ జరగొచ్చని తెలుస్తోంది.
రాజస్థాన్‌లో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారడం సంస్కృతిగా వస్తోంది. అదే సమయంలో ఎన్నికల్లో విజయానికి బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. దీంతో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు గెహ్లాట్ ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోవడం లేదు.
Updated Date - 2022-12-19T19:19:55+05:30 IST